ఇరవై రోజుల చిన్నారిని చంపిన తల్లి

7 Dec, 2016 00:06 IST|Sakshi
ఇరవై రోజుల చిన్నారిని చంపిన తల్లి
శ్రీశైలం ప్రాజెక్టు: 20 రోజుల పసికందు(కిరణ్మయి)ను ఊపిరి ఆడకుండా చేసి తల్లి లక్ష్మిశ్రావణి హత్య చేసిన ఘటన కర్నూలు జిల్లా శ్రీశైలంలోని సున్నిపెంటలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..

లక్ష్మీశ్రావణికి నాలుగు సంవత్సరాల క్రితం మార్కాపురానికి చెందిన వేముల శ్రీకాంత్‌తో వివాహమైంది. మొదట పుట్టిన కుమారునికి ఊపిరితిత్తుల ఇన్ఫెక‌్షన్‌ ఉండటంతో చికిత్స చేయిస్తున్నారు. ఇదే సమయంలో 20 రోజుల క్రితం లక్ష్మీశ్రావణి ఆడపిల్లలకు జన్మనిచ్చింది. ఈ చిన్నారికీ ఊపిరితిత్తుల ఇన్ఫెక‌్షన్‌ ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. అనారోగ్యంతో పుట్టిన బిడ్డను ఎలా పెంచాలోననే ఆవేదనతో సోమవారం సాయంత్రం పసికందుకు చేతితో ముక్కుపై అదిమి ఊపిరి ఆడకుండా చేసి ఇంటి పైనున్న సింటెక్స్‌ ట్యాంకులో పడేసింది. ఆ తర్వాత కుమార్తె కనిపించడం లేదని తల్లిదండ్రులతో కలిసి రాత్రి 9 గంటల సమయంలో టూటౌన్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ఆ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు వెంటనే వారింటికి చేరుకుని చుట్టుపక్క ప్రాంతాలను పరిశీలించారు. అర్ధరాత్రి సమయంలో ఇంటిపైనున్న సింటెక్స్‌ ట్యాంకులో చిన్నారి మృతదేహాన్ని గుర్తించారు. ఆ వెంటనే మృతదేహాన్ని స్థానిక ఆసుపత్రికి తరలించారు. అయితే ఎవరో కావాలని ఇలా చేసినట్లుగా మొదట పోలీసులు భావించారు. ఆ తర్వాత అనుమానంతో తల్లిని విచారించగా.. అసలు విషయం వెల్లడించింది. ఇద్దరు పిల్లలు అనారోగ్యంతో జన్మించడంతో ఇలా చేసినట్లు అంగీకరించింది. భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు సీఐ విజయకృష్ణ, ఎస్‌ఐ ఓబులేసు తెలిపారు.
 
>
మరిన్ని వార్తలు