మధ్యాహ్న వంటకు మంట

22 Oct, 2016 22:29 IST|Sakshi
మధ్యాహ్న వంటకు మంట
కొవ్వూరు : పాఠశాలల్లో అమలులో ఉన్న మధ్యాహ్న భోజన పథకం నిర్వహణ ఏజెన్సీలకు గుదిబండగా మారింది. వంట ఖర్చులను ఇటీవల పైసల్లో పెంచిన ప్రభుత్వం.. అదనంగా గుడ్డు వేయాలంటూ నిబంధన పెట్టి రూపాయల్లో భారం మోపింది. దీంతో వంట ఏజెన్సీలు గగ్గోలు పెడుతున్నాయి. 
 పెరిగిన నిత్యావసర సరుకుల ధరలు, కూరగాయల ధరలతో మధ్యాహ్న భోజన పథకం నిర్వహణ ఏజెన్సీలకు భారంగా తయారైంది. ప్రభుత్వం ఇటీవల వంట ఖర్చులను పైసల్లో పెంచింది. అదే సమయంలో అదనంగా కోడిగుడ్డు వేయాలంటూ రూపాయల్లో భారం మోపడంతో నిర్వాహక ఏజెన్సీ మహిళలు ఖంగుతిన్నారు. ఒకటి నుంచి 8వ తరగతి విద్యార్థులకు రూ. 0.27 పైసలు, 9, 10 తరగతుల విద్యార్థులకు రూ.0.40 పైసలు పెంచింది. వారానికి గతంలో రెండు గుడ్డు వేయాల్సి ఉంటే ఈనెల నుంచి మూడు గుడ్లు వేయాలంటూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీంతో వారికి వంట ఖర్చు పెంచిందన్న ఆనందం లేకుండాపోయింది. జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ, జిల్లా పరిషత్, ఎయిడెడ్, ఐటీడీఎ పరిధిలో 3,257 పాఠశాలలున్నాయి. వీటిలో 3,02,271 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. 
నామమాత్రంగా పెంపు 
ఇప్పటివరకు మధ్యాహ్న భోజన పథకంలో ఒకటి నుంచి ఎనిమిదో తరగతి విద్యార్థులకు రూ.4.86 పైసలు, 9, 10 తరగతుల విద్యార్థులకు 6.78 పైసలు చొప్పున వంట ఖర్చులు నిర్వాహకులకు చెల్లించేవారు. ఈ మొత్తాలను ప్రస్తుతం దిగువస్థాయి విద్యార్థులకు రూ. 5.13 పైసలు, పై తరగతులకు రూ.7.18 పైసలకు పెంచారు. ఈ ఏడాది జూలై నుంచి పెంచిన ధరలు వర్తించాల్సి ఉన్నప్పటికీ ఇప్పటివరకు అమలు కాలేదు. నాలుగు నెలలు తర్వాత పెంచిన ధరలు వర్తింపునకు ఆదేశాలు అందినప్పటికీ వారానికి మూడు గుడ్లు వేయాలన్న నిబంధనతో నిర్వాహకులు నష్టపోతున్నారు.
కేటాయింపుల్లో వివక్ష
జిల్లాలో మధ్యాహ్నం భోజనం చేస్తున్న విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గుతున్నప్పటికీ కేంద్ర, ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు 1 నుంచి 6వ తరగతి వరకు విద్యార్థులకు 100 గ్రాముల బియ్యం అందిస్తున్నారు. అదే ఎస్సీ, బీసీ వసతి గహాల్లో ఉండే విద్యార్థులకు (మూడు నుంచి ఏడో తరగతి వరకు) రెండు పూటలకు కలిపి 500 గ్రాములు కేటాయిస్తున్నారు. అంటే ఒక్కో పూటకి 250 గ్రాముల చొప్పున కేటాయిస్తుంటే ఇక్కడ మాత్రం వంద గ్రాములే ఇస్తున్నారు. అక్కడ మోనో చార్జీలు నెలకి ఒక్కో విద్యార్థికి ఉదయం అల్పాహారంతో పాటు రెండుపూటల భోజనానికి రూ.750 చొప్పునఅందిస్తుంటే ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనానికి నెలకి రూ.133.38 పైసలు కేటాయిస్తున్నారు. 