నేటినుంచి ‘ముస్లిం పర్సనల్‌లా జాగృతి ఉద్యమం’

22 Apr, 2017 23:01 IST|Sakshi
నేటినుంచి ‘ముస్లిం పర్సనల్‌లా జాగృతి ఉద్యమం’
రాజమహేంద్రవరం కల్చరల్‌: రాష్ట్ర వ్యాప్తంగా ముస్లిం పర్సనల్‌ లా జాగృతి ఉద్యమం ఆదివారం నుంచి మే 7వ తేదీ వరకు నిర్వహించనున్నట్టు జమాతె ఇస్లామీ హింద్‌ నాయకుడు మహ్మద్‌ రఫీద్‌ వెల్లడించారు. ఇటీవల తరచు ముస్లిం పర్సనల్ లా, తలాక్ వంటి విషయాల్లో రాద్ధాంతాలు చేస్తున్నారని శనివారం ఆయన ప్రెస్‌క్లబ్‌లో విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు. ప్రభుత్వం ముస్లిం మహిళల విషయంలో మొసలికన్నీరు కారుస్తోందని ఆయన విమర్శించారు. ముస్లిం పర్సనల్‌లాపై అవగాహన కలిగించేందుకు ఈ జాగృతి ఉద్యమం నిర్వహిస్తున్నామన్నారు. మేధావులను, మానతావాదులను కలసి పర్సనల్‌లాపై అవగాహన కలిగిస్తామన్నారు. బహిరంగసభలు, కరపత్రాలు, ప్రసారమాధ్యమాల ద్వారా ముస్లిం పర్సనల్‌లాపై అవగాహన కలిగిస్తామన్నారు. ముస్లింలు వివాహం, విడాకులు, ఆస్తిపంపకాలు, మనోవర్తి తదితర అంశాలకు ప్రాతిపదిక బ్రిటిష్‌ ప్రభుత్వం 1937లో చేసిన షరీయత్‌ అప్లికేషన్‌ చట్టమని పేర్కొన్నారు. స్వాతంత్య్రం వచ్చిన తరువాత కూడా రాజ్యాంగ నిర్మాతలు ఈ  చట్టం విషయంలో జోక్యం చేసుకోలేదని ఆయన వివరించారు. ముస్లిం పర్సనల్‌ లాలోని అంశాలకు మూలం మానవనిర్మిత చట్టాలు కావని, సృష్టికర్త ఉపదేశం ప్రకారమే రూపొందించనవని పేర్కొన్నారు. రాజ్యాంగంలోని 44వ అధికరణంలో పేర్కొన్న ఉమ్మడిపౌరసత్వం గురించి పెద్దలు పదేపదే మాట్లాడుతున్నారు, కానీ రాజ్యాంగం 25,26 అధికరణాలలో ఇచ్చిన సమానత్వం గురించి, మత స్వేచ్ఛను గురించి మాట్లాడటం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ట్రిపుల్‌ తలాక్ అంశంతో జరిగిన విడాకులు మొత్తం విడాకులలో 0.05 శాతం మాత్రమేనని ఆయన తెలిపారు. ముస్లిం పర్సనల్‌లాపై అవగాహన కలిగించేందుకు మే 6వ తేదీన జిల్లా వ్యాప్తంగా బహిరంగసభలు నిర్వహిస్తామన్నారు. ఆ సభల్లో జమాతె ఇస్లామీ హింద్‌ జాతీయ నాయకులు పాల్గొంటారన్నారు. పర్సనల్‌లాకు సంబంధించిన వాల్‌పోస్టర్‌ను, ముస్లిం పర్సనల్‌ లాపై సంస్థ ప్రచురించిన పుస్తకాన్ని ముస్లిం ప్రముఖులు ఆవిష్కరించారు. ముస్లిం పర్సనల్‌లా విషయంలో ఇతరుల జోక్యాన్ని అంగీకరించబోమని విలేకరుల సమావేశంలో ముస్లిం మహిళలు తెలిపారు. జమాతె ఇస్లామీ హింద్‌ నగర అధ్యక్షుడు ముస్తాఫా షరీఫ్, ఉద్యమ కన్వీనర్‌ అన్సార్‌ అహమ్మద్, ది యునైటెడ్‌ ముస్లిం వెల్ఫేర్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు మహమ్మద్‌ ఖాదర్‌ఖాన్, వివిధ మసీదుల అధ్యక్షులు, ముస్లిం ప్రముఖులు పాల్గొన్నారు.
మరిన్ని వార్తలు