ఆహ్లాదం.. ఆధ్యాత్మికం

1 Aug, 2016 23:28 IST|Sakshi
నల్లమల అడవి మధ్యలో కృష్ణానది అందాలు
ఆలయాలు, ప్రకృతి అందాలకు నెలవు నల్లమల
– భక్తిభావం నింపే శైవ క్షేత్రాలు 
– ఆకట్టుకునే జలపాతాలు, సుందర దృశ్యాలు 
– కనువిందు చేస్తున్న వన్యప్రాణులు 
– కృష్ణమ్మ సవ్వడుల మధ్య సాగే శ్రీశైలం
– సోమశిల లాంచీ ప్రయాణం
జాలువారే జలపాతాలు.. ఎత్తయిన కొండలు.. చూపరులను ఇట్టే ఆకట్టుకునే అందాలు.. సహజ వనరులు.. చెట్లు, చేమలు.. వన్యప్రాణుల అరుపులు.. ఆధ్యాత్మికతను పంచే ఈశ్వరాలయాలు.. వీటిని చూడడానికి ఎక్కడికో వెళ్లాల్సిన పనిలేదు. నల్లమలకు వస్తే చాలు ఇలాంటి ప్రకృతి రమణీయ దృశ్యాలు ఎన్నో కనువిందు చేస్తాయి. చుట్టూ దట్టమైన గిరులు.. కొండల నడుమ ప్రవహించే కృష్ణమ్మ.. నదిలో మత్య్సకారుల చేపల వేట... చెంచుల జీవనం.. సప్తనదుల సంగమం.. సోమశిల వైభవం.. చెంచు మ్యూజియం.. మల్లెలతీర్థం జలపాతం అందం.. ఇలా నల్లమలలోని ప్రకృతి సోయగాలు, ఆధ్యాత్మిక కేంద్రాలపై ప్రత్యేక కథనం.
– అచ్చంపేట/కొల్లాపూర్‌
కొండపై కొలువైన ఉమామహేశ్వరుడు
హైదరాబాద్‌–శ్రీశైలం జాతీయ రహదారి మీదుగా 130 కి.మీ. ప్రయాణించిన తర్వాత హజీపూర్‌ నుంచి రెండు మార్గాలున్నాయి. హజీపూర్‌–అచ్చంపేట, హజిపూర్‌–బ్రహ్మణపల్లి పిరమిడ్‌ ధ్యాన కేంద్రం మార్గం అచ్చంపేట వైపు 9కి.మీ. వెళ్లితే ఉమామహేశ్వర క్షేత్రం వస్తోంది. మహబుబ్‌నగర్‌– శ్రీశైలం వెళ్లే ప్రధాన రహదారిలో 105 కి.మీ దూరంలో అచ్చంపేట అనంతరం రంగాపూర్‌కు వచ్చి అక్కడి నుంచి ఉమామహేశ్వర క్షేత్రం వెళ్లాలి. ఈక్షేత్రం 500ల అడుగుల ఎతైన కొండపై ఉంటుంది. ఇక్కడ ఉమామహేశ్వరుడు, ఉమాదేవి, గణపతి, అయ్యప్ప కొలువై ఉన్నారు. కింది కొండ బోగమహేశ్వరంలో ఆంజనేయస్వామి వెలిశారు. రావణాసురుడిని చంపిన తరువాత శ్రీరాముడు శ్రీశైలం ప్రదక్షిణను ఉమామహేశ్వర క్షేత్రం నుంచి ప్రారంభించినట్లు స్థల పురాణం చెబుతోంది. ఈ క్షేత్రం కొండ బాణం ఆకారంలో వంపు తిరిగి ఉంటుంది. రెండు కొండలు ఒకదానిపై ఒకటి అమర్చినట్లు ఉండటం విశేషం. మొదటి కొండపై రెండోది 20 అడుగుల ఎత్తున ఉంటుంది. కింది కొండ విశాలంగా ఉండగా, పైన ఉన్న కొండ కేవలం ఐదు అడుగుల వెడల్పు మాత్రమే ఉంది. రెండవ కొండపై ఉత్తర భాగాన పాపనాశి గుండం ఉంది. ఇక్కడ రాతి పొర కింది నుంచి నీరు వస్తుంది. తోడే కిద్ది నీరు రావడం విశేషం. క్రీ.శ 1232లో కాకతీయులు ఇక్కడ ఆలయాన్ని నిర్మించారు. కొండపై వెలసిన పిల్లల మామిడి చెట్టు కింద ఉమామహేశ్వరుడు కొలువై ఉన్నాడు.  
 
చెంచులక్ష్మి మ్యూజియం
హైదరాబాద్‌–శ్రీశైలం రహదారిలో 130కి.మీ. దూరంలో మన్ననూరు వస్తుంది. నల్లమలలో జీవనం కొనసాగిస్తున్న చెంచుల జీవనశైలి తెలిపే చెంచులక్ష్మి మ్యూజియం ఇక్కడ ఉంది. చెంచుల కట్టుబొట్టు, చెంచుల కడుపు నింపుకోవడం కోసం అడవిలో సేకరించే తేనే, అటవీ ఉత్పత్తులు, విల్లంబులు వంటి బొమ్మల రూపంలో ఏర్పాటు చేశారు.
 
