కబ్జానుంచి.. నాలా విడుదల!

21 Apr, 2016 02:18 IST|Sakshi
కబ్జానుంచి.. నాలా విడుదల!

శాశ్వత నిర్మాణాలతో మూసేసిన
వ్యాపారులు 15 ఏళ్ల తర్వాత
తెరుచుకున్న మోరీలు
పోలీస్ పహారాలో ఆక్రమణల తొలగింపు

 పట్టణంలోని నాలాను ఆక్రమిస్తూ వ్యాపారులు నిర్మించిన కట్టడాలను బుధవారం పోలీసు బందోబస్తు నడుమ కూల్చివేశారు మున్సిపల్ అధికారులు. ఓపెన్ డ్రైనేజీల్లో పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని తొలగించేందుకు ఆరు నెలల క్రితం మున్సిపల్ కౌన్సిల్‌లో ఏకగ్రీవ తీర్మానం చేసి.. దీనికి అవసరమైన రూ.5 లక్షలు మంజూరు చేశారు. కానీ టెండర్‌ను దక్కించుకున్న కాంట్రాక్టర్ ఆరు నెలలైనా పనులు ప్రారంభించకపోవడంతో స్వయంగా రంగంలోకి దిగారు. ఈ సందర్భంగా పలువురు వ్యాపారులు పనులకు అడ్డు తగలడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. నాలాలను ఆక్రమించి మళ్లీ నిర్మాణాలు చేపడితే చర్యలు తప్పవని కమిషనర్ ఎంకేఐ అలీ హెచ్చరించారు.
  - వికారాబాద్

పట్టణంలోని నాలాలో పదిహేనేళ్లుగా పేరుకుపోయిన మురుగు, చెత్తాచెదారం తొలగింపునకు ఎట్టకేలకు బీజం పడింది. నాలాను కబ్జా చేసిన వ్యాపారులు దీనిపై శాశ్వత నిర్మాణాలు చేపట్టడంతో.. డ్రైనేజీని శుభ్రం చేసేందుకు వీలు లేకుండా పోయింది. ఈ సమస్యను పరిష్కరించేందుకు ఆరు నెలల క్రితం కౌన్సిల్ సభ్యులు ఏకగ్రీవ తీర్మానం చేశారు. నిధులు విడుదల చేసినా.. కాంట్రాక్టర్ పనులు ప్రారంభించకపోవడంతో మున్సిపల్ అధికారులు నడుంబిగించారు. వర్షాకాలం వస్తే మురుగు నీరు మొత్తం రోడ్లపై చేరుతుందనే ఉద్దేశంతో స్వయంగా పనులు ప్రారంభించారు.

 వారం రోజుల్లో పూర్తి చేస్తాం...
బీజేఆర్ చౌరాస్తా నుంచి ఆలంపల్లి వరకు రెండు వైపులా ఓపెన్ డ్రైనేజీగా మార్చనున్నట్లు కమిషనర్ అలీ తెలిపారు. వారం రోజుల్లో పనులు పూర్తి చేస్తామని చెప్పారు. వ్యాపార సముదాయాల ముందు నిర్మాణాలు చేసుకోవాలనుకునే వారు సొంత స్థలాన్ని వాడుకోవాలని సూచించారు. పార్కింగ్ కోసం స్థలాన్ని వదలాలని తెలిపారు. మళ్లీ ఎవరైనా నాలాపై నిర్మాణాలు చేపడితే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఓపెన్ నాలాను మూసేసే ప్రయత్నం చేయొద్దని తెలిపారు. నాలాకు 5 ఫీట్ల సెట్‌బ్యాక్ ఉంచి వ్యాపార సముదాయలు నిర్మించుకోవాలని ఆదేశించారు. పనులను అడ్డుకుంటే చర్యలు తప్పవన్నారు. పాత మూస హోటల్ వెనక స్థలంలో మంచి నీటి బావిని ఆక్రమించి మున్సిపల్ స్థలంలో చేపట్టిన నిర్మాణాలపై చర్యలు తీసుకోనున్నట్లు స్పష్టంచేశారు. అక్రమ నిర్మాణాల తొలగింపు ఇన్‌చార్జ్, శానిటేషన్ ఇన్‌స్పెక్టర్ యేసు ఆధ్వర్యంలో కూల్చివేతలు కొనసాగాయి. కార్యక్రమంలో టీపీఎస్ సత్యనారాయణ, డీఈ గోపాల్, ఏఈ శ్రీనివాస్, జవాన్లు వినోద్ పాల్గొన్నారు.

Read latest District News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు