పట్టాల కోసం పోరుబాట

11 Aug, 2016 22:31 IST|Sakshi
పట్టాల కోసం పోరుబాట

కదం తొక్కిన జవహర్‌నగర్‌వాసులు
ప్రజాహక్కుల పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ

శామీర్‌పేట్‌ / జవహర్‌నగర్‌: ప్రభుత్వాలు మారినా పేదల జీవితాల్లో వెలుగులు లేవని ప్రజా హక్కుల పరిరక్షణ పోరాట కమిటీ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. జవహర్‌నగర్‌లోని ఇళ్లను క్రమబద్ధీకరించి, జీవో 58, 59ను అమలుపర్చాలని డిమాండ్‌ చేస్తూ గురువారం శామీర్‌పేట తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. బాలాజీనగర్‌లోని డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి డప్పు చప్పుళ్లతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రత్యేక రాష్ట్రం వస్తే బతుకులు మారుతాయని ఎన్నో పోరాటాలు చేశారని.. నివసించే గూడు కోసం పోరాటం చేయాల్సి రావడం విచారకరమన్నారు. వివిధ రాష్ట్రాల నుంచి పొట్టకూటి కోసం జవహర్‌నగర్‌కు వలస వచ్చి భయంగుప్పిట్లో కాలం వెళ్లదీస్తున్నారని అన్నారు. నివాసహక్కు కల్పించాలని ఏళ్లుగా పోరాటాలు చేస్తున్నా ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం విచారకరమన్నారు.

         ఎన్నికల సమయంలో మాయమాటలు చెప్పి ఓట్లు వేయించుకున్న నాయకులు ఇప్పుడు మాట తప్పుతున్నారని విమర్శించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఒకవైపు ఎక్కడ గుడిసె వేసుకుంటే అక్కడే పట్టాలిస్తామని ప్రకటనలు చేసి జీవో 58,59ను అమల్లోకి తెచ్చారని, జవహర్‌నగర్‌లో నివసించే పేదల ఇళ్లకు పట్టాలిచ్చే పరిస్థితుల్లో  ప్రభుత్వం లేదని మేడ్చల్‌ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి స్వయంగా చెప్పడం టీఆర్‌ఎస్‌ పాలనకు అద్దం పడుతోందన్నారు. పేదల ఇళ్లను క్రమబద్ధీకరించకుండా కాలయాపన చేయడమే కాకుండా మరోవైపు ఫెన్సింగ్‌ ఏర్పాటు చేస్తూ భయబ్రాంతులకు గురిచేస్తున్నారన్నారు. మిగులు భూములను స్థానికుల అవసరాలకే కేటాయించాలని డిమాండ్‌ చేశారు. హక్కుల సాధన కోసం నిరంతర పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ప్రజా హక్కుల పరిరక్షణ పోరాట కమిటీ చైర్మన్‌ మేడ రవి, కన్వీనర్‌ మస్తాన్‌బీ, కో చైర్మన్లు జి.అనురాధ, శివబాబు, వి.కిరణ్‌, డాక్టర్‌ వెంపటి బాస్కర్‌, సునీత, ఎండీ జావెద్‌,  కోశాధికారి జి.చంద్రమౌళి, మీడియా ప్రతినిధులు ఎర్రగుడ్ల వెంకటేశ్వర్లు, ఎస్‌కె మీరా, పాకాల డానియేల్‌, కోకన్వీనర్లు షేక్‌షావలి, సీహెచ్‌ బాలనర్సింహ, లక్ష్మీబాయి, రాజ్యలక్ష్మి, బి.మోహన్‌, అనంతలక్ష్మి, పాషామియా,  పలు ప్రజా సంఘాల, కాలనీల నాయకులు పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు