పుష్కరాలకు లోటు లేకుండా బస్సులు

13 Aug, 2016 01:46 IST|Sakshi
కృష్ణ పుష్కరాల స్పెషల్‌ బస్సును ప్రారంభిస్తున్న ఆర్‌ఎం నాగశివుడు

తిరుపతి అర్బన్‌:  కృష్ణ పుష్కరాలకు వెళ్లాలనుకునే భక్తుల కోసం ఎలాంటి ఇబ్బందులు తలెత్తని విధంగా బస్సులు నడిపేందుకు అన్ని చర్యలు తీసుకున్నట్లు తిరుపతి ఆర్టీసీ రీజనల్‌ మేనేజర్‌ నాగశివుడు తెలిపారు. పుష్కరాల  స్పెషల్‌ బస్సును శుక్రవారం ఉదయం ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా తిరుపతి డిపో గ్యారేజీ వద్ద నిర్వహించిన  కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ గత గోదావరి పుష్కరాలకు 12 రోజుల పాటు 420 బస్సులను నడిపితే, ఈసారి కృష్ణ పుష్కరాలకు 500కు పైగా బస్సులను నడపాలన్న లక్ష్యంతో ఉన్నామన్నారు.  ఆదాయంతో నిమిత్తం లేకుండా పుష్కర యాత్రికులకు సేవ చేయడమే ప్రధాన ధ్యేయంగా బస్సులను నడిపేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుందని తెలిపారు. అందులో భాగంగా జిల్లాలోని అన్ని డిపోల నుంచి రోజుకు 40 నుంచి 50 బస్సుల వరకు పుష్కరాలకు నడపాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. ఎవరైనా యాత్రికులు గ్రూప్‌గా వెళ్లాలనుకుంటే ప్రత్యేక బస్సును ఏర్పాటు చేస్తామన్నారు.  ఈ కార్యక్రమంలో డిప్యూటీ చీఫ్‌ ట్రాఫిక్‌ మేనేజర్‌ చంద్రశేఖర్, డిపో మేనేజర్‌ విశ్వనాథ్, అసిస్టెంట్‌ ట్రాఫిక్‌ మేనేజర్‌ భాస్కర్‌రెడ్డి, ఆర్టీసీ పీఆర్వో కృష్ణారెడ్డి, గ్యారేజీ సిబ్బంది పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు