-

‘ఖని’లో కాంగ్రెస్‌ నేత దారుణ హత్య

12 Sep, 2016 02:47 IST|Sakshi
దార వీరస్వామి (ఫైల్ ఫొటో)

గోదావరిఖని : కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు గోదావరిఖనికి చెందిన దార వీరస్వామి(65) దారుణ హత్యకు గురయ్యారు. పోలీసుల కథనం ప్రకారం.. పట్టణ ప్రధాన చౌరస్తా సమీపంలోని పోచమ్మ గుడి వద్ద సింగరేణి క్వార్టర్‌లో ఉంటున్న వీరస్వామి శనివారం మధ్యాహ్నం ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. ఆదివారం ఉదయం దుర్గానగర్‌లోని చెట్లపొదల్లో శవమై కనిపించాడు. మొదట గుర్తుతెలియని శవంగా భావించిన స్థానికులు పోలీసులకు సమాచార అందించారు. పోలీసులు, కాంగ్రెస్‌ నాయకులు వచ్చి వీరస్వామిగా గుర్తించారు.


స్థానిక ఇందిరానగర్‌లో నివాసముండే మడిపెల్లి మల్లేశ్‌ వివాదంలో ఉన్న భూమి విషయమై చర్చించేందుకు తీసుకెళ్లి హత్య చేశాడని వీరస్వామి భార్య రాధాబాయి గోదావరిఖని వన్‌టౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. గోదావరిఖని ఏఎస్‌పీ విష్ణు ఎస్‌.వారియర్, సిఐ వెంకటేశ్వర్‌ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. వీరస్వామిని ఛాతిపై కర్రలు, ఇనుపరాడ్లతో కొట్టి, గొంతునులిమి, మర్మాంగాలు కోసి హత్య చేసినట్లు అనవాళ్లు ఉన్నాయి. వీరస్వామికి ముగ్గురు కుమారులు ఉన్నారు. ఒకరు అమెరికాలో ఉంటున్నారు.

1985లో కాంగ్రెస్‌ పార్టీలో చేరి యూత్‌ కాంగ్రెస్, కాంగ్రెస్, ఐఎన్‌టీయూసీలో పలు పదవుల్లో పనిచేశాడు. కేంద్ర మాజీ మంత్రి జి.వెంకటస్వామి శిష్యుడిగా గుర్తింపు పొందారు. ప్రస్తుతం పలుచోట్ల పెట్రోల్‌బంక్‌ల నిర్వహణ బాధ్యతలు చూస్తున్నాడు. హత్యలో ఇందిరానగర్‌కు చెందిన వ్యక్తితోపాటు రిక్షా కాలనీకి చెందిన ఓ ఆటో డ్రైవర్‌ పాల్గొన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. వారికోసం గాలిస్తున్నారు. కాగా దళితుల భూమిని తమ పేరున రిజిస్ట్రేషన్‌ చేయించుకున్న పలువురిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది. 

జనగామ భూమి విషయంలోనే....
స్థానిక జనగామ శివారులోని గోదావరినది బ్రిడ్జికి సమీపంలో 851 సర్వే నంబర్‌ భూమి వివాదాస్పదంగా మారింది. మొత్తం 17.06 ఎకరాల స్థలంలో రాజీవ్‌ రహదారి కోసం 9.28 ఎకరాల స్థలాన్ని కేటాయించారు. మిగిలిన భూమి గ్రామానికి చెందిన దళిత కుటుంబానికి చెందినది. అయితే కొందరు వ్యక్తులు తమ పేరున రిజిస్ట్రేషన్‌ చేయించుకుని ఇతరులకు విక్రయించారు. అయితే దళితుల భూమిని కాపాడుతానంటూ ఇందిరానగర్‌కు చెందిన వ్యక్తి భూముల విషయంలో అవగాహన ఉన్న దార వీరస్వామిని సంప్రదించినట్టు సమాచారం. వీరస్వామి తనకున్న అవగాహనతో పెద్దపల్లి ఆర్డీవో కార్యాలయంలో సదరు భూమికి సంబంధించిన వివరాలు సేకరించి ఆ భూమి దళితులకు చెందేలా పనిచేశాడు. రెండు నెలల క్రితం కూడా ఆ భూమి దళితులకు చెందుతుందని, ఆ భూమిని కొనుగోలు చేసిన వారు తమ పట్టాలను రద్దు చేసుకోవాలని ఆర్డీవో కార్యాలయం నుంచి మౌఖిక సమాచారం వెలువడినట్టు తెలిసింది.

కాగా ఈ పనిని దార వీరస్వామికి అప్పగించిన ఇందిరానగర్‌కు చెందిన వ్యక్తే ఎదుటి పక్షం వారితో కుమ్మక్కై ఈ కేసు నుంచి తప్పుకోవాలని, తనకు ఎక్కువ వాటా కావాలని ఒత్తిడి చేసి బెదిరించినట్టు సమాచారం. ఇందుకోసం వీరస్వామి కూడా రూ.50 లక్షలు ఇస్తానని పత్రం రాయించి ఇచ్చినట్టు తెలిసింది. ఈ క్రమంలో శనివారం మధ్యాహ్నం ఇందిరానగర్‌లో ఉన్న వ్యక్తి పిలవడంతో అతడి ఇంటికి వెళ్లగా మొదట గొడవ జరగడంతో వీరస్వామి తిరిగి ఇంటికి చేరుకున్నాడు. తర్వాత మరో గంట వ్యవధిలోనే మళ్లీ ఫోన్‌ చేయడంతో ఇంటి పక్కన ఉండే వ్యక్తి సహాయంతో ఇందిరానగర్‌కు వెళ్లి తిరిగి రాలేదు. సాయంత్రం 6 గంటల సమయంలో వీరస్వామి ఫోన్‌ స్విచ్‌ ఆఫ్‌ కాగా...ఆదివారం ఉదయం శవమై కనిపించాడు. 

మరిన్ని వార్తలు