ప్రతి వాకిలీ ఓ కేన్వాస్‌..ప్రతి గృహిణీ ఓ చిత్రకారిణి..

7 Sep, 2016 23:57 IST|Sakshi
ప్రతి వాకిలీ ఓ కేన్వాస్‌..ప్రతి గృహిణీ ఓ చిత్రకారిణి..
నఖచిత్ర ప్రదర్శనలో సామవేదం
రవి పరసకు ప్రముఖుల అభినందనలు
రాజమహేంద్రవరం కల్చరల్‌ : ‘తెల్లవారితే భారతీయ గృహిణి తనింటి ప్రాంగణాన్ని కేన్వాస్‌గా చేసుకుని,అపురూపమైన ముగ్గులను తీర్చి దిద్దుతుంది. ఈ దేశంలో ప్రతి ఒక్కరికీ కళాహృదయం ఉంది’ అని సమన్వయ సరస్వతి సామవేదం షణ్ముఖశర్మ అన్నారు. బుధవారం నఖచిత్రకళాతపస్వి రవి పరస రూపొందించిన 999 నఖచిత్రాల ప్రదర్శన రివర్‌బే హోటల్‌ ఆహ్వానం సమావేశమందిరంలో జరిగింది. ముఖ్య అతిథిగా సామవేదం మాట్లాడుతూ యుగయుగాలుగా దివ్యత్వంతో ముడిపడిన కళలే కాలానికి ఎదురొడ్డి నిలిచాయన్నారు. భారతీయ సంగీతం, నాట్యం, చిత్రలేఖనం అన్నీ దైవత్వంతో ముడిపడినవేనన్నారు. తీసిపారేసే గోటితో కలకాలం నిలిచిపోయే చిత్రాలను సృష్టించిన రవి పరస అభినందనీయుడన్నారు. కళలు, సైన్సు, తత్త్వశాస్త్రం.. ఈ మూడూ కలిస్తేనే భారతీయ సంస్కృతి అని వివరించారు. నన్నయ విశ్వవిద్యాలయం ఉపకులపతి ఎం.ముత్యాలునాయుడు మాట్లాడుతూ రవి పరస అంతర్జాతీయ ఖ్యాతిని గడించాలని ఆకాంక్షించారు. డాక్టర్‌ కర్రి రామారెడ్డి, డాక్టర్‌ అరిపిరాల నారాయణరావు తదితరులు రవి పరస కృషిని అభినందించారు. స్వాగతవచనాలు పలికిన వి.ఎస్‌.ఎస్‌.కృష్ణకుమార్‌ మాట్లాడుతూ  నన్నయ విశ్వ విద్యాలయంలో ఫైన్‌ ఆర్ట్స్‌ విభాగాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. రవి పరస మాట్లాడుతూ నఖచిత్రకళ అతిప్రాచీనమైనదని, ఈ కళ అంతరించిపోకూడదని అన్నారు. తాను నఖచిత్రాలను చివరి వరకూ గీస్తూనే ఉంటానని ప్రకటించారు. ముఖ్య అతిథులు రవి పరసను సత్కరించారు.
మరిన్ని వార్తలు