ఊరు ఖాళీ!

21 May, 2016 09:37 IST|Sakshi
ఊరు ఖాళీ!

నాగిరెడ్డిపేట: కరువు ప్రభావంతో చెరువులు, పంట పొలాలే కాదు.. ఊళ్లు కూడా ఖాళీగా దర్శనమిస్తున్నాయి. వర్షాభావం, అడుగంటిన భూ గర్భ జలాలు, ఎండిన ప్రాజెక్టులు.. వెరసి సాగునే నమ్ముకున్న పల్లెలు వలస పోతున్నాయి. పని కోసం పట్నానికి తరలి వెళ్తున్నాయి. రెండేళ్లుగా వానల్లేక రైతు బతుకు బరువైంది. ఇన్నేళ్లు ఆధారంగా ఉన్న సాగు భారమైంది. ఉపాధి ‘కరువైం ది’. దీంతో పని కోసం వలస పోవడం తప్పనిసరైంది. మూట ముల్లె సర్దుకొని భార్య, పిల్లలతో పట్నం బాట పట్టారు నాగిరెడ్డిపేట గ్రామస్తు లు. తీవ్ర కరువు నేపథ్యంలో ఊరు దాదాపు ఖా ళీ అయింది. ఏ వీధికెళ్లినా కొన్నిళ్లకు తాళాలు కనిపిస్తుంటే, వృద్ధులు కాపలాగా ఉన్న ఇళ్లు కొ న్ని దర్శనిస్తున్నాయి.

నాగిరెడ్డిపేట గ్రామంలో సుమారు 1,100 కుటుంబాలుండగా, సగం కుటుంబాలు వలస వెళ్లాయి. కాలువ, చెరువుల కింద వ్యవసాయ భూములున్నప్పటికీ కరువు కారణంగా చెరువులు, కుంటల్లోకి నీరు రాలేదు. వేసిన పంటలు ఎండిపోయాయి. పంటల సాగుకు వెచ్చించిన పెట్టుబడుల కోసం చేసిన అప్పులు తీర్చే మార్గం లేక తప్పనిసరై పొట్టచేత బట్టుకొని హైద్రాబాద్, ఆర్మూర్ ప్రాంతాలకు వలస వెళ్లారు. కొంతమంది ఇళ్లకు తాళాలు వేసి వలస వెళ్లగా.. మరికొందరు వృద్ధాప్యంలో ఉన్న తల్ల్లిదండ్రులను ఇంటికి కాపలాగా ఉంచి వెళ్లారు. చిన్నపిల్లలను, వృద్ధులను ఇంటి వద్దనే ఉంచి భార్య, భర్త మాత్రమే వెళ్లిన వారున్నారు. అయితే, హైదరాబాద్‌లో వలసవాదుల తాకిడి ఎక్కువ కావడం, సరైన పని దొరకక పోవడంతో కొంత మంది తిరిగి వస్తున్నారు. వారంలో 3-4 రోజులకు మించి పని దోరకడం లేదని, దొరికిన పనితో వచ్చిన రుక్కం పట్నంలో ఖర్చులకు సరిపోక తిరిగి వచ్చేశామని వలస వెళ్లొచ్చిన వారు చెబుతున్నారు.
 
ఈ చిత్రంలో కనిపిస్తున్న ఇల్లు నాగిరెడ్డిపేటకు చెందిన మ్యాకల సాయిలుది. ఆయన కుటుంబం రెండేళ్ల క్రితం వలస వెళ్లడంతో ఊడ్చేవారు సైతం లేక ఇల్లు, వాకిలి చిన్నబోయింది. సాయిలుకు ఉన్న కొద్దిపాటి భూమి కరువు కారణంగా రెండేళ్లుగా పడావుగా మారింది. తప్పనిసరి పరిస్థితుల్లో సుమారు ఇల్లు, జాగా వదిలి భార్య, కొడుకు, కూతురుతో కలిసి హైదరాబాద్‌కు వలస వెళ్లాడు. కుటుంబ సభ్యులందరూ అక్కడే పని చేసుకుంటూ బతుకుతున్నారు. పండగలకు ఇంటికి వచ్చి వెళ్తున్నారు.
 
 
ఈ వృద్ధురాలి పేరు ఎరుపుల అనసూయ. గ్రామం నాగిరెడ్డిపేట. ఈమెకు కొడుకు గోపాల్, కోడలు మమత, కూతురు నిర్మల ఉన్నారు. వీరికి కొద్దిపాటి భూమి కూడా ఉంది. కానీ రెండేళ్లుగా వర్షాలు కురవక సాగు చేయలేదు. దీంతో అనసూయ కొడుకు, కోడలు, కూతురు ఆర్నెళ్ల కిత్రం హైదరాబాద్‌కు వలస వెళ్లారు. అక్కడి ప్రైవేట్ కంపెనీలో పని చేస్తూ కాలం వెళ్లదీస్తున్నారు. ఇంటి వద్ద ఉన్న అనసూయకు వితంతు పింఛన్ రావడం లేదు. వలస వెళ్లిన కొడుకు, కోడలు, కూతురు అప్పుడప్పుడూ పంపుతున్న డబ్బులతోనే నెట్టుకొస్తుంది.
 
పని దొరకక వచ్చేశాం..
కుటుంబ సభ్యులంద రం కలిసి సుమారు మూడేళ్ల క్రితం షాపూర్‌కు వలస వెళ్లాం. కొ న్నిరోజులుగా హైద్రాబాద్‌కు చాలా మంది బతకడానికి రావడంతో మాకు పని దొరకడం కష్టమయింది. వారంలో మూడు రోజులే పని దొరుకుతుంది. దీంతో చేసేదేమి లేక ఇంటికి వచ్చేశాం. ఇక్కడే ఏదో ఒక పని చేసుకొని బతుకుదామనుకుంటున్నాం.
 - రుక్కవ్వ, నాగిరెడ్డిపేట
 
మస్తు తిప్పలైతుంది
ఊర్లే సరైన పనిలేక, పంటలు పండక మేమందరం ఏడాది కింద పట్నంకు వలస పోయినం. అక్కడ వారానికి 4 రోజులకు మించి పని దొరకడం లేదు. మేస్త్రీ చేతి కింద పనికి వెళితే రోజుకు రూ.200-250ఇస్తున్నారు. పట్నంలో బతకడానికి ఆ డబ్బులు సరిపోక ఇంటికి చేరుకున్నాం.
  - చంద్రకళ, నాగిరెడ్డిపేట
 
అయ్య, అవ్వలను సూడనికొచ్చిన...
కాలం కాకపోవడంతో పాటు ఊర్లే పని దొరకక తప్పనిసరై పట్నం పోయినం. ఇంటికాడ అయ్య, అవ్వను కాపాలాగా ఉంచి నా భార్య, పిల్లలతో రెండేళ్ల కింద హైద్రాబాద్ వెళ్లా. నెలకోమారు ఇంటి కి వచ్చి మా అయ్య, అవ్వను సూశిపోతున్నా. పట్నంల ఎంత పనిచేసినా పైస మిగుల్తలేదు. కానీ పని కోసం తప్పనిసరై పట్నం బాట వట్టినం.    
- తెనుగు రమేశ్, నాగిరెడ్డిపేట

మరిన్ని వార్తలు