ఆడబిడ్డకు వరం

8 Sep, 2017 22:19 IST|Sakshi
ఆడబిడ్డకు వరం

- సుకన్య సమృద్ధి యోజన పథకంతో ఎన్నో లాభాలు
- ఇంటికి ఇద్దరు ఆడపిల్లలున్నా అర్హులే !


ఆడపిల్లలు ఇంటికి భారం అనుకుంటున్న తల్లిదండ్రులు ఈ రోజుల్లోనూ చాలా మందే ఉన్నారు. అసలు మగ, ఆడ అనే తేడాలు చూపించడం అనేది సమాజ జాఢ్యంగా మారింది. అంతే కాకుండా పుట్టేది ఆడా, మగా అని తెలుసుకుని పిండం ఆడ అని నిర్ధారణ అయితే మొగ్గలోనే తుడిచేసేవాళ్లూ ఉన్నారు. ఆడపిల్ల భారం అని ఎవరూ చింతించకుండా కేంద్ర ప్రభుత్వం బృహత్తర పథకాన్ని ప్రవేశపెట్టింది. అదే సుకన్య సమృద్ధి యోజన.

బత్తలపల్లి: ఆడబిడ్డల కోసం కేంద్ర ప్రభుత్వం 2014 డిశంబర్‌ 2న సుకన్య సమృద్ధి యోజన పథకాన్ని ప్రవేశ పెట్టింది. అప్పుడే పుట్టిన బిడ్డ నుంచి 10 సంవత్సరాల లోపు వారు ఈ పథకంలో చేరేందుకు అర్హులు. ఒకే ఇంటిలో ఇద్దరు ఆడపిల్లలున్నా, ఒకే కాన్పులో ముగ్గురు ఆడబిడ్డలు జన్మించినా ఈ పథకం వారికి వర్తిస్తుంది. స్థానిక బ్యాంకు, పోస్టాఫీసులో కనిష్టంగా నెలకు రూ.1000, ఏడాదికి రూ.12 వేలు, గరిష్టంగా రూ.1.50 లక్షలు పొదుపు చేస్తే .. పాపకు 21 ఏళ్లనాటికి కనిష్టంగా పొదుపు చేసుకుంటే రూ.6 లక్షలు, గరిష్టంగా పొదుపు చేసుకుంటే రూ.75 లక్షల నగదు పొందవచ్చు.

పొదుపు వివరాలు..
నెలకు రూ.1000 లెక్కన ఏడాదికి పాప పేరుతో రూ.12 వేలు చెల్లిస్తే 14 ఏళ్ల పాటు మొత్తం రూ.1.68 లక్షలు పొదుపు చేసినట్లు అవుతుంది. 21 ఏళ్ల తర్వాత ప్రస్తుతం ఉన్న 9.20 శాతం వడ్డీ ప్రకారం మీ బిడ్డకు రూ.6,07,128 ఇస్తారు. అదే నెలకు రూ.10 వేల చొప్పున అయితే ఏడాదికి రూ.1.20 లక్షల వంతున 14 ఏళ్ల పాటు రూ.16.80 లక్షలు పొదుపు చేస్తే వారికి 21 ఏళ్ల తర్వాత రూ.60,71,280 లక్షల నగదు మీరు తీసుకోవచ్చు.

ఒకేసారి కట్టుకునే వెసులుబాటు..
నెలకు రూ.1,000 చెల్లించే వారు ఏదైనా కారణం చేత ఒక నెల చెల్లించకపోయినా ఆ తర్వాత నెలలో రెండు నెలల మొత్తం కట్టుకోవచ్చు. అలాగే ఏడాదికి సరిపడా మొత్తం డబ్బు ఒకేసారి కట్టుకునేందుకు కూడా అవకాశం ఉంది. ఖాతా తెరిచిన 18 ఏళ్ల తర్వాత 50 శాతం నగదును పాప పెళ్లి కోసం, పై చదువుల కోసం తీసుకునే అవకాశం ఉంది. ఈ పథకం కింద ఎవరైనా పోస్టాఫీసు, ఏదైనా బ్యాంకులో డబ్బు పొదుపు చేస్తున్నట్లుయితే వారికి ఆదాయపన్ను చట్టం–1961 ప్రకారం సెక‌్షన్‌ 80 ద్వారా పన్ను రాయితీ ఉంటుంది.

అవగాహన కల్పిస్తున్నాం
తమ బ్యాంకుకు వచ్చే ఖాతాదారులకు సుకన్య సమృద్ధి యోజనా పథకం గురించి అవగాహన కల్పిస్తున్నాం. దీని ద్వారా పొదుపు చేసుకుంటే ఎంత ఉపయుక్తంగా ఉంటుందో ఆడబిడ్డలు ఉన్న తల్లిదండ్రులకు వివరిస్తున్నాం. బ్యాంకుల్లో , పోస్టాఫీస్‌ల్లో ఈ సౌకర్యం అందుబాటులో ఉంది. ఆడ బిడ్డ ఉన్న ప్రతి ఒక్కరూ ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి.
 –కేయూఎం.వర్ధన్, మేనేజర్‌, స్టేట్‌ బ్యాంక్‌ బత్తలపల్లిశాఖ

ఎంత పొదుపు చేస్తే .. ఎంత వస్తుంది ?
–––––––––––––––––––––––––––––––––––––––––––––
నెలకు కట్టాల్సింది      ఏడాదికి అయ్యేమొత్తం.            14 ఏళ్లకు అయ్యేమొత్తం                21 ఏళ్లకు వచ్చే మొత్తం
–––––––––––––––––––––––––––––––––––––––––––––
రూ.1,000            రూ.12,000                                  రూ.1.68 లక్షలు                    రూ.6,07,128
రూ.2,500            రూ.20 వేలు                                  రూ.4.20 లక్షలు                    రూ.15,17,820
రూ.5,000            రూ.60 వేలు                                  రూ.8.40 లక్షలు                    రూ.30,35,640
రూ.7,500            రూ.90 వేలు                                  రూ.12.60 లక్షలు                  రూ.45,53,460
రూ.10,000          రూ.1.20 లక్షలు                             రూ.16.80 లక్షలు                  రూ.60,71,280
రూ.12,500          రూ.1.50 లక్షలు                             రూ.21 లక్షలు                       రూ.75,89,103

మరిన్ని వార్తలు