ముద్రగడ దీక్ష విరమణ

9 Feb, 2016 01:00 IST|Sakshi
ముద్రగడ దీక్ష విరమణ

సర్కారు హామీలకు అంగీకరించిన ముద్రగడ
 
 (కిర్లంపూడి నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి): సహధర్మచారిణి పద్మావతితో కలిసి 4 రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేసిన కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం సోమవారం మధ్యాహ్నం దీక్షను విరమించారు. ప్రభుత్వం తరఫున చర్చలకు హాజరైన టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కిమిడి కళా వెంకటరావు, కార్మిక  శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు అందించిన నిమ్మరసం స్వీకరించి దీక్ష విరమించినట్లు ప్రకటించారు. కాపు జాతి ప్రయోజనాల కోసం తాము చేసిన డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించి, తమ ప్రతినిధుల ద్వారా వర్తమానం పంపినందున దీక్షను విరమిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

సోమవారం ఉదయం 11.30 గంటలకు కిర్లంపూడిలోని ముద్రగడ నివాసానికి చేరిన మంత్రి అచ్చెన్నాయుడు, కళా వెంకటరావు, ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు, ఎమ్మెల్సీ బొడ్డు భాస్కరరామారావు ముద్రగడతో చర్చించారు. సీఎం చంద్రబాబుతో చర్చించిన మీదట ఆయన అంగీకారంతో ఈ హామీలిస్తున్నట్లు వివరించారు.  అంగీకారాన్ని తెల్పిన ముద్రగడ దీక్ష విరమణకు సమ్మతించారు. చర్చలు ఫలప్రదం కావడంతో అచ్చెన్నాయుడు, కళా వెంకటరావు మీడియాకు తెలిపారు.

 సర్కారు కట్టుబడి ఉంది..
 ముద్రగడ కు ఇచ్చిన హామీలను, మాటలను కచ్చితంగా నిలబెట్టుకుంటామని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ప్రత్యేక కమిషన్ వేయడం, కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేసి రూ.100 కోట్లు కేటాయించడం ఇందులో భాగమేనన్నారు. బీసీలకు నష్టం లేకుండా కాపు సామాజికవర్గానికి రిజర్వేషన్ కల్పించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందన్నారు. జనవరి 31న తునిలో ఐక్య గర్జన సభ సందర్భంగా జరిగిన విధ్వంసంలో చాలా మందిపై  కేసులు నమోదు చేశామనీ, లోతుగా విచారణ చేసిన పిదపే చర్యలు తీసుకుంటామని, అల్లర్లతో సంబంధం లేని వారిని ఇబ్బంది పెట్టబోమని చెప్పారు. పార్టీలో, ప్రభుత్వంలో కాపులపై పూర్తి సానుకూల దృక్పథం ఉందని కళా వెంకటరావు అన్నారు. చర్చలకు ముందుకొచ్చిన ముద్రగడకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు. కాపు కార్పొరేషన్‌కు తక్షణమే రూ.500 కోట్లు, ఏటా బడ్జెట్‌లో రూ.1000 కోట్లు కేటాయింపునకు ప్రభుత్వం అంగీకరించిందన్నారు.

 హామీలు నెరవేరిస్తే కాళ్లు కడుగుతా..
 కాపుల ప్రయోజనాల కోసం ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేరిస్తే ముఖ్యమంత్రి  చంద్రబాబు ఇంటికెళ్లి కాళ్లు కడుగుతానని ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం పేర్కొన్నారు. కాపుల రిజర్వేషన్ అంశంపై అసెంబ్లీలో తీర్మానం చేసి అమలుకు సిద్ధమైతే సీఎం కాళ్లకు మొక్కడానికి వెనుకాడబోమన్నారు. చర్చలు ఫలప్రదం అయిన వెంటనే నిమ్మరసం స్వీకరించిన ముద్రగడ అక్కడే  మీడియాతో మాట్లాడారు. ముద్రగడ చెప్పిన వివరాలు ఆయన మాటల్లోనే..

