హెచ్‌ఐవీ సోకిందని తప్పుడు నివేదిక

9 Jun, 2016 20:18 IST|Sakshi
హెచ్‌ఐవీ సోకిందని తప్పుడు నివేదిక

చండూరు: హెచ్‌ఐవీ సోకిందని ఆస్పత్రిలో రిపోర్ట్ ఇవ్వడంతో ఆ దంపతులు ఆత్మహత్యకు యత్నించారు. రైలు కింద పడి ప్రాణాలు తీసుకునేందుకు వెళ్లగా, బంధువుల కౌన్సెలింగ్‌తో నిర్ణయం మార్చుకున్నారు. మరో ఆస్పత్రిలో పరీక్ష చేయించగా.. అక్కడ హెచ్‌ఐవీ లేదని వైద్యులు నిర్ధారించడంతో ఊపిరి పీల్చుకున్నారు. తప్పుడు రిపోర్ట్ ఇచ్చిన వైద్య సిబ్బందిపై చర్య తీసుకోవాలని కోరుతూ బుధవారం ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు.

నల్లగొండ జిల్లా చండూరు మండల కేంద్రంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పశ్చిమ బెంగాల్‌కు చెందిన దంపతులు చండూరు మండల కేంద్రంలో ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నడుపుకుంటున్నారు. కాగా, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్ నిర్వాహకుడి భార్య గర్భం దాల్చింది. ఈ నెల 1న స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పరీక్షలు చేయించుకుంది. హెచ్‌ఐవీ సోకిందని వెంటనే జిల్లా కేంద్ర ఆస్పత్రిలో చూపించుకోవాలని అక్కడికి రెఫర్ చేశారు. దీంతో ఆ దంపతులు ఆత్మహత్య చేసుకునేందుకు నిర్ణయించుకున్నారు.

అదే రోజు జిల్లా కేంద్రంలోని రైల్వేస్టేషన్‌కు వెళ్లా రు. వీరి ప్రవర్తనపై అనుమానం వచ్చిన వారి బందువు పలుమార్లు ఫోన్ చేసి అది తప్పుడు రిపోర్ట్ అంటూ కౌన్సెలింగ్ ఇచ్చాడు. దీంతో వారు నిర్ణయం మార్చుకుని జిల్లా కేంద్ర ఆస్పత్రితో పాటు ప్రైవేట్ ఆస్పత్రిలో మళ్లీ పరీక్షలు చేయించుకోగా, హెచ్‌ఐవీ లేదని తెలిసి ఊపిరి పీల్చుకున్నారు.
 
వైద్యురాలితో వాగ్వాదం
బాధితులు విషయాన్ని వివిధ పార్టీల నాయకులకు వివరించారు. బుధవారం వారితో వెళ్లి పీహెచ్‌సీ వైద్యురాలిని నిలదీశారు. సిబ్బంది తప్పుడు రిపోర్ట్ ఇచ్చారని, తన తప్పేమీ లేదని పీహెచ్‌సీ వైద్యురాలు స్వర్ణలత వివరణ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.

మరిన్ని వార్తలు