మా పిల్లల్ని సర్కార్ బడికే పంపుతాం

31 May, 2016 02:21 IST|Sakshi
మా పిల్లల్ని సర్కార్ బడికే పంపుతాం

గుర్రాలగొంది గ్రామస్తుల తీర్మానం

 చిన్నకోడూరు: పాఠశాలల్లో విద్యార్థుల ప్రవేశాలకు సీజన్ ప్రారంభమైంది. ప్రైవేటు విద్యాసంస్థలకు దీటుగా ప్రభుత్వ విద్యాసంస్థలు కూడా తమ ప్రచారం చేస్తున్నాయి. గుర్రాలగొందిలో సోమవారం గ్రామస్తులు సమావేశం ఏర్పాటు చేసి తమ పిల్లలను ప్రైవేటు బడులకు పంపేది లేదని, ప్రభుత్వ పాఠశాలలకే పంపుతామని తీర్మానించారు. ప్రాథమికోన్నత పాఠశాలలో ఇంగ్లిష్ మీడియం బోధిస్తే తమ పిల్లలను ప్రైవేటు బడులకు పంపబోమని తీర్మానిస్తూ వినతి పత్రాన్ని ఎంఈఓ గోపాల్‌రెడ్డికి అందజేశారు.  ఈ సందర్భంగా ఎంఈఓ మాట్లాడుతూ ప్రైవేటు పాఠశాలల్లో కనీస వసతులు ఉండవని, నాణ్యమైన విద్య అందదన్నారు.

ప్రైవేటు మోజులో పడితే డబ్బులు వృథా అవుతాయన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య, మౌలిక వసతులు, మధ్యాహ్న భోజనం, ఉచిత పాఠ్యపుస్తకాలు, దుస్తులు అందజేస్తారన్నారు. నైపుణ్యం కలిగిని ఉపాధ్యాయులు పాఠాలు బోధిస్తారన్నారు. ఎవరూ తమ పిల్లలను ప్రైవేటు పాఠశాలలకు పంపవద్దని సూచించారు. గ్రామంలో ఇంగ్లీష్ మీడియం ఏర్పాటుకు ప్రతిపాదనలు అందజేస్తామన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ ఆంజనేయులు, ఎంపీటీసీ మల్లేశం, విద్యాకమిటీ చైర్మన్‌తో పాటు విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.

డబ్బులు చెల్లించడం కష్టంగా మారింది...
కరువు పరిస్థితుల్లో కుటుంబ పోషణ భారంగా ఉన్న సమయంలో తమ పిల్లలను ప్రైవేట్ స్కూల్‌కు పంపించడం కష్టంగా మారింది. స్కూల్‌లలో వేలకు వేలు ఫీజులు వసూలు చేస్తున్నారు. చదువు మాత్రం అంతంత మాత్రంగానే ఉంది. తమ గ్రామంలోనే ప్రభుత్వ పాఠశాలలో అన్ని వసతులు ఉన్నందున ఇక్కడే చదివించాలనుకుంటున్నాం. - బోయిని మధు, విద్యార్ధి తండ్రి

వత్తిడి ఎక్కువ అవుతోంది...
తమ పిల్లలు సిద్దిపేటలోని ప్రైవేట్ పాఠశాలకు ఉదయం వెళితే తిరిగి ఇంటికి చేరుకునే సరికి రాత్రి పడుతుంది. దీంతో ఇంటి వద్ద చదువుకోవడానికి సమయం దొరకడం లేదు. అలాగే పిల్లలు రోజంతా స్కూల్‌లోనే గడుపడం ద్వారా వత్తిడికి గురవుతున్నారు. ప్రయాణాల్లో సైతం ప్రమాదాలు జరిగే అవకాశముంది. -ఎస్. రమేష్, విద్యార్ధి తండ్రి

మరిన్ని వార్తలు