వ్యక్తి దారుణ హత్య

19 Jul, 2016 23:46 IST|Sakshi
కేసు వివరాలను వెల్లడిస్తున్న డీఎస్పీ
కర్నూలు:  కర్నూలు శివారులోని వీకర్‌సెక్షన్‌ కాలనీలో నివాసముంటున్న మారుతీ ఆచారి (31) దారుణహత్యకు గురయ్యాడు. మహబూబ్‌నగర్‌ జిల్లా ఇటిక్యాల గ్రామానికి చెందిన ఈయన ఉపాధి నిమిత్తం మూడు నెలల క్రితం కర్నూలుకు వలస వచ్చాడు. ఉంగరాలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నాడు. సోమవారం రాత్రి వ్యాపారం ముగించుకొని కల్లుతాగి ఇంటికి వెళ్తూ కాలనీలోని టీ బంకు దగ్గర ముళ్ల పొదల్లో మూత్ర విసర్జనకు వెళ్లాడు. అదే కాలనీకి చెందిన మద్దిలేటి అలియాస్‌ మధు, ఉమర్‌బాషా తదితరులు మూత్ర విసర్జన ఎక్కడ చేస్తున్నావంటూ ఆచారిపై దాడి చేసి గాయపరిచారు. బాధితుడు అదే కాలనీలో నివాసం ఉంటున్న సోదరుడు వీరేష్‌ను తీసుకొచ్చి వారిపై గొడవకు దిగడంతో మళ్లీ కాలుతో కొట్టి కిందపడవేసి గాయపరిచారు. కొద్దిసేపటికే మారుతీ ఆచారి మృతి చెందాడు. విషయం తెలిసిన వెంటనే నాల్గవ పట్టణ పోలీసులు అక్కడికి చేరుకొని గొడవకు దారితీసిన కారణాలను అడిగి తెలుసుకున్నారు. కల్లు మత్తులో బోర్ల పడటంతో మృతి చెందినట్లు పోలీసులు నిర్ధారించారు. నిందితులు  మద్దిలేటి, ఉమర్‌బాషలను ఉల్చాల జంక్షన్‌ వద్ద అదుపులోకి తీసుకొని కర్నూలు డీఎస్పీ రమణమూర్తి ఎదుట హాజరు పరిచారు. మంగళవారం నాల్గవ పట్టణ పోలీస్‌ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలను వెల్లడించారు. నిందితులను కోర్టులో హాజరు పరుచగా, న్యాయమూర్తి రిమాండ్‌కు ఆదేశించినట్లు డీఎస్పీ వెల్లడించారు. నాల్గవ పట్టణ సీఐ నాగరాజు రావు, ఎస్‌ఐలు జీవన్, నాగలక్ష్మయ్య, శ్రీనివాసనాయక్, కిరణ్‌బాబు తదితరులను డీఎస్పీ అభినందించారు.     
 
మరిన్ని వార్తలు