నైపుణ్యాభివృద్ధి శిక్షణతో ఆర్థికాభివృద్ధి

19 Mar, 2017 00:27 IST|Sakshi
అత్తిలి : యువత, మహిళలు నైపుణ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమాలను సద్వినియోగం చేసుకుని ఆర్థికాభివృద్ధి సాధించాలని రిటైర్డ్‌ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ (ఐఏఎస్‌), ఉదయం ట్రస్టు చైర్మన్‌  ఓగిరాల చాయారతన్‌ అన్నారు. కొమ్మరలో నెలకొల్పిన ఓగిరాల వెంకటాచలం విజ్ఞాన కేంద్రంలో వృత్తి శిక్షణ పూర్తిచేసుకున్న మహిళలకు సర్టిఫికెట్ల పంపిణీ కార్యక్రమం గ్రామ సర్పంచ్‌ మంతెన బంగారమ్మ అధ్యక్షతన శనివారం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న చాయారతన్‌ మాట్లాడుతూ తాను పుట్టిన ఈ గ్రామాన్ని దత్తత తీసుకున్నానని, స్మార్ట్‌ విలేజ్‌గా తీర్చిదిద్దడానికి అవసరమైన వనరులను సమకూరుస్తున్నట్టు చెప్పారు. ఉదయం ట్రస్టు ద్వారా గ్రామంలో మహిళలకు కుట్లు, అల్లికలు, టైలరింగ్‌ తదితర అంశాలలో శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. విజ్ఞాన కేంద్రంలో డిగ్రీ, ఇంజినీరింగ్‌ చేసిన విద్యార్థులకు పోటీ పరీక్షలకు సంబంధించి శిక్షణను చెన్నై నుంచి ఐఐటీ విద్యార్థులచే వీడియో కాన్ఫరెన్స్‌  ద్వారా నిర్వహిస్తున్నట్టు చెప్పారు. గ్రామ సర్పంచ్‌ మంతెన బంగారమ్మ, గోపాలకృష్ణంరాజు దంపతులను, ఉపాధ్యాయులను ఆమె సన్మానించారు. ఎంపీడీవో ఆర్‌.విజయరాజు, సదరన్స్‌  రైల్వే చీఫ్‌ ఇంజినీర్‌ రాజశేఖర్, డీఆర్‌డీఏ పీడీ శ్రీనివాస్, తహసీల్దార్‌ జి.కనకరాజు పాల్గొన్నారు. 
 
 
 
మరిన్ని వార్తలు