మోసగించినందుకే చంపా

18 Feb, 2017 00:12 IST|Sakshi
మోసగించినందుకే చంపా

నన్ను, అమ్మనూ బ్లాక్‌మెయిల్‌ చేసింది
నా చదువు నాశనమైపోయింది
అందుకే లాయర్‌ సునీతను చంపా
ప్రధాన నిందితుడు హనుమంతరావు వెల్లడి


కణేకల్లు (రాయదుర్గం) : తమ అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని ఖాళీ స్టాంప్‌ పేపర్లపై సంతకాలు తీసుకుని, మోసం చేసి, రెచ్చగొట్టి, బ్లాక్‌మెయిల్‌ చేయడం వల్లే లాయర్‌ సునీతను చంపానని ప్రధాన నిందితుడు హనుమంతరావు పోలీసుల విచారణలో ఒప్పుకున్నాడు. లాయర్‌ సునీత హత్య కేసులో ప్రధాన నిందితుడు, అతడికి సహకరించిన స్నేహితుడిని పోలీసులు శుక్రవారం అరెస్ట్‌ చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను రాయదుర్గం సీఐ బి.చలపతిరావు, కణేకల్లు ఎస్‌ఐ జి.యువరాజులు మీడియాకు వెల్లడించారు.

అప్పు కోసం వెళితే..
కణేకల్లుకు చెందిన భజంత్రీ లక్ష్మమ్మ కుమారుడు భజంత్రీ హనుమంతరావు 2014లో బెంగళూరులోని ఎస్‌ఆర్‌జీసీ కాలేజీలో బీఎస్సీ ఫస్ట్‌ ఇయర్‌ చదువుతున్నాడు. చదువుకు రూ.50వేలు డబ్బు అవసరం కావడంతో లక్ష్మమ్మ తనకు పరిచయమైన లాయర్‌ సునీత భర్త హరీష్‌కుమార్‌ను అప్పు కోసం ఆశ్రయించింది. మాగాణి భూమి పత్రాలిచ్చి తనఖా పెడితే ఇతరుల నుంచి డబ్బు ఇప్పిస్తామని చెప్పారు. సరేనని పత్రాలు ఇచ్చి డబ్బు అడిగితే.. ఇచ్చేవారు ఊళ్లో లేరని, ఒక నెల ఆగితే ఇప్పిస్తామంటూ కాలయాపన చేశారు. భూమి రిజిస్ర్టేషన్‌ చేస్తే గానీ డబ్బు ఇవ్వం అని చెబుతున్నారని చెప్పడంతో గత్యంతరం లేక లక్ష్మమ్మ బెంగళూరులో ఉన్న తన కుమారుడిని పిలిపించి విషయాన్ని చెప్పింది. రిజిస్ట్రేషన్‌కు ముందు కొంతైనా డబ్బు ఇవ్వాలని తల్లీకొడుకులు విజ్ఞప్తి చేశారు. రిజిస్ట్రేషన్‌ రోజే ఇస్తామని లాయర్‌ సునీత పేర్కొంది. మరుసటి రోజు లాయర్‌ సునీత చెప్పినట్లు రూ.100, రూ.10 స్టాంప్‌ పేపర్లను తీసుకొని తల్లీకొడుకులు లాయర్‌ వద్దకొచ్చారు. అయితే డబ్బిచ్చే వారు అత్యవసర పని వల్ల రాలేకపోయారని స్టాంప్‌ పేపర్లపై మీరు సంతకాలు చేసి వెళ్లండి.. డబ్బు రేపు ఇప్పిస్తానని నమ్మించింది. వారు సరేనని చేశారు. ఆ తర్వాత నుంచి రేపు, మాపు అంటూ డబ్బు కోసం తిప్పుకుంటూ వచ్చారు.

