-

అనుమానంతో అంతమొందించాడు!

29 Jun, 2017 21:43 IST|Sakshi
అనుమానంతో అంతమొందించాడు!
- మహిళను చంపేసి మృతదేహాన్ని తగులబెట్టిన వైనం
- కేసు మిస్టరీని ఛేదించిన పోలీసులు
- నలుగురి నిందితుల అరెస్ట్‌
- మరొకరి కోసం గాలిపు
   
నందికొట్కూరు: ఓ మహిళ అదృశ్యం కేసు మిస్టరీ వీడింది. ఆమెతో వివాహేతర సంబంధం నడుపుతున్న వ్యక్తే ఆమెను దారుణంగా చంపేశాడు. కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు 39 రోజుల్లో మిస్టరీ ఛేదించి నిందితులను అరెస్ట్‌ చేశారు. నిందితులను డీఎస్పీ సుప్రజ ఎదుట హాజరు పరిచారు. నందికొట్కూరు సీఐ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో కేసు వివరాలను ఆమె వివరించారు. మల్యాల గ్రామానికి చెందిన వడ్డే పద్మావతి భర్త ఎనిమిది సంవత్సరాల క్రితం మృతి చెందాడు. ఆమెకు ఇద్దరు కుమారులు. పద్మావతికి, అదే గ్రామానికి చెందిన వడ్డె దండుగుల శ్రీనివాసులుతో పరిచయం ఏర్పడి వివాహేతర సంబంధానికి దారి తీసింది. కొన్నాళ్ల తర్వాత ఆమె..  శ్రీనివాసులుగా దూరంగా ఉండటంతో అతనికి అనుమానం వచ్చింది. మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుందనే అనుమానంతో  కడతేర్చాలని కుట్ర పన్నాడు.
 
ఈ మేరకు నందికొట్కూరు పట్టణానికి చెందిన కొంగర నాగశేషులు, మల్యాలకు చెందిన దండుగుల బాల నాగన్న, జూపాడుబంగ్లా మండలం తంగెడంచకు చెందిన తెప్పలి రవీంద్రకుమార్, అనంతపురం జిల్లాకు చెందిన రిటైర్డు డీఎస్పీ కుమారుడు ఓ పత్రికా విలేకరి ఫణియాదవ్‌ సహాయం తీసుకున్నాడు. మే 8వ తేదీన పద్మావతిని వెలుగోడు కస్తూర్బా పాఠశాల సమీపంలోని అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి హత్య చేసి మృతదేహాన్ని తగుల బెట్టారు. అదే నెల 20వ తేదీన పద్మావతి కనిపించడం లేదని ఆమె కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు అనుమానంతో శ్రీనివాసులును అదుపులోకి తీసుకుని విచారించగా కేసు మిస్టరీ వీడింది.
 
నాలుగు రోజుల క్రితం సంఘటన స్థలంలో మహిళ పుర్రె, ఎముకలను స్వాధీనం చేసుకున్నారు. హత్యలో పాల్గొన్న నలుగురి నిందితులను గురువారం అరెస్ట్‌ చేసినట్లు డీఎస్పీ తెలిపారు. హత్యకు సహకరించిన ఫణియాదవ్‌ను అరెస్ట్‌ చేసేందుకు ప్రత్యేక టీం గాలిస్తున్నట్లు చెప్పారు. జూపాడుబంగ్లా మండలం మండ్లెం గ్రామంలో ఇటీవల అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఎలిషా కేసును కూడా త్వరలో చేధిస్తామని పేర్కొన్నారు. సమావేశంలో సీఐ రామకృష్ణ, ఎస్‌ఐలు లక్ష్మీనారాయణ, సుబ్రహ్మణ్యం, అశోక్ పాల్గొన్నారు.  
 
మరిన్ని వార్తలు