కాళేశ్వరం.. దేశంలోనే అతిపెద్ద స్కాం

21 Jun, 2016 02:58 IST|Sakshi
కాళేశ్వరం.. దేశంలోనే అతిపెద్ద స్కాం

- టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి ఆరోపణ
- రూ. 83 వేల కోట్ల ప్రజాధనం లూటీ
- సీఎం కుటుంబీకులు దోచుకుంటున్నారు
- దళారులు, దోపిడీదారులు, కాంట్రాక్టర్ల ముఠాకు ముఖ్యమంత్రే నాయకుడు
- ప్రాజెక్టులకే లక్షల కోట్లు పెడితే సంక్షేమ     పథకాలకు నిధులెక్కడ్నుంచి తెస్తారు?
- మల్లన్నసాగర్‌లో సర్కారే దళారీలా మారింది
- బంగారు తెలంగాణ కాదు.. తాగుబోతుల తెలంగాణ చేశారు: వీహెచ్

 
 సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు దేశంలోనే అతిపెద్ద స్కాంగా మారబోతోందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క ఆరోపించారు. రూ.26 వేల కోట్లతో పూర్తయ్యే ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును పక్కనపెట్టి రీడిజైనింగ్ పేరుతో రూ.83 వేల కోట్లతో కాళేశ్వరం చేపట్టి ప్రజాధనాన్ని లూటీ చేస్తున్నారని దుయ్యబట్టారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబ సభ్యులు నలుగురు ప్రజాధనాన్ని దోచుకుంటున్నారన్నారు. సోమవారం ఆదిలాబాద్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘‘సీఎం నాయకత్వంలో దళారులు, దోపిడీదారులు, పెట్టుబడిదారులు, కాంట్రాక్టర్లు ముఠాగా ఏర్పడ్డారు. దీనికి బంగారు తెలంగాణ కోసం రాజకీయ పునరేకీకరణ అని ముసుగేసుకున్నారు.
 
 భూ దందాలను రెగ్యులరైజ్ చేసుకునేందుకే కొందరు పార్టీని వీడి టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారు. రానున్న మూడేళ్ల కాలంలో ప్రాజెక్టులకు రూ.1.50 లక్షల కోట్లు, మిషన్ భగీరథకు రూ.42 వేల కోట్లు, మిషన్ కాకతీయకు రూ.25 వేల కోట్లు వెచ్చిస్తే... పేదల డబుల్ బెడ్‌రూం ఇళ్లకు, దళితులకు మూడెకరాల భూమి పథకం, కేజీ టు పీజీ పథకం, ఇంటికో ఉద్యోగం వంటి వాటికి నిధులెక్కడ్నుంచి తెస్తారో చెప్పాలి’’ అని భట్టి డిమాండ్ చేశారు. మల్లన్నసాగర్ ప్రాజెక్టు కోసం ప్రభుత్వం భూ సేకరణ చేయడం లేదని, దళారీగా మారి భూములు కొనుగోలు చేస్తోందని విమర్శించారు. నిర్వాసితులకు జీవో 123 ప్రకారం కాకుండా.. 2013 భూసేకరణ చట్టం ప్రకారమే పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.
 
 మద్యం ఆదాయంతో పక్క రాష్ట్రాల్లో ప్రకటనలా?: వీహెచ్
 బంగారు తెలంగాణగా మారుస్తామంటున్న సీఎం కేసీఆర్.. రాష్ట్రాన్ని తాగుబోతుల తెలంగాణగా మార్చారని కాంగ్రెస్ ఎంపీ వి.హనుమంతరావు దుయ్యబట్టారు. మద్యం ద్వారా వచ్చిన ఆదాయాన్ని తమిళనాడు, కేరళ రాష్ట్రాల పత్రికలకు ప్రకటనలిచ్చి గొప్పలు పోతున్నారని విమర్శించారు. ఉగ్రవాద వ్యతిరేక దినోత్సవం సందర్భంగా సోమవారం ఆదిలాబాద్‌లో కాంగ్రెస్ ఆధ్వర్యంలో సభ నిర్వహించారు. ఈ సందర్భంగా వీహెచ్ మాట్లాడుతూ... మల్లన్నసాగర్ భూ నిర్వాసితుల విషయమై హైకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామన్నారు. నాలుగు గ్రామాల రైతులపై నాలుగు వేల గ్రామాలను ఏకం చేస్తామని మంత్రి హరీశ్‌రావు వ్యాఖ్యానించడాన్ని తప్పుపట్టారు. ఆయన రైతుల మధ్య కోట్లాట పెడుతున్నారన్నారు. ఉగ్రవాద కార్యకలాపాలను నిరోధించి, రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడేందుకు ఆక్టోపస్ విభాగాన్ని ఏర్పాటు చేసిన ఘనత దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డిదేనని మాజీ మంత్రి సబిత అన్నారు. 

మరిన్ని వార్తలు