పోలీసుల అదుపులో హంతకుడు !

1 Apr, 2017 23:35 IST|Sakshi
ఏలూరు అర్బన్‌ : గుడివాకలంక మాజీ సర్పంచ్‌ జయమంగళ భద్రగిరిస్వామిని హత్య చేసిన నిందితుడిని ఏలూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది. అయితే ఈ విషయాన్ని పోలీసులు ధ్రువీకరించడం లేదు. గతనెల 30న భద్రగిరిస్వామిని ఏలూరు ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో దుండగుడు కిరాతకంగా హత్య చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో హంతకుడిని అరెస్ట్‌ చేసే విషయంలో పోలీసులు నిర్లిప్తంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణతో హతుని బంధువులు, గుడివాకలంక గ్రామస్తులు అదేరోజు ఏలూరు ఫైర్‌స్టేషన్‌ సెం టర్‌లో ధర్నా చేశారు. ఈ క్రమంలో జిల్లా ఎస్పీ భాస్కర్‌భూషణ్‌ ఆదేశాలతో నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు మూడు ప్రత్యేక బృందాలను నియమించారు. దర్యాప్తు వేగవంతం చేసిన పోలీసులు నిందితుడిని గుర్తించి హత్య జరిగిన మరునాడే అదుపులోకి తీసుకున్నారని విశ్వసనీయ సమాచారం. హత్యకు గ్రామ తగాదాలే కారణంగా ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. భద్రగిరిస్వామిని హతమార్చేందుకు పథ కం రచించడంతో పాటు కిరాయి హంతకుడిని పురమాయించిన కుట్రదారుడిని కూడా గుర్తించారని తెలిసింది. అతడిని కూడా అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు రంగం సిద్ధం చేశారని, న్యాయపరమైన చిక్కులు కలగకుండా పకడ్భందీ చర్యలు తీసుకోవడంతో పాటు సాధ్యమైనంత వరకూ రహస్యంగా విచారించే యోచనలో ఉన్నారని తెలుస్తోంది. కేసును సాధ్యమైనం త త్వరగా ఛేదించేందుకు ప్రయత్నాలు ప్రారంభించారని పేరు చెప్పేందుకు ఇష్టపడని ఓ పోలీసు అధికారి తెలిపారు. 
 
మరిన్ని వార్తలు