పచ్చని బతుకుల్లో చిచ్చుపెట్టారు

18 Jun, 2016 04:26 IST|Sakshi
పచ్చని బతుకుల్లో చిచ్చుపెట్టారు

దుకాణాలు కూల్చిన చోటే స్థలాలు కేటారుుంచాలి
లేదంటే పిల్లలతో సహా ఇక్కడే చస్తాం
ఒంగోలు ఎమ్మెల్యేకి ముస్లిం మహిళల అల్టిమేటం
బండ్లమిట్టలో పర్యటించిన దామచర్లపై స్థానికుల ఆగ్రహం
అధికారులది తొందరపాటు చర్యేనన్న ఎమ్మెల్యే
ఘటనతో తనకు ఎటువంటి సంబంధం లేదని తప్పుకునే యత్నం
కార్పొరేషన్ అధికారులపై చర్యలకు బాధితుల పట్టు

‘పండుగ రోజుల్లో సంతోషం నిండాల్సిన పేదల బతుకుల్లో ఆరని చిచ్చు పెట్టారు. 30 ఏళ్లు కాదు.. 60 ఏళ్లుగా మా కుటుంబాలు ఇక్కడే నివాసం ఉంటున్నారుు. కనీస సమాచారం ఇవ్వకుండా అకస్మాత్తుగా వచ్చి దుకాణాల్ని, నివాసాల్ని అడ్డగోలుగా కూల్చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోండి.. కూల్చిన చోటే మాకు స్థలాలు కేటారుుంచండి. లేదా పిల్లలతో సహా ఇక్కడే ప్రాణాలొదిలేస్తాం’ అంటూ ముస్లిం మహిళలు ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌కు అల్టిమేటం ఇచ్చారు. బండ్లమిట్టలో నగరపాలక సంస్థ అధికారులు కూల్చేసిన ప్రాంతానికి వెళ్లిన ఎమ్మెల్యేపై స్థానికులు ఆగ్రహం వ్యక్తంచేశారు.

ఒంగోలు: ఒంగోలు నడిబొడ్డున, ఊరచెరువు ఒడ్డున చిరువ్యాపారాలు చేసుకుని జీవిస్తున్న పేదలపై ఈనెల 14వ తేదీన నగర పాలక సంస్థ అధికారులు ప్రతాపం చూపించారు. పొక్లెనర్లతో వచ్చి, పోలీసు బలగాలను అడ్డుపెట్టి బండ్లమిట్టలోని రోడ్డు పక్కనున్న దుకాణాలను కూలగొట్టారు. ఈ ఘటన చిలికిచిలికి గాలివానగా మారుతున్న నేపథ్యంలో ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ శుక్రవారం ఘటనా స్థలానికి వెళ్లారు. ఈ సేవ కేంద్రం నుంచి బండ్లమిట్టలోని నాలుగురోడ్ల కూడలి వరకు పరిశీలించిన ఆయన కొద్దిసేపు మసీదు వద్ద ముస్లింలతో మాట్లాడేందుకు యత్నించారు. వారికి నచ్చజెప్పేందుకు యత్నించగా ముస్లిం మహిళల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది.

పండుగ రోజుల్లో కనీసం పిల్లలకు కాసింత భోజనం పెట్టుకునే పరిస్థితి కూడా లేకుండా చేశారని, రోజంతా కష్టపడితేగాని తమకు పొట్ట గడవదని, అలాంటి తమపై ఎందుకు ఇంత కక్షగట్టారంటూ ప్రశ్నించారు. పట్టాలు చూపించి మొరపెట్టుకున్నా కమిషనర్ కనికరించలేదని, నిర్థాక్షిణ్యంగా పోలీసుల అండతో కూల్చివేశారని వాపోయారు. మూడు నెలల క్రితమే నోటీసులు ఇచ్చామని కమిషనర్ చెప్పడం  అబద్దం అన్నారు. కేవలం కుట్రపూరితంగా ముస్లింలపై కక్షతోనే ఈ దాడికి యత్నించారని ఆరోపించారు. తాము ఎన్నిసార్లు ఫోన్‌చేసినా మీ ఫోన్ కలవలేదని పేర్కొన్నారు. న్యాయం చేస్తామంటూ ఎమ్మెల్యే చెప్పేందుకు యత్నించారు. దుర్మార్గంగా కూల్చివేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ నగరపాలక సంస్థ సిబ్బందిని ఉద్దేశించి బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.

 చర్యలకు వెనుకడుగు..
అధికారులది తొందర పాటు చర్చేనని అంగీకరించిన ఎమ్మెల్యే దామచర్ల వారిపై చర్యలకు మాత్రం సంసిద్ధత వ్యక్తం చేయకపోవడం గమనార్హం. బాధితులు పట్టాలు చూపిస్తున్నా అధికారులు లెక్కచేయకపోవడం, అసలు పట్టాలె లా వచ్చాయనే విషయూన్ని పరిశీలించకపోవడంపై మీడియా అడిగిన పలు ప్రశ్నలకు మాత్రం సమాధానం చెప్పలేకపోయారు. నష్టపోయిన వారిని ఏ విధంగా ఆదుకుంటార నే ప్రశ్నకూ స్పష్టత ఇవ్వలేదు. తమ పార్టీ కార్యాలయం నిర్మించుకోవడానికి చాలా స్థలాలు ఉన్నాయని, అందుకోసం దుకాణాల్ని కూల్చలేదని మాత్రం బదులిచ్చారు.

 మాపైనే ఎందుకీ కక్ష..
నివాసస్థలాల కోసం పట్టాలు ఇచ్చామంటూ అధికారులు ప్రకటిస్తున్నారు. నగరంలో ఎన్నిచోట్ల నివాస స్థలాల్లో వ్యాపారం నిర్వహిస్తున్నా తమపైనే ఎందుకు యుద్ధకాండను తలపించేలా దాడిచేశారో సమాధానం చెప్పాలని ముస్లింలు డిమాండ్ చేస్తున్నారు. ఎమ్మెల్యేకి సంబంధం లేకపోతే నోటీసులు ఇవ్వకుండా దాడిచేసిన వారిపై చర్యలు తీసుకునేందుకు ఎందుకు వెనుకాడుతున్నారని ప్రశ్నిస్తున్నారు.

 తొందరపాటు చర్యే..
నగరంలో మెట్లు పడగొట్టాలన్నా ముందు నోటీసులివ్వమని అధికారులకు సూచించా. పండుగ మాసంలో ఉపవాసంలో ఉండగా ముస్లింల కట్టడాలు కూల్చడం బాధాకరం. నగరపాలక సంస్థ అధికారులు తొందరపాటు చర్యే. ఇందులో తనకు ఎటువంటి సంబంధం లేదు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో భాగంగా అధికారులు తీసుకున్న చర్యే. బాధితులకు జరిగిన నష్టంపై ఒకటి రెండు రోజుల్లో అంచనాకు వస్తాం. మసీదుకు సంబంధించి కూడా వారి మతపెద్దలతో మాట్లాడతాం. తదుపరి ఎలా ఆదుకోవాలనే దానిపై నిర్ణయం తీసుకుంటాం.
- దామచర్ల జనార్దన్, ఒంగోలు ఎమ్మెల్యే

మరిన్ని వార్తలు