ఆ స్థలం ఎంపీకి కట్టబెట్టేందుకు సన్నాహాలు!

24 Nov, 2015 10:16 IST|Sakshi
ఆ స్థలం ఎంపీకి కట్టబెట్టేందుకు సన్నాహాలు!

నిత్యం ఆకలి కేకలతో పోరాటం చేసే జీవితాలు.. పని దొరికితే చాలు పండగ చేసుకునే బతుకులు..కాస్తంత ఖాళీ స్థలం కనిపిస్తే తలదాచుకోవడానికి గూడు ఏర్పాటు చేసుకున్నారు..రాజధాని ప్రకటన రావడంతో భూముల ధరలు రెక్కలు తొడిగాయి.. బడుగుల నివాసముంటున్న స్థలంపై పెద్దల కన్ను పడింది..ఎలాగైనా పేదల గూడు కూల్చేందుకు ముమ్మర ప్రయత్నాలు సాగిస్తున్నారు..ఈ తతంగమంతా ఓ ఎంపీకి సదరు స్థలాన్ని కట్టబెట్టటేందుకేనని విమర్శలు వినిపిస్తున్నాయి. పేదలను రోడ్డు పాలు చేసే ఈ ప్రయత్నాల గురించి ఒక్కసారి తెలుసుకుందాం.
 
సీతానగరంలో మత్స్యకారుల నివాస స్థలాలను ఖాళీ చేయించేందుకు ముమ్మర ప్రయత్నాలు
ఈ స్థలం ఓ ఎంపీకి కట్టబెట్టేందుకు సన్నాహాలు ?
 
తాడేపల్లి రూరల్ : పట్టణంలోని సీతానగరంలో పాఠశాల ఏర్పాటు చేస్తామంటూ 1983లో రామకృష్ణ సమితి వారు అతి తక్కువ ధరకు ప్రభుత్వం నుంచి ఆరెకరాల స్థలాన్ని కొనుగోలు చేశారు. అయితే చేశాం... చేస్తున్నాం.. అన్న చందాన ఓ ప్రభుత్వ పాఠశాల నిర్మించారు. అది అంచెలంచెలుగా ఎదుగుతూ 1500 మంది విద్యార్థులకు బోధనశాలగా మారింది. ఈ క్రమంలో పాఠశాలను మేము నడపలేకపోతున్నామంటూ సమితి వారు రామకృష్ణ మిషన్‌కు అప్పగించారు.

అప్పటి నుంచి విద్యార్థుల దగ్గర వేల రూపాయలు ఫీజులు వసూలు చేస్తున్నారు. అప్పటిలోనే రామకృష్ణ మిషన్‌కు సమితి వారు ఆరెకరాల స్థలాన్ని అమ్మేశారు. ఈ స్థలం పక్కనే ఉన్న 90 సెంట్ల భూమిలో మత్స్యకారులు ఇళ్లు నిర్మించుకున్నారు. ఇప్పుడా స్థలం తమదని సమితి వారు మత్స్యకారులను ఖాళీ చేరుుంచేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

దీనికి రెవెన్యూ అధికారులూ వత్తాసు పలుకున్నారు. ఈ స్థలాన్ని రాష్ట్రానికి చెందిన ఒక ఎంపీకి కట్టబెట్టేందుకే వారు హడావుడి చేస్తున్నారని సమాచారం. సదరు ఎంపీ సారు రాజధాని ప్రాంతంలో బహుళ అంతస్తులు నిర్మించేందుకు మత్స్యకారుల స్థలాన్ని ఖాళీ చేరుుస్తున్న తెలిసింది. అందులో భాగంగానే వారి నివాసాలను తొలగించేందుకు ప్రయత్నం చేస్తున్నారంటూ ఓ తెలుగుదేశం నాయకుడు చెబుతున్నారు.
 
మత్స్యకారుల పరిస్థితి ఏమిటి ?
మత్స్యకారులకు ఎక్కడైనా నివాస గృహాలు ఇస్తారా? లేక వారిని రోడ్డుకీడుస్తారా? అనే విషయం ఇంత వరకు తేల్చ లేదు. ప్రతి రోజూ అధికారుల హడావుడి చూసి మత్స్యకారులు తమ పరిస్థితి ఏమిటంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  
 
భయపెడుతున్నారు
50 ఏళ్ల నుంచి కృష్ణమ్మ తల్లిని నమ్ముకుని ఇక్కడే నివసిస్తున్నాం. కాయకష్టం చేసుకుంటూ రేకుల షెడ్డు నిర్మించుకున్నాం. ఈ స్థలం తమదంటూ ఎవరెవరో వచ్చి మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు.      
- నడికుదిటి పార్వతి
 
ఎక్కడికెళ్లాలి
ఏళ్ల తరబడి ఇక్కడే నివసిస్తున్నాం. ఇప్పుడొచ్చి తమను ఖాళీ చేయమంటే ఎక్కడికెళ్లాలి. రామకృష్ణ సమితి వారు ప్రజలకు ప్రతి ఏడాది ఏదో సేవ చేస్తుంటారని తెలిసింది. దానిలో భాగంగానే మా కుటుంబాలకు ఈ స్థలం కేటాయించాలని ప్రాధేయపడుతున్నాం.     
- గాడి భారతి

మరిన్ని వార్తలు