నగదు బదిలీ విధానంతో ఉపాధికి గండం

28 Apr, 2017 00:52 IST|Sakshi
నగదు బదిలీ విధానంతో ఉపాధికి గండం
ఏలూరు (ఆర్‌ఆర్‌ పేట) : కేంద్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టనున్న రేషన్‌ సరుకులకు నగదు బదిలీ విధానం వల్ల కొన్ని వేల కుటుంబాలు ఉపాధి కోల్పోయే ప్రమాదముందని జాతీయ ఉత్పత్తి పంపిణీ పథకం నిర్వహణదారుల సంక్షేమ సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దివి లీలా మాధవరావు ఆందోళన వ్యక్తం చేశారు. గురువారం స్థానిక ఐఏడీపీ హాలులో జరిగిన డీలర్ల రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ విధానం అమలు జరిగితే రాష్ట్రంలోని 29 వేల మంది డీలర్ల కుటుంబాలకు, వారి దగ్గర పనిచేస్తున్న 29 వేల సహాయకుల కుటుంబాలు, రాష్ట్రంలోని 266 బియ్యం గోడౌన్లల్లో పనిచేస్తున్న 4 వేల మంది హామాలీల కుటుంబాలకు, 5 వేల మంది కిరోసిన్‌ హాకర్ల కుటుంబాలు ఉపాధి కోల్పోయి రోడ్డున పడాల్సి వస్తుందని పేర్కొన్నారు. ఆహార భద్రతా చట్టం ప్రకారం డీలర్లకు ఎటువంటి ఖర్చు లేకుండా రేషన్‌ సరుకులను తమ షాపులకు దిగుమతయ్యేలా చర్యలు తీసుకోవాలని రేషన్‌ దుకాణం నిర్వహణ వ్యయం భారీగా పెరిగినందున వాటి నిర్వహణ ఖర్చు పోను గ్రామీణ ప్రాంతాల్లో రూ.15 వేలు, పట్టణ ప్రాంతాల్లో రూ.20 వేలు ఆదాయం వచ్చేలా తగిన ఏర్పాట్లు చేయాలని కోరారు. పంచదార, కిరోసిన్‌లను కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించడంతో డీలర్లు కేవలం బియ్యం మాత్రమే పంపిణీ చేయాల్సి వస్తుందని, దీనివల్ల వారికి వచ్చే కమిషన్లు కూడా నామమాత్రంగా ఉంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమావేశానికి రేషన్‌ డీలర్ల అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు రాజులపాటి గంగాధరరావు అధ్యక్షత వహించగా రాష్ట్ర అధ్యక్షుడు డి.వెంకటేశ్వరరావు, కోశాధికారి పి.చిట్టిరాజు, నాయకులు పి.వెంకటరావిురెడ్డి, వాసిరెడ్డి వెంకట నరసింహరావులతో పాటు వివిధ జిల్లాలకు చెందిన సుమారు 1500 మంది డీలర్లు పాల్గొన్నారు.   
 
 
మరిన్ని వార్తలు