కోర్టు ద్వారా నోటీసులు..
విసిగిపోయిన హనుమంతరావు బెంగళూరు నుంచి కణేకల్లుకు వచ్చి లాయర్‌ను కలిసి ‘మీ అప్పు అక్కరలేదు.. మా పత్రాలు, స్టాంప్‌పేపర్లు ఇచ్చేయండి’అంటూ ఒత్తిడి చేయగా.. ఆ పత్రాలు ఇతరులతో ఉన్నాయని ఇప్పిస్తానని చెప్పింది. అనంతరం లక్ష్మమ్మ, ఆమె కుమారుడు సర్వే నంబర్‌ 334, 986బీ, 238ఏలో ఉన్న 3.15 ఎకరాల భూమిని రూ.29.28లక్షలకు అమ్మకానికి అగ్రిమెంటు కుదుర్చుకున్నట్లు స్టాంప్‌ పేపర్‌లో రాసుకుంది. అంతేకాక రూ.15లక్షలు అడ్వాన్స్‌ తీసుకున్నట్లు పొందుపరిచింది. మిగిలిన రూ.14.28లక్షలు తీసుకొని తమకు భూమి రిజిస్ట్రేషన్‌ చేయించాలంటూ కోర్టు ద్వారా నోటీసు పంపింది.

పెద్దలతో పంచాయితీ..
కోర్టు నోటీసుల విషయమై తల్లీకొడుకులు లాయర్‌ను ప్రశ్నించగా.. ఆమె గ్రామంలో పెద్ద మనుషులతో పంచాయితీ పెట్టించింది. చివరికి తాము కోర్టు ద్వారా నోటీసులు పంపేందుకు కోర్టుకు తిరిగేందుకు రూ.1.70లక్షలు ఖర్చు అయ్యిందని ఆ మొత్తం చెల్లిస్తే మీ పత్రాలు, అగ్రిమెంటు కాపీలు ఇచ్చేస్తానని డిమాండ్‌ చేసింది.  గ్రామ పెద్దలు రూ.1.50లక్షలు ఇచ్చేలా ఒప్పందం కుదుర్చారు. ఈ మేరకు అనంతపురం కోర్టులో రూ.1.50లక్షలు  చెల్లించి తల్లీకొడుకులు సమస్యను పరిష్కరించుకున్నారు. తల్లీకొడుకులు లాయర్‌ను పెట్టుకొని కోర్టుకు తిరిగేందుకు సుమారు రూ.3లక్షలు ఖర్చు అయ్యింది. అప్పు, సొప్పులు చేసి కోర్టు వరకెళ్లి సమస్య పరిష్కరించుకొన్నారు. ఈ క్రమంలో హనుమంతరావు చదువుకు గుడ్‌బై చెప్పాల్సి వచ్చింది.

రెచ్చగొట్టిందిలా..
ఈ నెల 15న హనుమంతరావు కణేకల్లులోని లాయర్‌ సునీత ఇంటి సమీపంలో ఉంటున్న తనకు తెలిసిన వారి ఇంటికి వెళ్లాడు. అప్పుడు అతడిని చూసిన లాయర్‌ ఏం చేయగలవంటూ సైగలతో రెచ్చగొట్టింది. అప్పటికే కోపంతో ఉన్న హనుమంతరావు తన స్నేహితుడు వరప్రసాద్‌కు జరిగింది చెప్పాడు. సాయంకాలం వెళ్లి సునీతను ప్రశ్నిద్దామని స్నేహితుడు సూచించాడు. దీంతో పథకం ప్రకారం హనుమంతరావు కూరగాయలు కోసే చాకును వెంట తీసుకొని వరప్రసాద్‌తో కలిసి ఆమె ఇంటికెళ్లాడు. సునీత ఉన్న గదిలోకి ప్రవేశించి నీ భర్తతో మాట్లాడాలి రమ్మని చెప్పు గర్జించాడు. నా దగ్గరే మాట్లాడు అంటూ ఆమె అంది. ఆమె వరప్రసాద్‌తో మాట్లాడుతుండగా వెనుక నుంచి హనుమంతరావు ఆమె మెడను ఒక చేత్తో పట్టుకొని చాకుతో గొంతుకోసేశాడు. ఆ తర్వాత తలుపులకు గడియ పెట్టే రాడ్‌తో కూడా గొంతులోకి గుచ్చాడు. చనిపోయే దాకా కాళ్లతో తన్నాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోయారు.

    ప్రధాన నిందితుడు హనుమంతరావు తన స్నేహితుడు వరప్రసాద్‌తో కలిసి శుక్రవారం తహసీల్దార్‌ ఆర్‌.వెంకటశేషు ఎదుట లొంగిపోయాడు. ఆ తర్వాత వారిద్దరినీ పోలీసులు అరెస్ట్‌ చేశారు. రాయదుర్గం కోర్టులో హాజరుపరిచామని సీఐ తెలిపారు.

మరిన్ని వార్తలు