'నరసింహస్వామికి కోపమొస్తే కష్టం'

15 May, 2016 21:00 IST|Sakshi
'నరసింహస్వామికి కోపమొస్తే కష్టం'

హైదరాబాద్‌ సిటీ: ఆగమన శాస్త్ర నిబంధనలు, చిన్నజీయర్ స్వామి సలహాల మేరకే యాదాద్రి ఆలయ నిర్మాణ పనులు జరుగుతున్నాయని టీఆర్‌ఎస్ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ స్పష్టం చేశారు. ఆలయాన్ని శాశ్వతంగా మూసివేస్తారన్న అర్థం వచ్చే విధంగా ఓ పత్రిక తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. లక్ష్మీ నరసింహా స్వామికి కోపం వస్తే కష్టం అని హెచ్చరించారు. ఆదివారం తెలంగాణ భవన్‌లో విలేకరులతో మాట్లాడారు. సమైక్య పాలనలో తెలంగాణలోని ఆలయాలు నిర్లక్ష్యానికి గురయ్యాయన్నారు. ఈ ఆలయాలను గుర్తించి తెలంగాణ ప్రభుత్వం అభివృద్ధి చేస్తోందని తెలిపారు. రూ.500 కోట్లతో యాదాద్రి ఆలయాభివృద్ధికి పనులు చేపట్టామన్నారు.

ఈ క్రమంలో తాత్కాలికంగా విగ్రహాలను బాలాలయంలో పెట్టి పూజలు నిర్వహిస్తున్నారన్నారు. ఆగమన శాస్త్రం, చినజీయర్ స్వామి సలహాల మేరకే బాలాలయం ఏర్పాటైందన్నారు. భక్తులు బాలాలయానికి వచ్చి పూజలు చేసుకోవచ్చని తెలిపారు. యాదాద్రి ఆలయ నిర్మాణం పూర్తైతే అక్కడి దుకాణదారుల ఆదాయం మూడు రేట్లు పెరుగుతుందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా దుకాణదారులతో మాట్లాడి వారికి స్థలాలు ఇస్తారని పేర్కొన్నారు. దుకాణదారులను తరలిస్తారన్న ఆందోళన అవసరం లేదని బూర నర్సయ్యగౌడ్ తెలిపారు.

మరిన్ని వార్తలు