కదులుతున్న నకిలీ పాస్‌పుస్తకాల డొంక

27 Aug, 2016 23:41 IST|Sakshi
కదులుతున్న నకిలీ పాస్‌పుస్తకాల డొంక
  • ఫిర్యాదు చేస్తున్న రైతులు
  • వందల సంఖ్యలో నకిలీ పాస్‌పుస్తకాలు
  • రెవెన్యూ అధికారుల సహకారంతో ముఠా కార్యకలాపాలు ? 
  • ఫీల్డ్‌ ఆఫీసర్ల సాయంతో బ్యాంకుల్లో రుణాలు ? 
  • కొడకండ్ల : మండలంలోని నకిలీ పాసు పుస్తకాల డొంక కదులుతోంది. అమాయక రైతులను ఆసరాగా చేసుకొని వేలాది రూపాయలు తీసుకొని నకిలీ పాస్‌ పుస్తకాలను అందించిన ముఠా లీలలు ఒక్కొక్కటిగా బయటికొస్తున్నాయి. నాలుగైదేళ్లుగా నకిలీ పాస్‌ పుస్తకాలను తయారు చేసి రెవెన్యూ, బ్యాంక్‌ అధికారుల సాయంతో రుణాలు పొందిన అక్రమార్కుల బాగోతం వెలుగులోకి వస్తోంది. మండల కేంద్ర శివారు దుబ్బతండాకు చెందిన దరావత్‌ భీమానాయక్, బానోత్‌ యాకూబ్‌ నకిలీ పాస్‌ పుస్తకాల తయారీ కేసులో శుక్రవారం అరెస్టయిన సంగతి తెలిసిందే. విషయం తెలిసిన తర్వాత వారి ద్వారా పాస్‌పుస్తకాలు చేయించుకున్న పలువురు రైతులు తహసీల్దార్‌ కార్యాలయానికి వెళ్లి తమ పుస్తకాలను అధికారులకు చూపించారు. వాటిని నకిలీ పుస్తకాలుగా అధికారులు తేల్చడంతో కడగుట్టతండ రైతులు లబోదిబోమంటున్నారు.   భీమా నాయక్, యాకూబ్‌ తమ వద్ద డబ్బులు తీసుకొని నకిలీ పాస్‌పుస్తకాలను తయారు చేసిచ్చి బ్యాంక్‌లో రుణాలు కూడా ఇప్పించినట్లు వారు ఫిర్యాదు చేశా రు. రెవెన్యూ సిబ్బందితోపాటు బ్యాంక్‌లోని ఫీల్డ్‌ ఆఫీసర్లు ముడుపులు తీసుకొని ఈ ముఠాకు సంపూర్ణ సహకారం ఇచ్చారనే ఆరోపణ లకు రైతుల ఫిర్యాదులు బలం చేకూరుస్తున్నాయి. నకిలీ పాస్‌పుస్తకాలను తయారు చేసిన తర్వాత కంప్యూటర్‌ పహాణీ, 1 బీలో నమోదు కోసం రెవెన్యూ సిబ్బంది, అధికారులకు ఈ ముఠా పెద్ద ఎత్తున ముడుపులిచ్చినట్లు తెలుస్తోంది. ఒకేసారి పెద్దమొత్తంలో నకిలీ పాస్‌ పుస్తకాలకు సంబంధించిన ఫైళ్లను ఈ ముఠా తయారు చేసుకొని సంబంధిత వీఆర్వో, అధికారుల సహకారంతోనే మ్యూటేషన్, కరెక్షన్‌ పనులు చేయించుకున్నట్లు తెలుస్తోంది.
    పూర్వ అధికారుల సాయంతోనే..
    కొద్దిరోజులే ఇక్కడ పనిచేసిన ఓ మహిళా అధికారికి జనగామ లో ఉన్న తన నివాసంలోనే ఈ ముఠా పనులను చక్కబెట్టగా, ఆ తర్వాత  కొద్దికాలం ఇన్‌చార్‌్జగా వ్యవహరించిన పాలకుర్తి తహసీల్దార్‌ హయాంలోను జోరుగా అక్రమాలు చోటుచేసుకున్నాయ నే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మండలంలోని పోచంపల్లి, గంట్లకుంట, రామవరం తదితర గ్రామాల్లోని దళారులు ఈ ముఠాతో జతకట్టి వందల సంఖ్యలో నకిలీ పాస్‌ పుస్తకాలను చలామణీ చేసినట్లు తెలుస్తోంది. దీనికి తోడు అసలు భూములు లేని రైతుల పేరిట కూడా నకిలీ పాస్‌ పుస్తకాలతో బ్యాంక్‌లో రుణాలు ఇప్పించగా వారు ప్రభుత్వ రుణమాఫీలో కూడా లబ్ధిపొందినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికారులు స్పందిం చి నకిలీ పాస్‌ పుస్తకాల బాగోతంపై సమగ్ర దర్యాప్తు చేయించినట్లయితే ముఠాకు సంబంధించిన మరిన్ని అక్రమాలు వెలుగులోకి వచ్చే అవకాశముందని రైతులు అభిప్రాయపడుతున్నారు.  
మరిన్ని వార్తలు