ముద్రగడ ఆరోగ్యంతో సర్కార్ ఆటలు!

17 Jun, 2016 07:16 IST|Sakshi
ముద్రగడ ఆరోగ్యంతో సర్కార్ ఆటలు!

కాపు ఉద్యమ నేత ఆరోగ్యం మరింత విషమం
సాక్షి ప్రతినిధి, కాకినాడ: కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం ఆరోగ్య పరిస్థితి విషమంగా మారింది. ఎనిమిది రోజులుగా ఆమరణదీక్ష చేస్తున్న ఆయన ఆరోగ్యంతో చంద్రబాబు సర్కారు చెలగాటమాడుతోంది. ఓవైపు అధికారులను పంపి, చర్చలంటూ వైద్యానికి ఒప్పించి, రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రిలో వైద్య సేవలు అందిస్తూనే మరోవైపు మంత్రులతో ఎగతాళి వ్యాఖ్యలు చేయించి ముద్రగడ వైద్యానికి నిరాకరించే స్థితికి కారణమైంది. ఇప్పుడాయన  వైద్యాన్ని పూర్తిగా నిరాకరించడంతో ఏ క్షణాన ఏమి జరుగుతుందో చెప్పలేమని వైద్యులంటున్నారు.

మంత్రుల వ్యాఖ్యలు, వైద్యానికి ముద్రగడ నిరాకరణ, ఆయన ఆరోగ్యం విషమించిందనే సమాచారం బయటకు రావడంతో గురువారం రాష్ట్రవ్యాప్తంగా కాపు ఉద్యమం మరింత ఎగసింది.గోదావరి జిల్లాలతో పాటు పలు జిల్లాల్లో రాస్తారోకోలు, ధర్నాలు, యువకుల బైక్ ర్యాలీలు జరిగారుు. తుని ఘటనలో అరెస్టు చేసిన వారిని విడుదల చేయాలనే డిమాండ్‌తో ఆమరణ దీక్ష చేస్తున్న ముద్రగడ ఆరోగ్యం పూర్తిగా క్షీణించడంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. రాజమహేంద్రవరం జిల్లా ఆస్పత్రి వైద్యులు గురువారం విడుదల చేసిన బులెటిన్‌లో ఈ విషయం స్పష్టమైంది.   

 చర్చలు సానుకూలమయ్యూయన్న డీఐజీ
గతంలోనూ, ఇప్పుడూ ముద్రగడ డిమాండ్ ఒక్కటే.. అరెస్టు చేసిన వారిని విడుదలచేయాలి, అరెస్టులు ఆపేయాలి. వీటిపై ముద్రగడ రెండోసారి ఆమరణదీక్ష ప్రారంభించిన వారం రోజుల తరువాత కానీ చంద్రబాబు దిగిరాలేదు. మంగళ, బుధవారాల్లో జరిగిన చర్చలు సానుకూలమయ్యూయని డీఐజీ శ్రీకాంత్ మీడియాకు చెప్పుకొచ్చారు. అరెస్టు చేసిన వారి విడుదలకు గాను బెయిల్ తేవడానికి సాంకేతికంగా సమయం పడుతుందన్నారు. తుని ఘటనలో లోతైన విచారణ జరిపాకే చర్యలన్నారు. ఆరోగ్యం క్షీణిస్తున్న దృష్ట్యా వైద్యానికి అంగీకరించాలని ముద్రగడను కోరారు. కాపు జేఏసీ కూడా నచ్చచెప్పగా ముద్రగడ వైద్యానికి సానుకూలత వ్యక్తం చేశారని, ఆయన రక్తనమూనాలు సేకరించి, వైద్యులు ఫ్లూయిడ్స్ ఇస్తున్నారని బుధవారం అధికారులు చెప్పారు.

 కలత చెందిన ముద్రగడ
అరెస్టు చేసిన 13 మంది బెయిల్‌పై విడుదలయ్యాక మాత్రమే దీక్ష విరమిస్తానని స్పష్టంచేసిన ముద్రగడ అందుకు అధికారులు అంగీకరించిన తర్వాతే వైద్యానికి ఒప్పుకున్నారు. ఈ తరుణంలో ముద్రగడ పెట్టిన డిమాండ్‌లను ఒప్పుకోలేదని ఉపముఖ్యమంత్రి చినరాజప్ప, ఫ్లూయిడ్స్ ఎక్కించడంతో దీక్ష విరమించినట్టేనని, ఏడు రోజులు దీక్ష చేసిన తరువాత కూడా వైద్య నివేదికలు సాధారణంగా ఎలా ఉన్నాయనే చర్చ కూడా ఉందని మరో మంత్రి గంటా శ్రీనివాసరావు చేసిన వ్యాఖ్యలతో ముద్రగడ కలతచెంది గురువారం ఉదయం నుంచి  వైద్యాన్ని నిరాకరించారు.

