నయనానందకరం.. శ్రీ చక్రవార్యుత్సవం

12 May, 2017 00:19 IST|Sakshi
నయనానందకరం.. శ్రీ చక్రవార్యుత్సవం
దేవరపల్లి :  ద్వారకా తిరుమల శ్రీ వారి వైశాఖమాస దివ్య బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని గురువారం శ్రీ చక్ర వార్యుత్సవాన్ని ఆలయ అర్చకులు కన్నుల పండువగా నిర్వహించారు. తొలుత తొళక్కం వాహనంపై విష్ణుమూర్తి అలంకరణలో శ్రీవారి తిరువీధి సేవ క్షేత్ర పురవీధుల్లో వైభవంగా జరిగింది. తొళక్కం వాహనంపై ఉభయ దేవేరులతో స్వామిని నిలిపి ప్రత్యేక పుష్పాలంకరణలు చేశారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, వేద మంత్రోచ్చారణల మధ్య క్షేత్ర పురవీధుల్లో శ్రీ వారు ఊరేగారు. ఆలయ ఆవరణలో శ్రీ చక్ర వార్యుత్సవాన్ని ఆలయ అర్చకులు వేద మంత్రోచ్ఛారణలతో ఘనంగా జరిపారు.
శ్రీచక్రవార్యుత్సవం ఇలా.. 
ఆలయ ఆవరణలో శ్రీవారు, అమ్మవార్లు, చక్ర పెరుమాళ్లను ఒకే వేదికపై కొలువయ్యారు. పూజలు జరిపి సుగంథ ద్రవ్యాలు, పంచ పల్లవులు, శ్రీ చందనం, పసుపు, మంత్ర పూత అభిషేక తీర్థంతో శ్రీ చక్ర స్వామిని అభిషేకించారు.    పాలు, పెరుగు, నీరు, తేనె, కొబ్బరి నీళ్లతో ఆలయ అర్చకులు శ్రీచక్రస్వామి అభిషేకాన్ని ఘనంగా నిర్వహించారు. అనంతరం శ్రీచక్ర పెరుమాళ్లతో పాటు ఉభయనాంచారులతో శ్రీవారికి తిరుమంజనాలు జరిపి, అలంకరించి హారతులను సమర్పించారు. అభిషేక జలాన్ని భక్తులు తమ శిరస్సులపై చల్లుకున్నారు.  రాత్రి అశ్వవాహనంపై శ్రీవారి తిరువీధిసేవ భక్తులకు నేత్ర పర్వమైంది. ఆలయ ఈఓ వేండ్ర త్రినాథరావు ఏర్పాట్లను పర్యవేక్షించారు. 
బ్రహ్మోత్సవాల్లో నేడు.. 
l ఉదయం 9 గంటల నుంచి – అన్నమాచార్య కీర్తనల ఆలాపన
l ఉదయం 9 గంటల నుంచి – చూర్ణోత్సవం, వసంతోత్సవం 
l ఉదయం 10 గంటల నుంచి – హరికథ
l సాయంత్రం 6.30 గంటల నుంచి – భక్తిరంజని  
l రాత్రి 7 గంటల నుంచి – ద్వాదశ కోవెల 
ప్రదక్షిణలు, శ్రీ పుష్ప యాగం  
నవనీత కృష్ణుడిగా చినవెంకన్న 
ద్వారకా తిరుమల క్షేత్ర వాసి చిన వెంకన్న గురువారం నవనీత కృష్ణుడిగా భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయంలో జరుగుతున్న శ్రీ వారి వైశాఖ మాస తిరు కల్యాణ మహోత్సవాలను పురస్కరించుకుని స్వామి వారు రోజుకో ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పిస్తున్నారు. వెన్నను దొంగిలించే నవనీత కృష్ణుడిగా చిన వెంకన్న దర్శనమివ్వడం భక్తులకు నేత్రపర్వమైంది. అధిక సంఖ్యలో భక్తులు శ్రీవారిని దర్శించి తరించారు. 
 
 
మరిన్ని వార్తలు