ప్రశాంతంగా మున్సిపల్‌ కౌన్సిల్‌ సమావేశం

27 Aug, 2016 22:59 IST|Sakshi
ప్రశాంతంగా మున్సిపల్‌ కౌన్సిల్‌ సమావేశం

కోదాడఅర్బన్‌ : నిత్యం వివాదాలతో అర్థంతరంగా ముగిసే కోదాడ మున్సిపల్‌ కౌన్సిల్‌ సమావేశం శనివారం మాత్రం ప్రశాంతంగానే జరిగింది. కమిషనర్‌గా అమరేందర్‌రెడ్డి బాధ్యతలు చేపట్టిన తరువాత నిర్వహించిన తొలి సాధారణ సమావేశంలో కౌన్సిల్‌ సభ్యులు పట్టణంలో నెలకొన్న ప్రధాన సమస్యలను పరిష్కరించాలని కోరారు. మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ వంటిపులి అనిత అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మొత్తం 73 తీర్మానాలను ప్రతిపాదించగా అందులో అధికభాగం సీసీ రోడ్లు, డ్రెయినేజీల నిర్మాణాలే ఉండడం  గమనార్హం. ఈ తీర్మానాలన్నింటికీ సభ్యులు ఆమోదం తెలపడం విశేషం.
సమస్యలపై అధికారులను నిలదీసిన కౌన్సిలర్లు..
సమావేశం ప్రారంభంలోఎజెండా అంశాలపై ప్రతిపాదనలు చదువుతుండగానే కొందరు సభ్యులు తమ వార్డుల్లో మంచినీరు, పారిశుద్ధ్యం, వీధిలైట్ల వంటి సమస్యలున్నాయని వీటిపై ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదని వాపోయారు.  ఇంజనీరింగ్‌ అధికారులు స్పందించి త్వరలోనే పరిష్కరిస్తామన్నారు. ఇంకా పలు సమస్యలను ప్రస్తావించగా వీటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని చైర్‌పర్సన్‌ ప్రకటించి ఎజెండా అంశాలపై చర్చను కొనసాగించారు.
వాటర్‌ ట్యాంకర్ల బిల్లులపై ప్రధాన చర్చ..
పట్టణంలో ప్రజలకు మంచినీరు అందించేందుకు ఏర్పాటు చేసిన వాటర్‌ ట్యాంకర్లకు సంబంధించి వాటి యజమానులకు బిల్లులు చెల్లించకపోవడంతో వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, బిల్లులు చెల్లించాలని వాడపల్లి వెంకటేశ్వర్లు, పార సీతయ్య సమావేశం దష్టికి తీసుకువచ్చారు. అంతేకాక పట్టణంలో సీసీరోడ్లు, డ్రెయినేజీల నిర్మాణాలకు ఆన్‌లైన్‌ టెండర్లు పిలిచినప్పుడు హైదరాబాద్‌కు చెందిన కాంట్రాక్టర్లు టెండర్లు దాఖలు చేస్తున్నారని, కానీ వారు సకాలంలో పనులు చేపట్టకపోవడం వల్ల కౌన్సిలర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, కాంట్రాక్టర్ల వివరాలు పరిశీలించి టెండర్లు ఆమోదించాలని పార సీతయ్య కోరారు.  
పందుల బెడద నుంచి కాపాడాలని వినతి
పట్టణంలో కోతులు, పందులు, కుక్కల బెడద నుంచి ప్రజలను కాపాడాలని పలువురు సభ్యులు కోరారు. వైఎస్సార్‌సీపీ సభ్యుడు తుమ్మలపల్లి భాస్కర్‌ మాట్లాడుతూ తన వార్డులో పార్కు ఏర్పాటు చేసేందుకు గతంలోనే ప్రతిపాదించినా నేటివరకు అమలు కాలేదన్నారు. మొత్తం మీద కౌన్సిల్‌ సభ్యులు తమ వార్డుల్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికై చర్చ జరిగిన తరువాత మిగిలిన ప్రతిపాదనలను ఏకగీవ్రంగా ఆమోదించారు. ఈ సమావేశంలో కమిషనర్‌ అమరేందర్‌రెడ్డి, పలువురు కౌన్సిలర్లు, కోఆప్షన్‌ సభ్యులు, వివిధ విభాగాల మున్సిపల్‌ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు