'గ్రామజ్యోతి'ని బహిష్కరించిన ఎంపీటీసీలు

17 Aug, 2015 10:43 IST|Sakshi

మక్తల్ (మహబూబ్‌నగర్ జిల్లా): తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'గ్రామజ్యోతి' పథకంలో తమకు ప్రాధాన్యం లేదని ఆగ్రహించిన ఎంపీటీసీలు ఆ కార్యక్రమాన్ని బహిష్కరించారు. అంతటితో ఆగకుండా అధికారులను కార్యాలయంలో పెట్టి తాళంవేసి నిరసన తెలిపారు. ఈ సంఘటన సోమవారం ఉదయం మహబూబ్‌నగర్ జిల్లా మక్తల్‌లో జరిగింది. వివరాలు.. తెలంగాణ సర్కార్ సోమవారం నుంచి గ్రామ గ్రామాన గ్రామజ్యోతి కార్యక్రమాన్ని ప్రారంభించింది. అధికారులు పల్లెలకు వెళ్లి గ్రామజ్యోతి కార్యక్రమాన్ని ప్రారంభించాల్సి ఉంది. అయితే ఆ కార్యక్రమంలో తమకు స్థానం లేకుండా చేశారని, కనీస గౌరవం కూడా ఇవ్వలేదని ఆగ్రహించిన 21మంది ఎంపీటీసీలు.. మక్తల్ ఎంపీడీవో కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు.

వీరికి ఎంపీటీసీలు శ్రీహరి, పద్మమ్మ, వెంకటరాములు, శ్రీరాములు, లింగప్ప నాయకత్వం వహించారు. గ్రామాలకు బయలుదేరుతున్న అధికారులను కార్యాలయంలో ఉంచి తాళం వేశారు. బందీ అయిన వారిలో ఎంపీడీవో జయశంకర్ ప్రసాద్, ఏఓ సుబ్బారెడ్డి, ఎంఈవో లక్ష్మీనారాయణ, డిప్యూటీ తహశీల్దార్ లక్ష్మీపతి ఆచారి, వీఆర్‌వోలు, కార్యదర్శులు ఉన్నారు. విషయం తెలుసుకున్న మక్తల్ ఎస్‌ఐ మురళీగౌడ్ ఎంపీడీవో కార్యాలయం వద్దకు వెళ్లి ధర్నా చేస్తున్న ఎంపీటీసీలతో చర్చించారు. వారికి నచ్చజెప్పి ధర్నాను విరమింపజేశారు. అనంతరం కార్యాలయ తాళం తెరిచారు. తమను గదిలో వేసి నిర్బంధించడం అవమానంగా భావించిన అధికారులు బయటికి రాకుండా సమావేశమై చర్చించుకుంటున్నారు.

మరిన్ని వార్తలు