ఫుట్‌ఓవర్‌ బ్రిడ్జి నిర్మించాలని ఆందోళనలు

7 Sep, 2016 21:58 IST|Sakshi
బంజారాహిల్స రోడ్‌ నెం. 3లోని ముఫకంజా ఇంజనీరింగ్‌ కాలేజీ ముందు ఫుట్‌ఓవర్‌ బ్రిడ్జి కావాలని విద్యార్థుల ర్యాలీ, ఆందోళన.

బంజారాహిల్స్‌: బంజారాహిల్స్‌ రోడ్‌ నెం.3లోని ముఫకంజా ఇంజినీరింగ్‌ కాలేజీ ముందు ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జి నిర్మించాలంటూ విద్యార్థులు ఆందోళనకు దిగారు. బుధవారం కళాశాల ప్రధాన గేటు నుంచి సుమారు వెయ్యి మంది నినాదాలు చేస్తూ ప్రధాన రోడ్డుపై ఆందోళన చేశారు. ఈ రోడ్డులో ప్రమాదాలు నిత్యకృత్యమయ్యాయని అధికారులు మాత్రం చోద్యం చూస్తున్నారంటూ ధ్వజమెత్తారు. చిన్నారి రమ్య రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన తర్వాత అదే నెలలో ఇదే ప్రాంతంలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారన్నారు.

తాము పలుమార్లు సంబంధిత అధికారులను కలిసి పరిస్థితిని వివరించి.. ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జి అవసరాన్ని చెప్పామని అయినా అధికారుల్లో చలనం లేదని దుయ్యబట్టారు. ఇటీవల జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ జనార్దన్‌రెడ్డిని కలిసి సమస్యను వివరించామన్నారు. కాగా పెద్ద సంఖ్యలో విద్యార్థులు రోడ్డెక్కడంతో ట్రాఫిక్‌ స్తంభించిపోయింది. పోలీసులు రంగప్రవేశం చేసి విద్యార్థులను అక్కడి నుంచి పంపించారు.

 

>
మరిన్ని వార్తలు