వీడిన హత్య కేసు మిస్టరీ

17 Dec, 2016 21:53 IST|Sakshi
వీడిన హత్య కేసు మిస్టరీ
– ఐదుగురు కిరాయి హంతకుల అరెస్ట్‌ 
– పరారీలో ప్రధాన నిందితుడు
– మొదట అనుమానాస్పద కేసుగా నమోదు 
– పోస్టుమార్టం నివేదిక ఆధారంగా హత్యకేసుగా మార్పు 
– నిందితులను ఎస్పీ ఎదుట హాజరుపరచిన నంద్యాల పోలీసులు 
 
కర్నూలు : నంద్యాల మండలం విశ్వనగర్‌లో నివాసముంటున్న కౌలూరు చిన్నపెద్దన్న హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. వదినతో వివాహేతర సంబంధమే హత్యకు కారణంగా తేల్చారు. సోదరుడు పెద్ద పెద్దన్న రూ.75 వేలు కిరాయికి ఒప్పందం కుదుర్చుకుని తన స్నేహితుల ద్వారా చిన్నపెద్దన్నను అంతమొందించినట్లు విచారణలో తేల్చారు. మొదట అనుమానాస్పదంగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు పోస్టుమార్టం నివేదిక ఆధారంగా హత్యకేసుగా మార్పు చేశారు. పక్కా సమాచారం మేరకు శనివారం మధ్యాహ్నం మహానందికి వెళ్లే దారిలోని బంగారుపుట్ట దగ్గర  నిందితులు వడ్డె డేరింగుల సురేంద్ర అలియాస్‌ సూరి, వడ్డె మంజుల నాగరాజు అలియాస్‌ కొప్పు, కుందవరపు శేఖర్, కప్పల మురళి, సోమవరపు నాగ త్రిలోచన అలియాస్‌ బన్ను తదితరులను అరెస్టు చేశారు. నిందితులను జిల్లా కేంద్రానికి తీసుకువచ్చి ఎస్పీ ఆకే రవికృష్ణ ఎదుట హాజరుపరిచారు. నంద్యాల డీఎస్పీ హరినాథరెడ్డి, సీఐ మురళీధర్‌రెడ్డితో కలసి డీపీఓలోని వ్యాస్‌ ఆడిటోరియంలో విలేకరుల సమావేశం నిర్వహించి ఎస్పీ వివరాలను వెల్లడించారు. 
 
హత్య అని తేలిందిలా..
ఈ ఏడాది ఆగస్టు 19వ తేదీన కానాల గ్రామ పొలిమేరలోని చెట్ల పొదల్లో గుర్తు తెలియని మృతదేహం పడివున్నట్లు వీఆర్వో ఇచ్చిన ఫిర్యాదు మేరకు నంద్యాల రూరల్‌ పోలీసులు అనుమానాస్పద కింద కేసు నమోదు చేసుకున్నారు. మృతదేహం ఛాతీపై 'కె.అమ్మ' భుజంపై 'విష్ణు', చేతిపై 'అన్న' అని మూడు తెలుగు అక్షరాల పచ్చబొట్లు ఉన్నాయి. టీషర్టు, జీన్స్‌ప్యాంటు, కాళ్లకు బూట్లు ధరించాడు. పోస్టుమార్టం ప్రాథమిక నివేదికలో మృతుని గొంతు, ఛాతీ భాగాల్లో మూడు కత్తిపోటు గాయాలు ఉన్నట్లు తేలడంతో చిన్న పెద్దన్న హత్యకు గురైనట్లు పోలీసులు గుర్తించి సెక్షన్‌ 174 సీఆర్‌పీసీని ఐపీసీ సెక్షన్‌ 302గా మార్పు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
 
దర్యాప్తు ఇలా..
 పత్రికల్లో వచ్చిన ఫొటోల ఆధారంగా అక్టోబర్‌ 25వ తేదీన హతుని తల్లి నారాయణమ్మ పోలీస్‌స్టేషన్‌కు వచ్చి.. చనిపోయిన వ్యక్తి తన చిన్నకొడుకు చిన్నపెద్దన్నగా గుర్తించింది. ఆగస్టు 16వ తేదీన గుర్తు తెలియని వ్యక్తులు ఇంటి నుంచి బయటకు తీసుకెళ్లినట్లు పోలీసు విచారణలో బయటపడింది. చిన్న పెద్దన్న డ్రైవర్‌ వృత్తి చేస్తూ జీవనం సాగించేవాడు. సాయిబాబా నగర్‌లోని మణి వైన్స్‌లో మద్యం సేవించిన తర్వాత అతను కనపడలేదని విచారణలో బయటపడింది. కుటుంబ సభ్యులను విచారణ జరపగా.. తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నందున కిరాయి హంతకుల చేత హత్య చేయించినట్లు అతని అన్న పెద్ద పెద్దన్న అంగీకరించాడు. ఫుల్‌గా మద్యం తాపించి పథకం ప్రకారం  హత్య చేసినట్లు విచారణలో బయటపడిందని ఎస్పీ వివరించారు.
 
అభినందన
 ఎటువంటి ఆధారాలు లేని కేసు మిస్టరీని ఛేదించి నిందితులను అరెస్టు చేయడమే కాక నేరానికి ఉపయోగించిన ఆటోను స్వాధీనం చేసుకున్నందుకు దర్యాప్తు అధికారి మురళీధర్‌రెడ్డి, రూరల్‌ ఎస్‌ఐ శివాంజల్‌, హెడ్‌ కానిస్టేబుల్‌ చంద్రశేఖర్, కానిస్టేబుళ్లు మల్లికార్జున, నాగరాజు, శ్రీనివాసులు తదితరులను ఎస్పీ అభినందించి రివార్డులను ప్రకటించారు. 
 
మరిన్ని వార్తలు