షరియత్‌ రక్షణకు ముస్లింలు ఏకం కావాలి

13 Nov, 2016 23:35 IST|Sakshi
షరియత్‌ రక్షణకు ముస్లింలు ఏకం కావాలి

కడప కల్చరల్‌:

ఇస్లాం ధర్మాలను, నియమాలకు నిలయంగా ఉన్న షరియత్‌ను కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలు దెబ్బతీసేలా ఉన్నాయని, దీన్ని రక్షించుకునేందుకు ముస్లింలందరూ ఏకం కావాలని పలువురు ముస్లిం పెద్దలు పిలుపునిచ్చారు. ఆదివారం స్థానిక నేక్‌నామ్‌ఖాన్‌ కళాక్షేత్రంలో ముస్లిం మత గురువులు మగ్దూం మౌలాన అధ్యక్షతన  ఏర్పాటు చేసిన బహిరంగసభలో ముస్లిం మత గురువులు, ప్రముఖులు మాట్లాడారు. కడప  ఎమ్మెల్యే అంజద్‌బాషా మాట్లాడుతూ హిందూ, ముస్లింలు దేశంలో అన్నదమ్ముల్లా కలిసిమెలిసి జీవిస్తున్నారని, బీజేపీ ప్రభుత్వం ఈ ఐక్యతను దెబ్బతీసేందుకు కుట్ర పన్నుతోందని ఆరోపించారు. ప్రత్యేకించి ముస్లిం పర్సనల్‌లా విషయంలో జోక్యం కల్పించుకుని తమలో ఆందోళన కల్పించడం భావ్యం కాదన్నారు. ఇస్లాం చట్టాలు దైవం ప్రసాదించిన పవిత్ర ఖురాన్‌ ద్వారా ఏర్పడినవని, ముస్లింలు ఆరాధించే వీటిని మార్చాలనుకోవడం  చట్టవిరుద్ధమన్నారు. కొందరు అభాగ్యులైన ముస్లిం మహిళలపై బీజేపీ ప్రభుత్వం చూపుతున్న కపట ప్రేమ అందరికీ తెలిసిందేనని, ముఖ్యంగా మోదీ తన భార్య విషయంలో కూడా ఈ ప్రేమను నిరూపించుకోవాలని సవాల్‌ విసిరారు. ఇంకా పలువురు మత గురువులు, ముస్లిం ప్రముఖులు ముస్లిం పర్సనల్‌ లాలో జోక్యం కల్పించుకుంటే సహించేది లేదని హెచ్చరించారు. సభలో అహ్మద్‌పీర్‌ షహమీరి, అమీర్‌బాబు, వీణా అజయ్‌కుమార్, నజీరుల్లా సాహెబ్,  సుభాన్‌బాషా, నజీర్‌ అహ్మద్, మౌల్వి సయీద్, డాక్టర్‌ గౌస్‌పీర్, ఎస్‌ఏ సత్తార్, సయ్యద్‌ అహ్మద్‌ (బాబు), సలావుద్దీన్‌ తదిరతులు పాల్గొన్నారు.

 

మరిన్ని వార్తలు