  బుధవారంలా కనీసం రక్త నమూనాలు తీసుకోవడానికి కూడా అంగీకరించలేదు. ఫ్లూయిడ్స్ పెట్టేందుకు ప్రయత్నించిన వైద్యులపై ఆగ్రహం వ్యక్తంచేశారని, తనను మానసికంగా వేధించవద్దని.. వదిలివేయాలని అన్నారని  తెలియవచ్చింది.  దీంతో ఏ క్షణాన ఏం జరుగుతుందోనని వైద్యులు భయపడుతున్నారు. ఇదే విషయాన్ని వైద్య ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ మాలకొండయ్యకు మొరపెట్టుకుని, తమను ఆ విధుల నుంచి మార్చాల్సిందిగా అడుగుతున్నారని సమాచారం.ఈ నేపథ్యంలో ముద్రగడ, ఆయన కుటుంబ సభ్యులను విశాఖ, లేదా హైదరాబాద్ తరలించే ప్రయత్నంలో అధికారులున్నట్లు తెలిసింది.

 భౌతికంగా లేకుండా చేయడానికే..
సమస్య పరిష్కారమయ్యే సమయంలో చంద్రబాబు మెప్పు కోసం ఆ ఇద్దరు మంత్రులు అనుచిత వ్యాఖ్యలు చేసి, సమస్యను మళ్లీ మొదటికి తెచ్చి మరింత జటిలం చేశారని కాపు జేఏసీ నేతలు మండిపడుతున్నారు. స్వయంగా డీఐజీ స్థాయి అధికారి చెప్పాక కూడా మంత్రులు ఇలా వ్యాఖ్యలు చేశారంటే ఆ మాటల వెనుక చంద్రబాబు ఉండవచ్చన్న అనుమానాన్ని వారు వ్యక్తం చేస్తున్నారు. సమస్యను మరింత జటిలం చేసి ముద్రగడను భౌతికంగా లేకుండా చేసి, భవిష్యత్‌లో కాపు ఉద్యమాన్ని లేకుండా చేద్దామనే దురాలోచనతో సర్కారు ఉన్నట్టుగా కనిపిస్తోందని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా, సర్కారు గత ఎనిమిది రోజులుగా పోలీసు బలగాలతో ఉద్యమాన్ని అణచివేసేందుకు ప్రయత్నించింది. అసలు ఉద్యమమే లేదని నమ్మించేందుకు సాక్షి సహా పలు చానళ్ల ప్రసారాలను పూర్తిగా నిలిపివేయించింది.  ఈ క్రమంలోనే కాపు సామాజికవర్గానికే చెందిన మంత్రులతో ముద్రగడపై ఎదురుదాడి చేయించింది. ఇప్పుడు ఏకంగా ముద్రగడ ప్రాణాలతోనే చెలగాటమాడుతోంది.

 ప్రభుత్వం స్పందించకపోవడం దారుణం: సోమేశ్వరరావు, ముద్రగడ వియ్యంకుడు
ముద్రగడ పద్మనాభంతోపాటు ఆయన కుటుంబ సభ్యుల ఆరోగ్య బాగా క్షీణించింది. రక్త, మూత్ర పరీక్షల్లో ఇన్‌ఫెక్షన్ ఉందని తేలింది. అయినా ముద్రగడ పట్టు వీడడంలే దు. జాతికోసం తాను చనిపోయినా ఫర్వాలేదని అంటున్నారు. ఎనిమిది రోజులుగా దీక్ష చేస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడం దారుణం.

బాబును నమ్మి మరోసారి మోసపోయూం..
చంద్రబాబును నమ్మి మరోసారి మోసపోయామని కాపు నేతలు మండిపడుతున్నారు. చంద్రబాబు సర్కారు ముద్రగడ ప్రాణాలతో చెలగాటమాడుతున్న తీరు నేపథ్యంలో కాపు నేతలు పరిస్థితిని ఎప్పడికప్పుడు సమీక్షిస్తున్నారు. వాస్తవానికి రా్రష్ట్ర స్థాయి కాపునేతలు ఇచ్చిన రెండు రోజుల గడువు గురువారంతో ముగిసింది. ముద్రగడ వైద్యానికి అంగీకరించారని, చర్చలు సానుకూలమయ్యాయని తెలుసుకుని వారు సమావేశాన్ని వాయిదా వేశారు. మంత్రుల వ్యాఖ్యలు, ముద్రగడ ఆరోగ్యం ఆందోళనకరంగా ఉండటంతో రాజమహేంద్రవరంలో చర్చలు జరిపిన కాపు జేఏసీ నేతలు భవిష్యత్ కార్యాచరణపై రాష్ట్ర కాపు నేతలతో మాట్లాడుతున్నారు.

మరిన్ని వార్తలు