ముద్రగడకు ప్రాణ గండం

17 Jun, 2016 10:45 IST|Sakshi
ముద్రగడకు ప్రాణ గండం
  • ఉద్యమంపై ‘మంత్రా' ంగం
  • ముద్రగడ దీక్షపై మంత్రులు చినరాజప్ప, గంటా అనుచిత వ్యాఖ్యలు
  •  జిల్లా వ్యాప్తంగా మిన్నంటిన నిరసనలు
  •  ముమ్మిడివరంలో సెల్‌టవర్ ఎక్కిన యువకుడు
  •  ముద్రగడను మీడియా ముందు హాజరుపరచాలని డిమాండ్
  •  అమలాపురం సీఐ సస్పెన్షన్‌కు పట్టు
  •  జెడ్పీ చైర్మన్‌ను అడ్డుకున్న ఆందోళనకారులు
  •  
     
    నోటితో మాట్లాడి ... నొసటితో వెక్కిరించడమంటే ఇదేనేమో. ఓ వైపు అధికారులను పంపించి, చర్చల పేరుతో వైద్యానికి ఒప్పించి, రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రిలో వైద్య సేవలు అందిస్తూనే మరోవైపు మంత్రులతో ఎగతాళి వ్యాఖ్యలు చేయించడం చంద్రబాబు నీచ నైజానికి నిదర్శనమని పలు వర్గాలు మండిపడుతున్నారు. బాధ్యతాయుత పదవుల్లో ఉండే మంత్రులు బాధ్యతారహితంగా మాట్లాడి ముద్రగడను వైద్యాన్ని నిరాకరించే దిశకు మళ్లీ తీసుకువెళ్లారు. ముఖ్యంగా హోంమంత్రి, ఉప ముఖ్య మంత్రి చినరాజప్ప ‘ముద్రగడ డిమాండ్లను ప్రభుత్వం అంగీకరించలేదని వ్యాఖ్యానించగా... మరో మంత్రి గంటా మరో అడుగు ముందుకేసి అసలు ముద్రగడ ఆమరణ దీక్షే చేయడం లేదంటూ ప్రకటించడంతో ఆగ్రహం వ్యక్తమవుతోంది.
     
    రాజమేహంద్రవరం : తుని ఘటన కేసులు ఎత్తివేసి, అరెస్టు చేసినవారిని విడుదల చేయాలని గత ఎనిమిది రోజులుగా ముద్రగడ పద్మనాభం చేస్తున్న ఆమరణ నిరాహార దీక్షపై మంత్రులు నిమ్మకాయల చినరాజప్ప, గంటా శ్రీనివాసరావులు చేసిన వ్యాఖ్యలు జిల్లాలో అగ్గిరాజేశాయి. ముద్రగడ దీక్ష విరమించారని చినరాజప్ప, అసలు దీక్షే చేయలేదని గంటా శ్రీనివాసరావులు మాట్లాడడంపై కాపు సామాజికవర్గ ప్రజలు మండిపడుతున్నారు. కాపుల కోసం ప్రాణ త్యాగానికి కూడా సిద్ధపడిన ముద్రగడపై మంత్రులు ఇష్టానుసారంగా మాట్లాడడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. ముద్రగడకు మద్దతుగా ఆందోళనలు, ధర్నాలతో హోరెత్తిస్తున్నారు.
     
     పి.గన్నవరం సెంటర్‌లో వందలాది మంది భారీ ధర్నా నిర్వహించారు. మంత్రులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అంబాజీపేట సెంటర్‌లో యువకులు మోటారు బైక్ ర్యాలీ నిర్వహించారు. మంత్రులపై మండిపడ్డారు. గంటా, చినరాజప్పకు మంచిబుద్ధి కల్పించాలని మలికిపురం మండలం కేశనపల్లిలో తల్లకిందులుగా నిలబడి నిరసన తెలిపారు. ముమ్మిడివరం నియోజకవర్గంలో ర్యాలీ చేసిన పలువురు కాపునేతలను పోలీసులు నిర్బంధించారు.  కిర్లంపూడి మండలంలో పలు చోట్ల ధర్నాలు చేశారు. ముద్రగడ దీక్షకు మద్దతుగా కడియం నర్సరీ రైతులు మొక్కలు ఎగుమతులు నిలిపివేశారు. ఏలేశ్వరం మండలం తూర్పు లక్ష్మీపురంలో మహిళలు, కాపులు రాస్తారోకో చేశారు.
     
     పేరవరం గ్రామంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కొత్తపేట సాయిబాబా ఆలయంలో ముద్రగడ ఆరోగ్యం బాగుండాలని ప్రత్యేక పూజలు చేశారు. వాడపాలెంలో పొట్టి శ్రీరాములు విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. సామర్లకోట మండలం వి.కె.రాయపురంలో వైఎస్సార్‌సీపీ నాయకుడు సలాది దొరబాబు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించగా పోలీసులు స్టేషన్‌కు తరలించారు. తుని నియోజవర్గం ఎస్.అన్నవరంలో వంగవీటి మోహనరంగా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ నిరసనవ్యక్తం చేశారు. పిఠాపురం వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ కో-ఆర్డినేటర్ పెండెం దొరబాబు ఆరో రోజు గృహనిర్భంధంలో ఉన్నారు.
     
     ముద్రగడను చూపించాలని సెల్‌టవర్ ఎక్కిన  యువకుడు
     ముద్రగడ ఆరోగ్యం క్షీణించిందన్న వార్తల నేపథ్యంలో ఆయన్ను  చూపించాలనే డిమాండ్ ఊపందుకుంది. ముమ్మిడివరంలో గురువారం ఓ యువకుడు సెల్ టవర్ ఎక్కాడు. ముద్రగడను మీడియా ముందు హాజరుపరచాలని, కాపు జాతిని దూషించిన అమలాపురం సీఐ వైఆర్ శ్రీనివాసరావును సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశాడు.

    జాతీయ రహదారిపై ధర్నా చేస్తున్న ఆందోళనకారులు జెడ్పీ చైర్మన్ నామన రాంబాబును అడ్డగించారు.జెడ్పీ చెర్మన్‌ను సెల్ టవర్ వద్దకు తీసుకెళ్లి యువకుడితో మాట్లాడించారు. సీఐ వ్యవహారాన్ని నామాన ఎస్పీ దృష్టికి తీసుకెళ్లారు. కిర్లంపూడి మండలం సింహాద్రిపురంలో పురుగుల మందు డబ్బాలు చేతపట్టుకుని మహిళలు ఆందోళనలు చేశారు. ముద్రగడకు ఏమైనా జరిగితే వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వానికి తగిన విధంగా బుద్ధి చెబుతామని హెచ్చరించారు.

మరిన్ని వార్తలు