8, 9, 10 తరగతులకు హాస్టళ్లలో రూ.850 చొప్పున కేటాయిస్తున్నారు. ఈ సొమ్ములు కూడా రెట్టింపు కంటే పైగానే చెల్లిస్తున్నారు. బియ్యం కూడా హాస్టళ్లలో రెండు పూటలకు 500 గ్రాములు ఇస్తే పాఠశాలల్లో పై తరగతులకు 150 గ్రాములే అందిస్తున్నారు. అందుకే మ«ధ్యాహ్నం భోజనం నాణ్యత కొరవడి భోజనం చేసే విద్యార్థుల సంఖ్య తగ్గుతుందన్న వాదనలు వినిపిస్తున్నాయి.
ఏడాదికి రూ.2.50 కోట్ల భారం 
జిల్లావ్యాప్తంగా ఉన్న 3,02,114 మంది విద్యార్థులకు వారానికి మూడు గుడ్ల చొప్పున వడ్డిస్తే నిర్వాహకులపై ఏడాదికి సుమారు రూ. 2.50 కోట్ల మేరకు భారం పడుతోంది. బహిరంగ మార్కెట్‌ కోడి గుడ్డు ధర రూ.4.50 పైసలు పలుకుతోంది. ఈ విధంగా నెలలో నాలుగు వారాలకు కలిపి ఒక్కో విద్యార్థిపై మూడో గుడ్డు వేయడానికి అదనంగా రూ.18 ఖర్చు చేయాల్సి వస్తుంది. పెంచిన వంట ఖర్చులు ప్రాథమికస్థాయి విద్యార్థులకు రోజుకి 27 పైసలు చొప్పున నెలకి రూ.7.02 పైసలు అదనంగా వస్తున్నాయి. ఒక్కో విద్యార్థిపై అయ్యే రూ.18 అదనపు ఖర్చు నుంచి ఈ సొమ్ము మినహాయిస్తే నిర్వాహకులకు రూ.10.98 పైసలు అదనంగా ఖర్చవుతుంది. జిల్లాలో ప్రాథమికస్థాయిలో విద్యనభ్యసించే విద్యార్థులు 2 లక్షల మంది ఉన్నారు. వీరికి నెలకు రూ.10.98 చొప్పున ఏడాదిలో పది నెలలకు లెక్కిస్తే రూ. 2.20 కోట్లు ఖర్చవుతుంది. ఉన్నత పాఠశాలల్లో 9, 10 తరగతి విద్యార్థులకు వంట ఖర్చులు 40 పైసలు పెంచారు. ఈ లెక్కన నెలకి రూ.10.40 పైసలు అదనంగా వస్తున్నాయి. దీనిలో మూడో గుడ్డు నెలరోజులకు అయ్యే అదనంగా ఖర్చయ్యే రూ.18లో ఈ మొత్తం మినహాయిస్తే ఒక్కో విద్యార్థికి రూ.7.60 పైసలు చొప్పున నెలకి రూ.38 లక్షల వ్యయం అవుతుందని అంచనా. మొత్తం మీద జిల్లావ్యాప్తంగా విద్యార్థులు హాజరు తగ్గినా, తినేవారి శాతం తగ్గడం తదితర కారణాలతో కొంత తగ్గినా ఏడాదికి రూ. 2.50 కోట్ల వరకు భారం తప్పదని నిర్వాహక ఏజెన్సీలు గగ్గోలు పెడుతున్నాయి. దీంతో జిల్లాలో ఎక్కడా మూడో గుడ్డు వేయాలన్న ఆదేశాలు అమలు కావడం లేదు.   
 
ప్రభుత్వం ద్వారా గుడ్ల సరఫరాకు యత్నం
మధ్యాహ్న భోజన పథకానికి కోడిగుడ్లను నెక్‌ ద్వారా ప్రభుత్వమే సరఫరా చేసేందుకు ప్రయత్నిస్తోంది. ఇది అమలులోకి వస్తే భారం తగ్గుతుంది. పాఠశాల ప్రాంగణాల్లో కిచెన్‌ గార్డెన్‌లు అభివద్ధికి ప్రయత్నిస్తున్నాం. ఇప్పటికే అన్నీ పాఠశాలలకు ఉద్యాన శాఖ ద్వారా కూరగాయలు, ఆకు కురల విత్తనాలు అందించాం.  
– డి.మధుసూదనరావు, జిల్లా విద్యాశాఖ అధికారి 
 
మరిన్ని వార్తలు