కుటుంబం మొత్తం క్యూలోనే..

17 Dec, 2016 21:50 IST|Sakshi
బ్యాంకు ముందు టోకెన్ కోసం నిలబడ్డ చిన్నమ్మ ..

సాక్షి, సిటీబ్యూరో: ఈ ఫొటోలో కనిపిస్తున్న వృద్ధురాలి పేరు చిన్నమ్మ. ఫిలింనగర్‌ సైదప్ప బస్తీలో నివాసం. నోట్ల కష్టాలు ఈమె కుటుంబంతో ఎంతగా ఆడుకుంటున్నాయో నిరూపించే ఘటన ఇది. ప్రతిరోజూ జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెం. 72లోని ఫిలింనగర్‌ ఎస్‌బీఐ శాఖకు ముందు వచ్చిన 150 మందికి టోకెన్లు ఇస్తోంది. వీటి కోసం తెల్లవారుజాము నుంచే ఖాతాదారులు లైన్లో నిలబడుతున్నారు. చిన్నమ్మ కుటుంబ సభ్యులు కూడా టోకెన్ కోసం వంతులు వారీగా క్యూలో నిలబడుతున్నారు. తెల్లవారుజామునే ఆమె మనవడు, పదో తరగతి చదువుతున్న రాము వచ్చి క్యూలైన్లో నిలబడ్డాడు.

బడికి టైం కావడంతో 9.30 గంటలకు చిన్నమ్మ వచ్చి లైనులో నిలబడి మనవడిని పంపించింది. ఇళ్లల్లో పనిచేసే ఈమె కూతురు సంతీవమ్మ 11 గంటలకు ఇళ్లల్లో పనులు ముగించుకొని వచ్చి క్యూలో నిలబడి తల్లిని ఇంటికి పంపించింది. తీరా సంజీవమ్మ వంతు వచ్చేసరికి క్యూలైన్ టోకెన్లు అయిపోపవడంతో ‘రేపు రండి’ అంటూ బ్యాంకు సిబ్బంది వెనక్కి పంపారు. రూ.1000 కోసం తెల్లవారి నుంచి మనవడు, అవ్వ, ఆమె కూతురు లైన్లో నిలబడ్డా టోకెన్ దొరకలేని పరిస్థితి చేసేది లేక ఉస్సూరుమంటూ వెనుదిరిగింది. నగదు కోసం ప్రజలు పడుతున్న పాట్లకు నిదర్శనం ఈ ఉదంతం.  



 

మరిన్ని వార్తలు