దాడులు సహించం : ఎమ్మార్పీఎస్‌

17 Aug, 2016 23:31 IST|Sakshi

కదిరి టౌన్‌ : తెలుగుదేశం పార్టీ పాలనలో ఎస్సీఎస్టీలపై దాడులు, దౌర్జన్యాలు అధికమయ్యాయని, ఇలాంటి చర్యలను ఇకపై సహించబోమంటూ ఎమ్మార్పీఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు నారాయణస్వామి హెచ్చరించారు. భూకబ్జాలు, బెదిరింపులు, అరాచకాలు పునరావృతమైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తామన్నారు. స్థానిక ఆర్‌అండ్‌బీ అతిథిగృహంలో బుధవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కదిరి ప్రాంతంలో ఎస్సీ, ఎస్టీలను అధికార పార్టీకి చెందిన నాయకులు ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు.


కదిరి ఆర్‌ఎస్‌ రోడ్డుకు చెందిన గంగరత్న భూమి పట్టాను రద్దు చేయించి, తనకు అనుకూలమైన వారికి అందించేందుకు టీడీపీ మాజీ ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్‌ పావులు కదుపుతున్నారని ఆరోపించారు. మున్సిపల్‌ కమిషనర్‌గా విధుల్లో చేరేందుకు వచ్చిన ఎస్టీ తెగకు చెందిన సుశీలమ్మను అడ్డుకుని బెదిరింపులతో వెనక్కు పంపిన ఘనత కూడా కందికుంటకే చెల్లిందన్నారు. ఎస్సీఎస్టీలపై దాడులు, బెదిరింపులకు పాల్పడుతున్న వారిపై క్రమశిక్షణా చర్యలతోపాటు అట్రాసిటీ కేసులు నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు. సమావేశంలో గిరిజన విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మల్లికార్జున నాయక్, మాలమహానాడు రాష్ట్ర ఉపాధ్యక్షులు జి.నాగరాజు, రాంప్రసాద్‌నాయక్, ఎంప్లాయీస్‌ యూనియన్‌ నాయకుడు నాగరాజు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు