ప్రియమైన ముఖ్యమంత్రి గారికి...

17 Mar, 2016 02:36 IST|Sakshi
ప్రియమైన ముఖ్యమంత్రి గారికి...

‘‘మేము, అనగా నల్లగొండ జిల్లా వాసులం.. మీకు ప్రేమతో రాస్తున్న కష్టాల లేఖ ఇది. జిల్లాలో ఉన్న 35లక్షల మంది ప్రజల పక్షాన మీకు మా సమస్యలను తెలియజేసుకుంటున్నాం. పోరాడి సాధిం చుకున్న తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న మీరు మా జిల్లా అభివృద్ధిపై ప్రత్యేక దృష్టితో పనిచేస్తున్నందుకు మీకు సర్వదా రుణపడి ఉంటాము. మీతో పాటు మా జిల్లా మంత్రి జి.జగదీశ్‌రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధులంతా జిల్లా అభివృద్ధి కోసం కృషి చేస్తున్నా మా జిల్లా ఇంకా వెనుకబడే ఉంది. మానవాభివృద్ధి సూచిలో మా జిల్లా తెలంగాణలోని 10 జిల్లాల్లో 8వస్థానంలో ఉందంటే మా అభివృద్ధి ఏపాటిదో మీకు అర్థమవుతుంది. అయ్యా.. తెలంగాణ తిరుపతిగా యాదగిరిగుట్ట దేవస్థానాన్ని అభివృద్ధి చేయాలన్న ఆకాంక్షతో మీరు ప్రత్యేక దృష్టి పెట్టారు. ఈ సందర్భంగా మా సమస్యలను తెలియజేయాలని భావించి ఈ లేఖ రాస్తున్నాం.’’  
 
 
 సాగునీరు అందించాలి
ఇక సాగునీటి విషయానికి వస్తే ఈ ఏడాది బడ్జెట్‌లో మా జిల్లా ప్రాజెక్టులకు పెద్ద ఎత్తున నిధులు కేటాయించినందుకు మీకు కృతజ్ఞులం. అయితే డిండి ఎత్తిపోతల పథకం డిజైన్ ఇంతవరకు ఖరారు కాలేదు. ఈ బడ్జెట్‌లో రూ.650 కోట్ల మేర నిధులు పెట్టినా పాలమూరు నేతల పంచాయతీతో అది పెండిం గ్‌లో పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. మా జిల్లాలోని ఫ్లోరైడ్ పీడిత ప్రాంతాలైన దేవరకొండ, మునుగోడు ప్రాంతాలకు వరప్రదాయినిగా మీరు ఈ ప్రాజెక్టును రూపొందించారు. వీలున్నంత త్వరగా ఈ ప్రాజెక్టు పనులు పూర్తి చేయాలి. ప్రాణహిత-చేవెళ్ల, చొక్కారావు దేవాదులు, శ్రీరాంసాగర్ రెండో దశ లాంటి పథకాలను కూడా త్వరగా పూర్తి చేసేలా నిధులిప్పించాలని కోరుతున్నాం.
 
 మా సమస్యలివే సార్... తాగునీటి సమస్య తీవ్రతరం
 జిల్లాలో ముఖ్యంగా తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. జిల్లాలో మొత్తం 1,176 గ్రామపంచాయతీల పరిధిలో 3,300 ఆవాసాలుండగా, అందులో 300 ఆవాసాలకు ఇంతవరకు మంచినీరు లేదు. వీటికి తోడు కరువుతో జిల్లా ప్రజానీకం అల్లాడుతోంది. పెద్ద ఎత్తున నిధులు సమకూరిస్తే కానీ రానున్న వేసవిలో నీటి ఎద్దడిని తట్టుకునే పరిస్థితి లేదు. నాన్‌కంటింజెన్సీ రిలీఫ్ ఫండ్ కింద రావాల్సిన రూ.60 కోట్లను ఇప్పించాలని కోరుతున్నాం. నీటి సమస్య తీరాలంటే సాగర్ ఎడమ కాల్వకు తాగునీటి కోసం వెంటనే నీటిని విడుదల చేయాలని కోరుతున్నాం.
 
 చేనేతకు చేయూతనివ్వాలి
 జిల్లాలో మొత్తం 70 చేనేత, జౌళి సంఘాల్లో 22వేల మంది కార్మికులున్నారు. ఇందులో ఏడాది కాలంలో 26 సంఘాలు మూతపడ్డాయి. దాదాపు 10 వేల మంది ఇతర రంగాలకు వలస వెళుతున్నారు. ఆప్కో కొనుగోలు చేసే వస్త్రాలకు మూడు నెలలుగా బిల్లుల్లేవు. చేనేతలను ఆదుకునేందుకు ప్రత్యేక ప్యాకేజి ఇవ్వాలని కోరుతున్నాం. జిల్లాలో 3లక్షల ఎకరాల్లో బత్తాయి, నిమ్మ, మామిడి తోటలు సాగవుతున్నాయి. ముఖ్యంగా నకిరేకల్ ప్రాంతంలో నిమ్మ మార్కెట్ ఏర్పాటు చేయాలన్న డిమాండ్ ఉంది. బత్తాయి తోటలు సాగు చేసే రైతాంగానికి సరైన మార్కెటింగ్ కోసం మార్కెట్‌యార్డు ఏర్పాటు చేయాలి.  
 
 9గంటల కరెంట్ హామీ నెరవేర్చాలి
 జిల్లాలో 3.44లక్షల వ్యవసాయ బావులున్నాయి. వీటికి 9 గంటల పగటి విద్యుత్‌ను సరఫరా చేస్తామని మీరు హామీ ఇచ్చారు. ఏప్రిల్ తర్వాత ఎట్టి పరిస్థితుల్లో ఈ హామీ నెరవేర్చుకుంటామని మా జిల్లా మంత్రి, రాష్ట్ర విద్యుత్ మంత్రి జగదీశ్‌రెడ్డి కూడా హామీ ఇచ్చారు. ఈ హామీని నెరవేర్చాలి. అదే విధంగా జిల్లాలో దాదాపు 5లక్షల మంది రైతులు పూర్తి స్థాయిలో రుణమాఫీ కోసం ఎదురుచూస్తున్నారు. అయితే, తెలంగాణలో మా జిల్లాకు అత్యధికంగా 1100 కోట్ల రూపాయలకు పైగా రుణమాఫీ కింద ఇప్పటికే రెండు దఫాల్లో ఇచ్చారు. అది 50 శాతం మొత్తానికే సరిపోతుంది. మిగిలిన మొత్తాన్ని కూడా ఈ ఆర్థిక సంవత్సరంలోనే విడుదల చేసి వచ్చే ఖరీఫ్ నాటికయినా రైతులకు బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పించాలి.
 
 సరిపడా లేని అగ్నిమాపక కేంద్రాలు
 జిల్లాలో ప్రస్తుతం భువనగిరి, చౌటుప్పల్, నకిరేకల్, సూర్యాపేట, కోదాడ, హుజూర్‌నగర్, మిర్యాలగూడ, హాలియా, దేవరకొండ, నల్లగొండ రామన్నపేటల్లో 11 అగ్నిమాపక కేంద్రాలున్నాయి. వీటిలో నకిరేకల్‌కు సొంత భవనం లేదు. వీటితోపాటు చండూరు, మోత్కూరు, యాదగిరిగుట్ట, రాజుపేటల్లో నూతన కేంద్రాల ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపారు. వీటిని కూడా త్వరగా నిర్మించాలని మనివి.
 
 హైవే ఆస్పత్రి ఏర్పాటు చేయూలి
 జిల్లా ప్రజలకు ఆధునిక వైద్యసేవలతోపాటు, హైవే భాదితులకు తక్షణ వైద్య సేవల కోసం నార్కట్‌పల్లిలో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి ఏర్పాటు చేయనున్నట్టు మీరు 2014లో ప్రకటించారు. జిల్లాలో 65వ నంబరు జాతీయ రహదారి చౌటుప్పల్ మండలం తుఫ్రాన్‌పేట నుంచి కోదాడ మండలం రామాపురం వరకు 160కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది.  హైవేపై ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో రహదారిపై సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి ఏర్పాటు చేయించాలి.
 
 ఎంజీయూలో సమస్యల లొల్లి
 మా జిల్లా విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయంలో సమస్యలు పేరుకుపోయి ఉన్నాయి. పలు అక్రమాలు జరుగుతున్నాయని వార్తలు వస్తున్నాయి. యూనివర్శిటీకి రూ.100 కోట్ల మేర అవసరం అవుతాయని అంచనా. ఈ మొత్తాన్ని ఇప్పించాలని వేడుకుంటున్నాం.
 
 పాలేరు జలాల హామీ నెరవేర్చాలి
 ఎన్నికల ముందు సూర్యాపేటలో జరిగిన బహిరంగ సభలో అధికారంలోకి వచ్చిన వెంటనే పాలేరు వద్ద కుర్చీ వేసుకొని కూర్చొని సూర్యాపేట పట్టణానికి పాలేరు జలాలు అందిస్తానని మీరు హామీ ఇచ్చారు. అది నేటికీ కార్యరూపం దాల్చలేదు. పట్టణంలో రోజురోజుకు జనాభా పెరుగుతుండడంతో నేరాలు పెరిగిపోతున్నాయి. టూ టౌన్ పోలీస్‌స్టేషన్ ఏర్పాటుచేస్తే నేరాలు అదుపులోకి తేవచ్చు.పట్టణంలో నాలా నిర్మాణం నేటికీ పూర్తి కాలేదు. అలాగే అండర్‌గ్రౌండ్ డ్రెరుునేజీ నిర్మాణం కూడా చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. భువనగిరి డివిజన్‌లో ఎక్కువగా ఉన్న బీడీ కార్మికులు సుమారు 1000 మంది అన్ని అర్హతలు ఉండి కూడా జీవన భృతి పొందడం లేదు. వారు ఎన్నిసార్లు దరఖాస్తు చేసుకున్నా ఫలితం దక్కడం లేదు.
 
 ఆసరా పింఛన్ల కోసం ఆశగా ఎదురుచూపులు..
 జిల్లాలో ప్రస్తుతం 4లక్షల మంది ఆసరా పథకం కింద పింఛన్లు పొందుతున్నారు.మొదటి వారంలో అందే పింఛన్ ఇప్పుడు మూడో వారానికి వెళ్లింది. బయోమెట్రిక్ వ్యవస్థతో వృద్ధులు పడరాని పాట్లు పడుతున్నారు. పింఛన్ల పంపిణీలో అవినీతి కూడా జరుగుతోంది. ప్రతినెలా మొదటి వారంలో పింఛన్లు వచ్చేలా చూడాలని మనవి.
 
 వలసలు, శిశు విక్రయూలను నివారించాలి
 దేవరకొండ నియోజకవర్గంలో వలసల కారణంగా పేదరికం పెరిగిపోతోంది. పనులు లేక పొట్టచేతబట్టుకుని చందంపేట మండలంలోని 60 శాతం గ్రామాలు ఖాళీ అయ్యాయి. ఇక్కడ పనులు కల్పించాలని కోరుతున్నాం. ఇక్కడ శిశు విక్రయాల దురాచారానికి అడ్డుకట్ట వేసేచర్యలు శాశ్వత ప్రాతిపదికన తీసుకోవాలి.
 

మరిన్ని వార్తలు