మంచినీళ్లు కూడా ముట్టని పద్మనాభం

11 Jun, 2016 17:23 IST|Sakshi
మంచినీళ్లు కూడా ముట్టని పద్మనాభం

తుని ఘటనలో అరెస్టు చేసినవారిని విడుదల చేయాలంటూ నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభం ఆస్పత్రిలో కనీసం పచ్చి మంచినీళ్లు కూడా ముట్టడం లేదు. ఈ విషయాన్ని రాజమండ్రి ప్రభుత్వాస్పత్రి సూపరింటెండెంట్ కిషోర్ మీడియాకు తెలిపారు. ఆయన చూసేందుకు బాగానే కనపడుతున్నారు గానీ.. బాగా నీరసపడ్డారని అన్నారు. ముద్రగడకు డయాబెటిస్ ఉండటం, ఇప్పటికే ఆయన దీక్ష ప్రారంభించి 48 గంటలు దాటడంతో కీటోన్స్‌ ఏర్పడే ప్రమాదం ఉందని తెలిపారు. అయితే.. కీటోన్స్ ఏర్పడ్డాయో లేదో రక్తపరీక్షలోనే తెలుస్తుందని, అందుకోసం రక్త నమూనాలు తీసుకోవాల్సి ఉండగా ఆ అవకాశం కూడా ఆయన ఇవ్వడం లేదని చెప్పారు.

ముద్రగడతో పాటు ఆయన భార్య, కుమారుడు, కోడలు అందరూ దీక్షలోనే ఉన్నారని.. వాళ్లలో ముద్రగడ తప్ప మిగిలిన వారు కొద్దిగా మంచినీళ్లు తీసుకుంటున్నారని డాక్టర్ రమేష్ తెలిపారు. పద్మనాభం కూడా త్వరగా పంతం విరమించుకుని కనీసం కాస్త మంచినీళ్లు తీసుకుంటే మంచిదని, అప్పుడు మూత్రపిండాలు పాడవ్వకుండా ఉంటాయని తెలియజేశామన్నారు. ప్రతి 6 లేదా 12 గంటలకు ముద్రగడ ఆరోగ్యానికి సంబంధించిన బులెటిన్ విడుదల చేయాలని కలెక్టర్ చెప్పారని ఆయన అన్నారు.

మరిన్ని వార్తలు