మండుటెండల్లో పసికందు

22 Apr, 2016 02:47 IST|Sakshi
మండుటెండల్లో పసికందు

రోడ్డుపక్కన వదిలివెళ్లిన వైనం
హత్నూర మండలంలో ఘటన
మంగాపూర్ శివారులో రోడ్డు పక్కన ఆడ శిశువు
దౌల్తాబాద్ ప్రైవేటు ఆస్పత్రిలో ప్రథమ చికిత్స
సంగారెడ్డి శిశువిహార్‌కు తరలింపు
గుర్తుతెలియని వ్యక్తులపై  కేసు నమోదు

 హత్నూర: అభం శుభం తెలియని సుమారు నెలరోజుల ఆడ శిశువును మండుటెండలో రోడ్డు పక్కన చెట్టుకింద ఓ తల్లి వదిలేసి వెళ్లింది. ఈ సంఘటన మండలంలోని మంగాపూర్ గ్రామ శివారులో గురువారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. ఎస్సై బాల్‌రెడ్డి, స్థానికుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. మండలంలోని మంగాపూర్ గ్రామ శివారులో సంగారెడ్డి-నర్సాపూర్ ప్రధాన రహదారి పక్కన ఓ చెట్టుకింద నెల రోజుల ఆడ శిశువును గుర్తుతెలియని వ్యక్తులు ఎవరో వదిలేసి వెళ్లారు. నర్సాపూర్ మండలం బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన వాల్దాస్ గోపాల్‌గౌడ్, అవంచ గ్రామానికి చెందిన రాజులు ఇద్దరు బైక్‌పై పెళ్లికి వెళ్లి తిరిగి నర్సాపూర్ వైపు వస్తున్నారు.

ఈ క్రమంలో రోడ్డుపక్కన చెట్టు కింద చిన్న పరుపులో పాప ఏడుస్తూ కనిపించడంతో ఒక్కసారిగా ఇద్దరు యువకులు ఆగిపోయారు. ఈ వి షయమై పోలీసులకు సమాచారం ఇవ్వడంతో  ఎస్సై బాల్‌రెడ్డి, కానిస్టేబుల్ శర్మన్‌నాయక్‌లు వెంటనే సంఘటన స్థలానికి వెళ్లారు. చెట్టుకింద రోదిస్తున్న పసిపాపకు దౌల్తాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ప్రథమ చికిత్స చేయించారు. ఐసీడీఎస్ అధికారులకు సమాచారం ఇవ్వడంతో సూపర్‌వైజర్లు జ్యోతి, మహాలక్ష్మి ఇద్దరు ఆస్పత్రికి తరలివచ్చారు. అనంతరం శిశువును సంగారెడ్డిలోని శిశువిహార్‌కు తరలించినట్లు ఎస్సై బాల్‌రెడ్డి తెలిపారు. గుర్తుతెలియని వ్యక్తులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.

 మాతృత్వానికే మచ్చ
ప్రస్తుత కరువు పరిస్థితుల్లో ఇంకెందుకులే ఈ ఆడశిశువు అనుకుందో ఏమోగాని పేగు బంధాన్ని సైతం మరచిపోయింది ఆ తల్లి. పొత్తిళ్లలో ఉండాల్సిన పసి పాపను రోడ్డుపక్కన చెట్టుకింద హృదయ విదారకంగా పరుపులో పడవేసింది. ఆడ శిశువును ఇలా రోడ్డుపక్కన వదిలేయడాన్ని చూసిన ప్రతి ఒక్కరూ చలించిపోయారు. అయ్యో పాపం.. ఏ తల్లికన్న బిడ్డో అంటూ ఆస్పత్రి వద్ద కొంతమంది మహిళలు కంటతడి పెట్టా రు. పాపకు పాలు, నీళ్లు తాగిం చారు. అంతలోపే పాపను సంగారెడ్డి శిశువిహార్‌కు తరలిస్తుంటే అందరి కళ్లూ ఆ పాపపైనే ఉన్నాయి. ఏదిఏమైనా సభ్యసమాజం తలదించుకునే ఇలాంటి సంఘటనలు మానవత్వానికి, మాతృత్వానికి మాయని మచ్చలా మిగిలిపోతున్నాయి.

మరిన్ని వార్తలు