గన్‌జాటం!

21 Sep, 2017 07:37 IST|Sakshi
గన్‌జాటం!

స్టేటస్‌ సింబల్‌గా తుపాకీ
జిల్లాలో కనిపించని ఫ్యాక్షన్, నక్సలిజం
అయినా పెరిగిన దరఖాస్తులు
లైసెన్స్‌ జారీలో ఆచితూచి అడుగులు
అదుపుతప్పితే ముప్పే
లోతుగా విశ్లేషిస్తున్న పోలీసులు


అనంతపురం అర్బన్‌ :
చెప్పుకోదగ్గ ఫ్యాక్షన్‌ లేదు.. నక్సలిజం జాడ కనిపించట్లేదు.. ప్రత్యేకంగా ముప్పు ఉన్నట్లు ఎవరూ ముందుకు రాలేదు.. ఇక ప్రజాప్రతినిధులకు ఎలాగూ ప్రభుత్వం గన్‌మెన్లను కేటాయిస్తోంది. ఇవన్నీ పరిశీలిస్తే ప్రత్యేకంగా ఎవరికీ గన్‌తో పని లేదనేది సుస్పష్టం. అయితే గన్‌ కలిగి ఉండటం స్టేటస్‌గా భావిస్తున్నట్లు ఇటీవల కాలంలో చేసుకున్న దరఖాస్తులను చూస్తే అర్థమవుతుంది. జిల్లాలో నెలకొన్న తాజా పరిస్థితి ఆందోళన కలిగిస్తోంది. అధికారిక లెక్కల ప్రకారం 400 మందికి గన్‌ లైసెన్స్‌లు ఉండగా.. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు కొత్తగా 23 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పటికే లైసెన్స్‌ ఉండి రెన్యూవల్‌ కోసం 51 మంది దరఖాస్తు చేశారు. ఈ రెండింటికీ 74 దరఖాస్తులు వచ్చినట్లు అధికారుల ద్వారా తెలిసింది. ఇందులో 8 మందికి లైసెన్స్‌ మంజూరయింది. 11 మంది దరఖాస్తులను వివిధ కారణాలతో తిరస్కరించగా.. 55 దరఖాస్తులు పరిశీలనలో ఉన్నాయి.

స్టేటస్‌ కోసమేనా..
ఒకప్పుడు జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో ఫ్యాక్షన్‌ జాడ ఉంది. ఆ క్రమంలో కొందరు తమ ప్రత్యర్థుల నుంచి ముప్పు ఉందనే ఉద్దేశంతో గన్‌లైసెన్స్‌ పొందారు. ప్రస్తుతం జిల్లాలో ఫ్యాక్షన్‌ సద్దుమణిగింది. అదేవిధంగా ఒకప్పుడు నక్సలిజం కూడా కొన్ని ప్రాంతాల్లో కనిపించింది. ఈ క్రమంలో ఆయా కారణాలు చూపిస్తూ గతంలో కొందరు గన్‌లైసెన్స్‌ పొందినా.. ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారింది. ఫ్యాక్షనిజం, నక్సలిజం కనుమరుగయ్యింది. ప్రజాప్రతినిధులకు ప్రభుత్వం ప్రత్యేకంగా 1+1 తక్కువ కాకుండా, వారి స్థాయిని బట్టి గన్‌మెన్‌లను కేటాయిస్తోంది. ప్రాణాలకు ముప్పు ఉందని గుర్తించిన వారికీ గన్‌మెన్‌లను మంజూరు చేస్తున్నారు. వీరే కాకుండా కొత్తగా లైసెన్స్‌ కోసం పదుల సంఖ్యలో దరఖాస్తులు దాఖలు అవుతుండటం చూస్తే గన్‌ సంస్కృతికి పెరుగుతున్న విషయం స్పష్టంగా తెలుస్తోంది. గన్‌ కలిగి ఉండటం స్టేటస్‌గా భావిస్తుండటం వల్లే ఈ పరిస్థితి నెలకొన్నట్లు చర్చ జరుగుతోంది.

సూక్ష్మ పరిశీలన తర్వాతే మంజూరు
గతంలో గన్‌ లైసెన్స్‌ని అప్పటి పరిస్థితుల ఆధారంగా ఇచ్చేవారు. ప్రస్తుతం జిల్లా పరిస్థితులు పూర్తిగా మారడంతో లైసెన్స్‌ మంజూరులో అధికారులు సూక్ష్మ పరిశీలన చేస్తున్నారు. దరఖాస్తు చేసుకున్న వారి నేపథ్యం, వారికి నిజంగా ప్రత్యర్థుల నుంచి ముప్పు ఉందా? వారు చూపుతున్న కారణంలో నిజం ఎంత? గన్‌ లేకపోతే ప్రాణ హాని ఉంటుందా? పోలీసు ప్రొటెక్షన్‌ కలిగి ఉన్నారా? ఒకవేళ ఇప్పటికే కలిగి ఉన్న లైసెన్స్‌కి నిర్ణీత గడువులో రెవెన్యూవల్‌కి దరఖాస్తు చేసుకున్నారా? ఇలా దరఖాస్తుదారునికి సంబంధించిన అన్ని అంశాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అన్ని విధాల సంతృప్తి చెందితేనే లైసెన్స్‌ మంజూరు చేయడం.. లేదా రెన్యూవల్‌ చేయడం చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

లైసెన్స్‌లకు రెకమండ్‌ చేయట్లేదు
గన్‌ లైసెన్స్‌కు కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి రెకమెండ్‌ చేయడం లేదు. రెన్యూవల్‌కి వచ్చిన దరఖాస్తులను విచారణకు పంపుతాం. కొందరు లైట్‌ థ్రెట్‌ ఉందంటున్నారు. అందులో వారు పేర్కొన్న కారణాల ప్రకారం థ్రెట్‌ ఉందా లేదా అనేది పరిశీలిస్తాం. ఆ తర్వాతే రెన్యూవల్‌ చేస్తాం. నేను బాధ్యతలు తీసుకున్న తర్వాత లైసెన్స్‌లకు రెకమెండ్‌ చేయలేదు. బ్యాంక్‌ సెక్యూరిటీ గార్డ్స్‌ చాలా మంది ఉన్నారు. వారికి మాత్రమే రెకమెండ్‌ చేస్తున్నాం. – జి.వి.జి.అశోక్‌కుమార్, జిల్లా ఎస్పీ

>
మరిన్ని వార్తలు