కొట్టక్కిలో హత్య

13 Sep, 2017 10:44 IST|Sakshi
కొట్టక్కిలో హత్య

గణేష్‌ నిమజ్జనం నాటి గొడవలే కారణమా?
డాగ్‌ స్క్వాడ్, క్లూస్‌ టీంలు రంగ ప్రవేశం
పెద్ద దిక్కు కోల్పోయిన కుటుంబ సభ్యులు  


ప్రశాంతతకు మారుపేరైన కొట్టక్కి గ్రామం మంగళవారం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. గ్రామంలో హత్యకు గురైన వ్యక్తిని చూసి గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు. తెల్లవారి పొలం పనులకు వెళ్తున్న వారికి రోడ్డు పక్కనే హత్యకు గురై కనిపించిన మృతదేహాన్ని చూసి భయకంపితులయ్యారు. పెద్ద చెరువు గట్టుపై గ్రామానికి చెందిన వ్యక్తే హత్యకు గురై ఉండడంతో ఉలిక్కి పడ్డారు. వివరాల్లోకి వెళ్తే...

రామభద్రపురం(బొబ్బిలి రూరల్‌) : కొట్టక్కి గ్రామానికి చెందిన వాకాడ సత్యనారాయణ(30) మంగళవారం  హత్యకు గురై విగతజీవిగా కనిపించడంతో ఒక్కసారిగా గ్రామస్తులంతా భయభ్రాంతులయ్యారు. దీనికి సంబంధించి సీఐ జి.సంజీవరావు తెలిపిన వివరాలు...గ్రామానికి చెందిన సత్యనారాయణ ఈ నెల 11న తెల్లవారుజామున ఐదు గంటలకు ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. సాయంత్రం వరకు ఇంటికి రాకపోవడతో కుటుంబ సభ్యులు గ్రామ పరిసరాల్లో వెదికారు. ఎక్కడా కనిపించకపోవడంతో ఆందోళన చెందారు. మంగళవారం ఉదయం అదే గ్రామానికి చెందిన రైతు తన పొలానికి నీరు కట్టేందుకు వస్తూ చెరువు మదుము తీద్దామని చెరువు గట్టుపైకి వెళ్లేసరికి అక్కడ సత్యనారాయణ మృతదేహం కనిపించడంతో వారి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. దీంతో సత్యనారాయణ భార్య మంగమ్మ వచ్చి గుర్తించి బోరుమంది. విషయం తెలిసి ఎస్‌ఐ డిడి.నాయుడు తన సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకున్నారు.

గణేష్‌ నిమజ్జనమే కారణమా...
పోలీసు ప్రాథమిక విచారణలో కొన్ని విషయాలు వెలుగు చూశాయి. గత నెల 30న గ్రామంలో గణేష్‌ నిమజ్జనం జరుపుతున్న సమయంలో డ్యాన్స్‌లు చేస్తుండగా  వీధిలోని యువత మధ్య గొడవ చోటుచేసుకుంది. పెద్దలు సముదాయించారు.  అదే సమయంలో ఒక వర్గానికి చెందిన వారు వేరో వర్గానికి చెందిన వారిలో ఒకరిని ఏదో రోజున చంపేస్తామని హెచ్చరించినట్టు తేలింది. ఈ హెచ్చరికే హత్యకు దారి తీసిందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇదే సమయంలో ఇంకేమైనా కారణాలు ఉన్నాయా? అనేది కూడా విచారిస్తున్నారు. అయితే సత్యనారాయణ కుటుంబ సభ్యులైన తల్లి గంగమ్మ, ఆమె మరిది వాకాడ సూర్యయ్య మాత్రం గణేష్‌ నిమజ్జనం రోజున హెచ్చరించిన వారే చంపేశారని ఆరోపిస్తున్నారు.

ఈ విషయాన్నే వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వాస్తవానికి గణేష్‌ నిమజ్జనం రోజు జరిగిన గొడవకు సత్యనారాయణకు ఎటువంటి సంబంధం లేదని కుటుంబ సభ్యులు రోదిస్తున్నారు. ఆ గొడవలో సత్యనారాయణ తమ్ముడు పాలుపంచుకున్నాడే తప్ప హతునికి సంబంధం లేదని చెబుతున్నారు. తల్లి గంగమ్మ ఇచ్చిన ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ నాయుడు కేసు నమోదు చేశారు. సీఐ సంజీవరావు కేసు దర్యాప్తు చేస్తున్నారు.  సంఘటనా ప్రదేశానికి డాగ్‌ స్వా్వడ్, ఆరుగురు బృందంతో కూడిన క్లూస్‌ టీం వచ్చింది. గాలింపు చర్యలు చేపట్టారు. ప్రాథమిక ఆధారాలను సేకరించారు. ఇదిలా ఉండగా హతుడు సత్యనారాయణ ముఖంపై తీవ్ర గాయాలున్నాయి. ముక్కు వెంబడి రక్తం కారిన చాయలు ఉండడంతో కచ్చితంగా హత్యేనని అంతా భావిస్తున్నారు.  

వీధిన పడిన కుటుంబం
హతుడు సత్యనారాయణ గొర్రెల కాపరిగా పని చేస్తున్నాడు. అలా వచ్చిన ఆదాయంతోనే కుటుంబాన్ని పోషిస్తున్నారు. హతునికి భార్య మంగమ్మతో పాటు సూర్య, రుషి అనే పిల్లలు కూడా ఉన్నారు. వీరంతా ఇతని ఆదాయంపైనే ఆధారపడి జీవిస్తున్నారు. ఇప్పుడు సత్యనారాయణ హత్యకు గురవడంతో ఎలా బతికేదని రోదిస్తున్నారు.

 ఆ నలుగురే చంపేశారు...
గణేష్‌ నిమజ్జనం రోజున జరిగిన గొడవలో హెచ్చరించిన గ్రామానికి చెందిన వాకాడ భాస్కరరావు, వాకాడ వెంకయ్య, వాకాడ చిన్నయ్య, జి.గురునాయుడు కక్ష కట్టి చంపేశారు. వాస్తవానికి ఆ గొడవతో సత్యనారాయణకు ఎటువంటి సంబంధం లేదు. అన్యాయంగా చంపేశారు. కఠినంగా శిక్షించాలి. –వాకాడ సూరయ్య, హతుడి చిన్నాన్న

మరిన్ని వార్తలు