 ‘ఉద్యమానికి పూర్తిగా సహకరించిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా యజమానులకు, పాత్రికేయులకూ నమస్కారాలు. కాపులను బీసీల్లో కలుపుతామని ఎన్నికల ముందే సీఎం చెప్పారు. ఈ మేరకు ఎన్నికల మేనిఫెస్టోలోనూ పెట్టారు. అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోగా హామీ నెరవేరుస్తామన్నారు. ఆ విషయాన్ని మర్చిపోయారు. నేను రోడ్డెక్కాక సీఎం చర్చలకు పంపారు. చిన్నచిన్న సడలింపులు ఉన్నప్పటికీ జాతి సంక్షేమం కోసం చర్చలకు అంగీకరించాను. సీఎం గారూ...మిమ్మల్ని కావాలని గానీ...తిట్టాలని గానీ.. అవమానించాలనిగానీ నాకు లేదు. మీరిచ్చిన హామీల వల్లనే రోడ్డెక్కాను. ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో మీరు ఆలస్యం చేయడంతో ఆకలి కేకలతో ఉన్న కాపు యువత ప్రశ్నించింది. తక్షణ ఉద్యమాన్ని గుర్తు చేసింది. అందుకే దీక్షకు  దిగాల్సి వచ్చింది. అయ్యా...మిమ్మల్ని అనరాని మాటలు అని ఉంటాను. క్షమించమని కోరుతున్నాను. మంజునాథ్ కమిషన్ రిపోర్టును తెప్పించుకుని అసెంబ్లీలో  తీర్మానం చేయించి కాపుల రిజర్వేషన్‌కు మార్గం సుగమం చేస్తే మీ ఇంటికొచ్చి పళ్లెంలో కాళ్లు పెట్టి కడుగుతా.

 దయ ఉంచి సీఎం గారూ...మా జాతికి అన్నం పెట్టమని కోరుకుంటున్నాను. రిజర్వేషన్ ఇచ్చేటపుడే క్రీమీలేయర్ పెట్టండి. తక్కువ ఆదాయం ఉన్నవారికే  వర్తించేలా చూడండి. బీసీల కోటా వద్దు. మిగతా కోటాలోంచి జనాభా ప్రాతిపదిక రిజర్వేషన్ కల్పించండి. బీసీల నోటికాడ అన్నం తీయమని చెప్పను. ఇచ్చిన హామీలను నిలబెట్టుకోండి. చర్చల ద్వారా ఇచ్చిన హామీలేమిటంటే.. వెంటనే రూ.500 కోట్లను కార్పొరేషన్‌కు ఇస్తామన్నారు. వచ్చే బడ్జెట్ నుంచి ఏటా రూ.1,000 కోట్లు ఇస్తామన్నారు. ఎన్ని అప్లికేషన్లు వచ్చినా పరిశీలించి యువతకు న్యాయం చేస్తామన్నారు. 7 నెలల్లోనే కమిషన్ నివేదిక వచ్చేలా చూస్తామని చెప్పారు. తుని ఐక్య గర్జన సందర్భంగా చాలా మందిపై కేసులు పెట్టారు. అమాయకులపైనా కేసులు పెట్టారు. లోతుగా విచారణ జరిపాకనే అరెస్టులు ఉంటాయన్నారు. ఆ జాబితాను కూడా ఇవ్వమన్నాను. అంగీకరించారు. కమిషన్‌లో సభ్యత్వం కోసం నాలుగు పేర్లు సూచించాను. అందులో ఒకరికి అవకాశం కల్పిస్తామన్నారు. కాపు రిజర్వేషన్ జీవో వల్ల నష్టాలున్నాయని ప్రభుత్వం చెబుతోంది. నమ్ముతున్నాను. సీఎం గారూ...మళ్లీ నన్ను రోడ్డెక్కించవద్దయ్యా...మాట తప్పవద్దు’.  
 
 మద్దతు తెలిపిన వారందరికీ కృతజ్ఞతలు..
 నేను ఉద్యమం మొదలు పెట్టినప్పటి నుంచి పూర్తిగా మద్దతు ప్రకటించిన  పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డికి, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు  జగన్‌మోహన్‌రెడ్డికి, బీజేపీ నాయకులు కన్నా లక్ష్మీనారాయణ, సోము వీర్రాజు, టీడీపీ నేతలకు, లోక్‌సత్తా జయప్రకాశ్‌నారాయణ, దళిత నాయకుడు హర్షకుమార్, మాలమహానాడు నేత రత్నాకరరావు, కాంగ్రెస్ ఎంపీ చిరంజీవి, దాసరి, వట్టి, ఆకుల సత్యనారాయణ, వీహెచ్‌లకు రుణపడి ఉంటాను.

 దీక్షలు విరమించండి..: తనతో పాటు దీక్షలో పాల్గొన్న తన భార్యతోపాటు మిగిలినవారు దీక్ష విరమిస్తున్నట్లు ముద్రగడ పేర్కొన్నారు. తనకు మద్దతు తెలుపుతూ రాష్ట్రవ్యాప్తంగా దీక్షలు ప్రార ంభించిన వారంతా వెంటనే విరమించుకోవాలని కోరారు.  
 
 ముద్రగడ అడిగిందేమిటి?
 ► మాది ఆఖరి పోరాటం, ఆకలి పోరాటం. మమ్మల్ని తక్షణమే బీసీ జాబితాలో చేర్చాలి.
 ► 1993లో జారీ చేసిన జీవో నంబర్ 30 ఇప్పటికీ సజీవంగానే ఉంది. దానికి చట్టబద్ధత కల్పించాలి
 ► 1961 అక్టోబర్ 14న ఇచ్చిన జీవో 3250ను పునరుద్ధరించాలి
 ► కాపుల్ని బీసీలలో చేర్చడానికి కమిషన్ నివేదిక కోసం ఎదురుచూడకుండా జీవో నంబర్ 30, 3250 ఆధారంగా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ (ప్రభుత్వ ఉత్తర్వు)తో బీసీలలో చేర్చాలి
 ► మంజునాథ కమిషన్ నివేదిక గడువును 9 నెలలకు బదులు మూడు నెలలకు కుదించాలి.
 ► మేము బీసీ రిజర్వేషన్ల కోటాలో అడగడం లేదు. మాకు ప్రత్యేకంగా ఇవ్వాలి. మా కోసం మరో కేటగిరీ ఏర్పాటు చేయాలి
 ► ఏడాదికి రూ. 1,000 కోట్లు ఇస్తామన్నారు. రూ.100 కోట్లు మాత్రమే కేటాయించారు. రెండేళ్లయినందున మిగిలిన రూ.1,900 కోట్లు తక్షణమే విడుదల చేయాలి.
 ► కాపు ఐక్య గర్జన సందర్భంగా జరిగిన హింసాకాండకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి. మా జాతిపై పెట్టిన కేసులన్నింటినీ ఎత్తివేయాలి.
 
 ప్రభుత్వం ఇస్తానంటున్నదేమిటి?
  ► జీవో నంబర్ 30, 3250ల ప్రస్తావనే లేదు
 ► ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ గురించి మాట్లాడలేదు.
 ► మంజునాథ కమిషన్ ఏర్పాటై ఇప్పటికే 2 నెలలు కావొస్తున్నందున మరో 7 నెలలు ఆగాలి.
 ► కాపు కార్పొరేషన్‌కు ఇప్పుడు రూ. 500 కోట్లు. (రెండేళ్ళ బకాయిల్లో మిగిలిన రూ. 1400 కోట్లు ఊసు లేదు) ళీ వచ్చే బడ్జెట్‌లో రూ.1000 కోట్లు కేటాయిస్తాం. ళీ ఈ ఏడాదికి కాపు కమిషన్‌కు వచ్చే అన్ని రుణ దరఖాస్తులు పరిశీలించి పరిష్కారం.
 ► మంజునాథ కమిషన్‌లో ముద్రగడ సూచించిన వ్యక్తికి చోటు. (నాలుగు పేర్లు ఇచ్చినట్లు ముద్రగడ చెప్పారు) ళీ  ఉద్యమంలో పాల్గొన్న వారిపై కేసులు ఉండవు. కానీ, అల్లర్లపై లోతైన దర్యాప్తు అనంతరం నిందితులపై కఠిన చర్యలుంటాయి.

మరిన్ని వార్తలు