నగేష్‌చౌదరిపై రౌడీషీట్‌

1 Nov, 2016 00:35 IST|Sakshi

రాప్తాడు : యువకుడిపై ఆటవికంగా దాడిచేసి గాయపరిచిన నగేష్‌చౌదరిపై రౌడీషీట్‌ తెరుస్తామని అనంతపురం డీఎస్పీ మల్లికార్జునవర్మ తెలిపారు. ఆదివారం ఆయన రాప్తాడు పోలీసుస్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం ఈ నెల 28న రాప్తాడులోని పండమేరు వంక రైల్వే బ్రిడ్జి సమీపంలో యల్లనూరు మండల కేంద్రానికి చెందిన చిన్న ఓబులేసుపై జరిగిన దాడి గురించి ఆరా తీశారు. దాడి జరిగిన సమయంలో అక్కడే ఉన్న కొంత మందిని పిలిపించి విచారణ చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. పండమేరు వంకలో చిన్న ఓబులేసుపై దాడి జరిగిన మాట వాస్తమేనన్నారు. దాడి జరుగుతుందని స్థానికులు పోలీస్‌ స్టేషన్‌కు సమాచారం ఇవ్వగానే ఎస్‌ఐ ధరణిబాబు సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకుని బాధితుడికి తాగునీరు అందించి.. 108 ద్వారా అనంతపురం ఆస్పత్రికి తరలించారన్నారు. దాడి చేసిన నగేష్‌ చౌదరికి ఘటన స్థలంలోనే ఎస్‌ఐ ప్రత్యేక కౌన్సిలింగ్‌ ఇచ్చి స్టేషన్‌కు తరలించారన్నారు.

ఆ రోజే నగేష్‌ చౌదరిపై సెక్షన్‌ 324, 341 కింద కేసు నమోదు చేశారన్నారు. నిందితునికి ఎలాంటి రాచమార్యదలూ చేయడం లేదన్నారు. ప్రతి రోజు కౌన్సిలింగ్‌ ఇస్తున్నామన్నారు. గ్రామాల్లో అ సాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతూ, శాంతి భద్రతలను విఘాతం కల్పించే అలాంటి వారిని సహించేది లేదన్నారు. ఎవరైనా రౌడీయిజం చేస్తే తోకలు కత్తిరిస్తామన్నారు. మట్కా, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడేవారిపై నిరంతర నిఘా ఉంచామన్నారు. ఒకసారి దొరికి అనంతరం వారిలో మార్పు రాకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరిచ్చారు. చట్టపరమైన కేసులు నమోదు చేసి రౌడీషీట్‌లు తెరుస్తామన్నారు. 

 

 

>
మరిన్ని వార్తలు