వివాహేతర సంబంధంతోనే హత్య

22 Oct, 2016 01:30 IST|Sakshi
వివాహేతర సంబంధంతోనే హత్య
  • యువకుడి హత్య కేసును ఛేదించిన పోలీసులు
  • ముగ్గురి నిందుతులు అరెస్ట్‌  
  • చిట్టమూరు : వివాహేతర సంబంధం నేపథ్యంలోనే మండలంలోని కోగిలి పంచాయతీ వడ్డికండ్రిగకు చెందిన మల్లి పాపయ్య హత్యకు గురైనట్లు పోలీసులు మిస్టరినీ ఛేదించారు. ఈ నెల 6న రాత్రి పాపయ్య హత్యకు గురైన విషయం తెలిసిందే. హత్య కేసులో ముగ్గురు నిందితులను అరెస్ట్‌ చేసినట్లు గూడూరు డీఎస్పీ శ్రీనివాస్‌ స్థానిక పోలీస్‌స్టేషన్‌లో శుక్రవారం విలేకర్ల సమావేశంలో వెల్లడించారు. వడ్డికండ్రిగకు చెందిన మల్లి పాపయ్యకు ఇదే  గ్రామానికి చెందిన బెల్లంకొండ చెంచయ్య భార్యతో వివాహేతర సంబంధం ఉందన్నారు. ఈ విషయం తెలిసిన చెంచయ్య పాపయ్య ఎలాగైనా అంతం చేయాలనుకున్నాడన్నారు. అదను కోసం ఎదురు చూస్తున్న సమయంలో ఈ నెల 6న పాపయ్య తన తాత సంవత్సరీకానికి పక్కనే ఉన్న వేముగుంటపాళెంకు భార్య, పిల్లలతో వెళ్లాడు. వేముగుంటపాళెంలో కార్యక్రమం అయ్యాక భార్య, పిల్లలను అక్కడే వదలి ఒంటరిగా వడ్డికండ్రిగకు చేరుకున్నాడు. మద్యం సేవించి ఇంట్లో ఒంటరిగా పడుకున్న పాపయ్యను  గమనించిన చెంచయ్య తన  మేనమామ చెంచుకృష్ణయ్య, స్నేహితుడు సముద్రాలుతో కలిసి పాపయ్యను దిండును ముఖంపై పెట్టి ఊపిరి ఆడకుండా చేశారు. చెంచయ్య ఇనుప రాడ్డుతో పాపయ్య శరీరంపై కొట్టి  చీరతో ఉరేసి ఆత్మహత్యగా చిత్రీకరించారు. పాపయ్య చనిపోయాడని నిర్ధారించుకున్న తర్వాత అతని ఒంటిపై ఉన్న బంగారు చైను, ఉంగరం అపహరించారు. ఈ కేసును వాకాడు సీఐ అక్కేశ్వరావు, చిట్టమూరు ఎస్‌.గోపాల్, సిబ్బందితో కలిసి పలు కోణాల్లో దర్యాప్తు చేశారు. ప్రాథమికంగా లభించిన ఆధారాలతో నిందితులపై నిఘా ఉంచి గురువారం తాడిమేడు క్రాస్‌ రోడ్డు వద్ద అరెస్ట్‌ చేశారు. హత్యకు ఉపయోగించిన ఇనుపరాడ్డును, దొంగిలించిన ఉంగరాన్ని చెంచయ్య వద్ద నుంచి స్వాధీనం చేసుకున్నారు.   
     
     
>
మరిన్ని వార్తలు