చింతమనేనీ.. ఇదేం పని?

9 Jul, 2015 14:53 IST|Sakshi
చింతమనేనీ.. ఇదేం పని?

'ఎవరైనా ఎదురు తిరిగితే తొక్కించేస్తా.. తేడాలొస్తే నేనే తొక్కేస్తా... ఎవరైనా ఎదురుతిరిగితే ఇదేగతి' ఎవరో వీధిరౌడీ నోటి నుంచి వచ్చిన కూతలు కావు. గత అసెంబ్లీ ఎన్నికల్లో పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు టీడీపీ అభ్యర్థిగా చింతమనేని ప్రభాకర్ ఓటర్లను బెదిరించిన క్రమం ఇది. రౌడీ ముదిరి రాజకీయ నాయకుడు అవుతాడేనేది వర్తమాన సామెత. చింతమనేని లాంటి ఎమ్మెల్యేలు ఈ సామెతకు సజీవ సాక్ష్యంగా నిలుస్తున్నారు. 'దాదాగిరి'ని తన దారిగా మార్చుకున్న ఈ 'పచ్చ' నాయకుడు మహిళా అధికారిపై దౌర్జన్యంతో మరోసారి తన వార్తలకెక్కారు. రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి ప్రభుత్వ విప్ హోదా వెలగబెడుతున్నా పాత పనులు మానలేదు. ఆయనపై నమోదైన కేసులే ఇందుకు నిలువెత్తు రుజువు.

ఇసుక మాఫియాను అడ్డుకున్నారన్న అక్కసుతో కృష్ణా జిల్లా ముసునూరు తహసీల్దార్ వనజాక్షిపై చింతమనేని, ఆయన వందిమాగధులు విరుచుకుపడ్డారు. మహిళా అధికారి అని కూడా చూడకుండా ఇసుకలో ఈడ్చిపడేశారు. తనకెవరైనా ఎదురు చెబితే ఎవరికైనా ఇదే గతి పడుతుందన్న తరహాలో ఆయన చెలరేగిపోయారు. ఆత్మహత్య చేసుకోవాలనుకున్నానని 'పచ్చ'బాబుల గూండాగిరి గురైన మహిళా అధికారి వాపోయారంటే అధికార పార్టీ ఆగడాలు ఎంతగా మితిమీరిపోయాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మండల మేజిస్ట్రేట్ పైనే దౌర్జన్యం చేస్తే ఇక సామాన్యుల గతి ఏంటి?

తన నియోజకవర్గంలో యూపీ తరహా 'గుండారాజ్' నడిపిస్తున్న చింతమనేనికి దౌర్జన్యాలు కొత్తేంకాదు. గతేడాది స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా డబ్బులు పంచుతున్న తన చెంచాలను చెరసాలలో వేశారనే అక్కసుతో పెదవేగి ఎస్సైపై దాదాగిరి చెలాయించారు. సమైక్యాంధ్ర ఉద్యమ సమయంలో తన అనుచరులను ఉసిగొలిపి కావూరి సాంబశివరావు ఇంటికిపై దాడి చేయించారు. పోలీసుల ఆదేశాలను బేఖాతరు చేసి సంక్రాంతి సమయంలో కోడిపందాలు నిర్వహించడం చింతమనేనికి సరదా. తనకెదురు చెప్పినవారిపై రౌడీయిజం చేయడం ఆయనకు అలవాటైన విద్య.

'రౌడీయిజాన్ని ఉక్కుపాదంతో అణచివేస్తా'నని సందు దొరికినప్పుడల్లా ఊదరగొట్టే సీఎం చంద్రబాబు సొంత పార్టీ ఎమ్మెల్యే విషయంలో మాత్రం మౌనముద్ర దాలుస్తారు. రాష్ట్రవ్యాప్తంగా తెలుగు తమ్ముళ్లు తెగబడుతున్నా ఇప్పటివరకు ఒక్కరిపైనా చర్య తీసుకున్న పాపాన పోలేదు. ఆశ్రిత పక్షపాతానికి అతీతుడునని ప్రచారం చేసుకునే సైకిల్ పార్టీ అధినేత టీడీపీ నాయకులు, కార్యకర్తల ఆగడాలపై మాత్రం అస్సలు స్పందించరు. ఏమన్నా అంటే ఎదురుదాడి చేస్తారు. తెలుగు తమ్ముళ్ల దౌర్జన్యాల నుంచి ప్రజలను కాపాడేదెవరో?

Read latest District News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా