అల్లుడు కాదు.. కిరాతకుడు..!

31 Jul, 2016 08:51 IST|Sakshi
అల్లుడు కాదు.. కిరాతకుడు..!

ఆటోలో మీటర్‌ రాడ్డుకు మామ మెడను నొక్కి హత్య 

విజయవాడ (చిట్టినగర్‌) : 
భార్యను కాపురానికి పంపమంటే పంపడం లేదని ఆగ్రహించిన అల్లుడు మామకు మద్యం తాగించి ఆటోలో మీటర్‌ రాడ్‌కు మామ మెడను పెట్టి నొక్కి హత్యచేశాడు. ఈ ఘటన  కొత్తపేట పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నైనవరం ఫ్లై ఓవర్‌ దిగువున ఉన్న కాళీకృష్ణ మందిరం వద్ద రోడ్డు పక్కగా నిలిపి ఉన్న ఆటోలో ఓ వ్యక్తి శవమై ఉన్నాడని పోలీసులకు సమాచారం అందింది. 
 
సీఐ దుర్గారావు,  ఎస్‌ఐలు సుబ్బారావు, అర్జునరాజులు ఘటనాస్థలాన్ని సందర్శించి మృతదేహాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. ఫ్లైఓవర్‌ దిగువున ఆటోలో శవం ఉందనే విషయం తెలుసుకున్న ఆటో కార్మికులు గుంపులుగుంపులుగా వచ్చి మృతుని గుర్తించేందుకు సహాయపడ్డారు. ఈ క్రమంలో విద్యాధరపురం ప్రాంతానికి చెందిన ఓ ఆటోడ్రైవర్‌ మృతుని గుర్తించి కుటుంబీకుల వివరాలను పోలీసులకు తెలిపాడు. దీంతో పోలీసులు లేబర్‌ కాలనీకి వెళ్లి మృతుని కుటుంబీకులను వెంట పెట్టుకుని ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతుని భార్య, కుమారుడు సుబ్బారావును గుర్తించడంతో కేసు ఓ కొలిక్కి వచ్చింది. 
 
భార్యను కాపురానికి పంపడం లేదనే....
విద్యాధరపురం లేబర్‌ కాలనీకి చెందిన సుబ్బారావు రెండో కుమార్తె నాగబేబీని క్వారీ ప్రాంతానికి చెందిన జోగవరపు వెంకటేష్‌కు ఇచ్చి పదేళ్ల క్రితం వివాహం జరిపించారు. ఆటో నడుపుకుంటూ జీవనం సాగించే వెంకటేష్‌ ఇద్దరు సంతానం కలిగిన తర్వాత  భార్యను వదిలి  కృష్ణలంకలో ఉంటున్న తన అక్క దగ్గరకు వెళ్లిపోయాడు. అయితే అప్పుడుప్పుడు అత్త గారి ఇంటికి వచ్చి దూరంగా ఉంటూ పిల్లలను చూసుకుని వెళుతుండేవాడు. కొద్ది రోజులుగా వెంకటేష్‌ తమ మామను కలిసి భార్యను కాపురానికి పంపాలని, లేకుంటే మీ ఇంట్లో ఎవరో ఒకరిని చంపుతానని బెదిరించేవాడు.  శుక్రవారం ఉదయం సుబ్బారావు చేతికి గాయమైంది. ఆయన స్వగ్రామం నందిగామ మండలం కోకమపాలెం గ్రామానికి వెళ్లి కట్టు కట్టించుకుని వస్తానని చెప్పి భార్య వద్ద రూ. 300 తీసుకున్నాడు. ఊరు బయలుదేరుతుండగా ఆటోపై అల్లుడు వెంకటేష్‌ ఇంటికి వచ్చాడు. మామ దగ్గరకు వచ్చి భార్యను కాపురానికి పంపాలని అడిగాడు. దీనిపై వీరి మధ్య వాగ్వివాదం జరిగింది. అనంతరం మందు తాగుదామని చెప్పి మామను వెంకటేష్‌ వెంట తీసుకెళ్లాడు.

సాయంత్రం అయినా సుబ్బారావు ఇంటికి రాకపోవడంతో స్వగ్రామం కోకయపాలెం వెళ్లి ఉంటాడని కుటుంబీకులు భావించారు. అయితే ఉదయం పోలీసులు వచ్చి సుబ్బారావు హత్యకు గురయ్యాడని చెప్పడంతో విలపించారు. నిందితుడు వెంకటేష్‌ కోసం పోలీసులు ఆరా తీయగా అతని ఫోన్‌ స్విచ్‌ ఆఫ్‌ చేసి ఉండడంతో కృష్ణలంకలోని అక్క, బావలను అదుపులోకి తీసుకుని ఆరా తీస్తున్నారు. మృతుని భార్య శివపార్వతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. 
 
నిందితుడిపై రౌడీషీట్‌ 
 నిందితుడిగా అనుమానిస్తున్న జోగవరపు వెంకటేష్‌పై వన్‌టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో కిడ్నాప్‌ కేసు నమోదైంది. ఈ కేసులో వెంకటేష్‌పై రౌడీషీట్‌ను కూడా పోలీసులు తెరిచారు. ఆటో నడుపుకుంటూ జీవనం సాగించే వెంకటేష్‌ ప్రస్తుతం విద్యాధరపురంలో ఉండడంతో షీట్‌ను భవానీపురం పీఎస్‌కు బదిలీచేశారు. అయితే కొద్ది వారాలుగా  వెంకటేష్‌ ఆదివారం సంతకాలు చేసేందుకు కూడా స్టేషన్‌కు రావడం లేదని తెలుస్తోంది.

Read latest District News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా