'భారతీయుడిని'...చచ్చేలా కొట్టారు!

30 Jan, 2016 08:48 IST|Sakshi
గాయపడిన ముప్పాళ్ల బద్రీనారాయణ

అవినీతిని ప్రశ్నించినందుకే దాడి
అధికారం అండతో ‘కాంట్రాక్ట్’ గూండాల దాష్టీకం
ఐదుగురిపై కేసు, అదుపులో ముగ్గురు
పెనమలూరు సీఐ వ్యవహారంపై ఏసీపీ సీరియస్
ఆస్పత్రిలో బాధితుడు

 
విజయవాడ : అతని పేరు పెనమలూరు భారతీయుడు. అసలు పేరు ముప్పాళ్ల బద్రీనారాయణ. స్వతహాగా కోటీశ్వరుడైనా.. యాభయ్యేళ్ల వయసులోనూ ఎక్కడ అవినీతి, అక్రమం జరిగినా అక్కడ ఉంటాడు. అవినీతిని ప్రశ్నించడమే పనిగా పెట్టుకున్నాడు. జనం భారతీయుడు వచ్చాడని ఆనందిస్తారు. ఎన్నోసార్లు అభినందించారు. అధికారం పార్టీ అండతో తమ అక్రమాల హవా సాగిస్తున్న కొందరు బినామీ కాంట్రాక్టర్లకు ఆయన తీరు అడ్డంకిగా మారింది. బెదిరింపులకు దిగినా లెక్కచేయకపోవటంతో ఈ నెల మొదటి వారంలో ఆయనపై దాడి చేశారు.
 
ఆ విషయాన్ని మీడియా ముందు చెబుతుండగా తనపై దాడిచేసి కొట్టాడంటూ పంచాయతీ వార్డు సభ్యుడు కిలారు ఆంజనేయులు ఆయనపైనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. తననే కొట్టి తనపైనే ఫిర్యాదు చేశాడంటూ బద్రీనారాయణ పోలీసులకు ఫిర్యాదు చేసినా వారు పట్టించుకోలేదు. దీంతో ఆయన హైకోర్టును ఆశ్రయించారు. కోర్టు ఉత్తర్వుల మేరకు ఈ నెల 16న పోలీసులు కేసు నమోదు చేయటంతో రెచ్చిపోయిన కాంట్రాక్టు గూండాలు ఈ నెల 27వ తేదీ తెల్లవారుజామున వాకింగ్ కోసం బయటికొచ్చిన ఆయనపై తీవ్రంగా దాడి చేశారు. చనిపోయాడనుకుని వదిలేసి వెళ్లిపోయారు. స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచార మందించటమే గాక ఆయన్ని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన విజయవాడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
 
 ప్రశ్నించాడనే చంపబోయారు...
 సామాజిక కార్యకర్తగా ఉన్న బద్రీనారాయణ సమాచార హక్కు చట్టం ద్వారా కాంట్రాక్టర్ల అవినీతిపై వివరాలు సేకరించి నిలదీస్తుండటం నచ్చకే చంపబోయారని స్థానికులు పేర్కొంటున్నారు.
 
 మరోపక్క పెనమలూరు పోలీసులు వారికే వత్తాసు పలకటంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కోర్టు ఆదేశాల నేపథ్యంలో పోలీసులు పెనమలూరుకు చెందిన ఐదుగురు టీడీపీ నాయకులపై కేసు నమోదు చేశారు. మారుపూడి ధనకోటేశ్వరరావు, కోయా ఆనంద్ (మండల ప్రజా పరిషత్ వైస్ చైర్మన్), కిలారు ఆంజనేయులు (పంచాయతీ వార్డు సభ్యుడు), కిలారు సుధాకర్, కోయ శ్రీనివాస్ చక్రవర్తి కేసు నమోదైనవారిలో ఉన్నారు.
 
 ఏసీపీ సీరియస్
 ఇన్‌చార్జ్ ఏసీపీగా ఉన్న మహిళా పోలీస్‌స్టేషన్ ఏసీపీ వీవీ నాయుడు ఈ కేసును సీరియస్‌గా తీసుకున్నారు. నిందితులను అరెస్టు చేయకపోవటం, కేసును నీరుగార్చేలా సెక్షన్లు నమోదు చేయటంపై మండిపడ్డారు. హత్నాయత్నం కేసులో బెయిలబుల్ సెక్షన్లు ఎలా వేస్తారని స్టేషన్ హౌస్ ఆఫీసర్‌ను ప్రశ్నించారు. అంతేకాదు నిందితుల్లో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. మరోపక్క అధికార పార్టీ నుంచి ఇద్దరు మంత్రులు పోలీసులపై ఒత్తిడి పెంచినట్లు సమాచారం.

మరిన్ని వార్తలు