నయా ఎల్జీ నజీబ్ జంగ్... అన్ని రంగాల్లో సమర్థుడు

10 Apr, 2017 11:41 IST|Sakshi

 సాక్షి, న్యూఢిల్లీ: విద్యార్థులందరికీ స్నేహితుడు.. క్రమశిక్షణ విషయంలో సైనికులకు సాటి. అద్భుత రంగస్థల నటుడు. రచయిత. వ్యూహకర్త. జామియా మిలియా ఇస్లామియా వైస్‌చాన్స్‌లర్ నజీబ్‌జంగ్ గురించి విద్యార్థులు చెప్పే మాటలివి. ఆయన ఢిల్లీ కొత్త లెఫ్టినెంట్ గవర్నర్‌గా సోమవారం నియమితులైన సంగతి తెలిసిందే. యూనివర్సిటీలోని క్యాస్ట్రో కఫేలో ఈ ఐఏఎస్ విద్యార్థులతో కాఫీ తాగుతారు. అవసరమైతే చదువులో వారికి సాయపడతారు.
 
  ఆయన సహజసిద్ధ నాయకుడని జంగ్ స్నేహితులు అంటారు. నజీబ్ జంగ్ మధ్యప్రదేశ్ కేడర్‌కు చెందిన మాజీ ఐఏఎస్ అధికారి అయినప్పటికీ ఆయన స్వస్థలం ఢిల్లీయే. జంగ్ కుటుంబం 1842 నుంచి ఢిల్లీలోనే ఉంటోంది. ఆయన ఢిల్లీ విశ్వవిద్యాలయం నుంచే పట్టా పుచ్చుకున్నారు. తన సొంత నగరానికి సేవచేసే అవకాశం లభించడం గౌరవంగా భావిస్తున్నానని జంగ్ చెప్పారు. 1951లో జన్మించిన  జంగ్ సెయింట్ స్టీఫెన్స్ కాలేజీలో, ఆతరువాత లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో చదువుకున్నారు. మధ్యప్రదేశ్, కేంద్ర ప్రభుత్వంలోనూ అనేక పదవులు నిర్వర్తించారు. ఏషియన్ డెవలప్‌మెంట్ బ్యాంకు సీనియర్ సలహాదారుడిగానూ విధులు నిర్వర్తించారు.
 
  2009లో జామియా మిలియా ఇస్లామియా వైస్‌చాన్స్‌లర్‌గా బాధ్యతలు చేపట్టారు. ఆయన హయాంలో జామియాకు సెంట్రల్ యూనివర్సిటీ హోదా లభించింది. ఈ హోదా లభించిన మొట్టమొదటి మైనారిటీ యూనివర్సిటీ ఇదే కావడం విశేషం. ఎన్నోకొత్త కోర్సులు, విద్యాకేంద్రాలు ప్రవేశపెట్టేందుకు ఆయన కృషి చేశారు. అంతేకాదు ముస్లిమ్‌లకు ఆధునిక విద్య అందాలని గట్టిగా కోరుకుంటారు. సంప్రదాయ విద్య నేర్పే దారుల్ ఉలూమ్ వంటి విద్యాసంస్థలు ఆధునికతను సంతరించుకోవడంలో విఫలమయ్యాయని విమర్శిస్తారు.
 
 ఎన్నికల ఎత్తుగడేనా ?..
 విధానసభ ఎన్నికలు మరికొద్దినెలలు ఉన్నాయనగా తేజిందర్ ఖన్నా స్థానంలో నజీబ్‌జంగ్‌ను నియమించడం ఎన్నికల ఎత్తుగడేనని కొందరు రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. ఎల్జీగా జంగ్‌ను నియమించడం  వల్ల ముస్లిం ఓట్లు కాంగ్రెస్ ఖాతాలోకి చేరడానికి మార్గం సుగమమైందని అంటున్నారు. నగరంలో దాదాపు డజను సీట్లలో ముస్లిం ఓటర్లు ప్రభావం చూపుతారు. తేజిందర్ ఖన్నాతో పోలిస్తే నజీబ్‌జంగ్ , షీలాదీక్షిత్ మధ్య సత్సంబంధాలు ఎక్కువ. అందువల్ల పాలనా వ్యవహారాలలో సమన్వయం బాగుంటుందని భావిస్తున్నారు.
 

మరిన్ని వార్తలు