ఏటీఎం నుంచి డబ్బుల అపహరణ

12 Jul, 2017 14:09 IST|Sakshi
ఏటీఎం నుంచి డబ్బుల అపహరణ

► పోలీస్‌స్టేషన్‌లో బాధితురాలి ఫిర్యాదు

స్టేషన్‌ఘన్‌పూర్‌: ఫోన్‌లో ఏటీఎం నంబర్‌ అడిగి మండలంలోని రాఘవాపూర్‌కు చెందిన అంగన్‌వాడీ ఆయా షేక్‌ ముంతాజ్‌బేగం బ్యాంకు అకౌంట్‌ నుంచి ఓ అపరిచిత వ్యక్తి రూ.14వేలు అపహరించిన సంఘటన సోమవారం జరిగింది. ఈ విషయమై మంగళవారం బాధితురాలు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడింది. రాఘవాపూర్‌కు చెందిన షేక్‌ముంతాజ్‌బేగంకు  ఘన్‌పూర్‌ ఎస్‌బీహెచ్‌లో ఖాతా ఉంది.

సోమవారం గుర్తుతెలియని వ్యక్తి 7808201136 నంబర్‌ నుంచి ఫోన్‌ చేసి తాను బ్యాంకు నుంచి మాట్లాడుతున్నానని, మీ ఏటీఎం బ్లాక్‌ అయిందని, ఏటీఎం నంబర్‌ చెప్పాలని అడగగా 16 అంకెల నంబర్‌ చెప్పింది. నంబర్‌ చెప్పిన గంటలోపే తన అకౌంట్‌నుంచి రూ.9999, మరి కొద్దిసేపట్లో రెండు సార్లు రూ.2వేల చొప్పున డ్రా అయినట్లు సెల్‌ మెసేజ్‌ వచ్చింది.  మొత్తం మూడు విడతలుగా రూ.14వేలు డ్రా చేసుకున్నారని, వెంటనే స్థానిక ఎస్‌బీఐకు చేరుకుని బ్యాంకు మేనేజర్‌కు ఫిర్యాదు చేసి ఏటీఎంను బ్లాక్‌ చేయించింది. ప్రస్తుతం అపరిచిత వ్యక్తికి ఫోన్‌ చేస్తే స్విచాఫ్‌ వస్తుందని, ఈ విషయమై పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశామని, నిందితుడిని గుర్తించి తనకు న్యాయం చేయాలని ఆమె కోరింది.

మరిన్ని వార్తలు