మద్దిమడుగు
మన్ననూరు నుంచి 52 కి.మీ. వెళితే పబ్బతి ఆంజనేయస్వామి ఆలయం దర్శించుకోవచ్చు. నల్లమల కొండలపై కృష్ణానది పశ్చిమ భాగంలో దుందుబీ నది సంగమించే రెండు నదుల కలయిక మధ్య 12కి.మీ. దూరంలో ప్రకృతి రమణీయ దృశ్యాలతో నిండిన ఈ ప్రదేశం శ్రీశైలం క్షేత్రానికి ఉత్తర దిశలో ఉంది. పలనాటి సీమ ప్రజలకు పిలిస్తే పలికే దైవం మద్దిమడుగు ఆంజనేయస్వామిని కొలుస్తారు. శ్రీశైలం వెళ్లి వచ్చే భక్తులు ఈ ఆలయాన్ని దర్శించుకుంటారు. 
 
వ్యూపాయింట్‌ 
మన్ననూరు నుంచి 16కి.మీ. ప్రయాణిస్తే ఫర్హాబాద్‌ చౌరస్తా వస్తుంది. అక్కడి నుంచి 12కి.మీ. అటవీమార్గంలో వెళితే వ్యూపాయింట్‌ కనిపిస్తుంది. అటవీశాఖ ఏర్పాటు చేసే వాహనంలోనే వెళ్లాల్సి ఉంటుంది. ఐదు నుంచి ఏడుగురు సభ్యులకు కలిపి రూ.800చార్జీని వసూలు చేస్తారు. రెండుగంటల పాటు నల్లమలలో అటవీ అందాలు, వన్య మృగాల సంచారాన్ని ప్రత్యక్షంగా వీక్షించే అవకాశం ఉంది. దారి పొడువున కొండలు, కోనలు, పక్షుల కిలకిలరావాలు, దట్టమైన అడవిలో అప్పుడప్పుడు కనిపించే నెమలి నాట్యాలు, జింకలు, దుప్పులు, కుందేళ్లు కనువిందు చేస్తుంటాయి. దాదాపు వెయ్యి అడుగులపైగా ఎత్తులో ఉండే వ్యూపాయింట్‌ నుంచి నల్లమల అందాలు ఆకట్టుకుంటాయి. 
 
మల్లెల తీర్థం
హైదరాబాద్‌–శ్రీశైలం ప్రధాన రహదారిలో వట్టువర్లపల్లి నుంచి 8కి.మీ. దూరం వెళ్లితే మల్లెలతీర్థం జలపాతం వస్తుంది. ఎత్తయిన కొండల నుంచి జాలువారే నీటి దృశ్యాలు (వాటర్‌ ఫాల్స్‌) మళ్లీమళ్లీ చూడాలనిపిస్తాయి. సూర్య కిరణాలకు చోటివ్వని చల్లని ప్రదేశమైన ఈ తీర్థానికి మతాలతో సంబంధం లేకుండా అందరూ వచ్చి ప్రకృతి ఒడిలో సేదతీర్చుకుంటారు. 500అడుగుల ఎత్తు నుంచి నిరంతరం హోరెత్తుతూ దూకే జలధార మూడు సరస్సులను నింపుతూ నల్లమల అడవి గుండా కృష్ణానదిలో కలుస్తుంది. మల్లెలతీర్థంలో మూడు ఈశ్వరుడడి విగ్రహాలు, ఏడు గుండాలున్నాయి. మల్లెలతీర్థం లోయలోకి వెళ్లేందుకు 270మెట్లు ఉన్నాయి.  
 
పాతాళగంగ
హైదరాబాద్‌–శ్రీశైలం రహదారిలో 190 కి.మీ. దూరంలో ఉన్న పాతాళగంగను చేరుకోవచ్చు. పాతాళగంగ పుష్కరఘాట్‌ నుంచి 18కి.మీ. వెళితే శ్రీశైలం మల్లిఖార్జునస్వామిని దర్శించుకోవచ్చు. పాతాళగంగ సమీపంలో దోమలపెంట, ఈగలపెంట ఉంటాయి. దోమలపెంటలో రామాలయం, ఉమామహేశ్వర ఆలయం, అయ్యప్ప, సాయిబాబా మందిరాలు దర్శించుకోవచ్చు. పుష్కరాలకు వచ్చే భక్తులకు ఇక్కడే బస ఏర్పాట్లు చేస్తున్నారు. 
 
సోమశిల
కొల్లాపూర్‌ నుంచి 9కిలోమీటర్ల దూరంలో ఉన్న సోమశిలలో ద్వాదశజ్యోతిర్లింగాలయం ఉంది. దేశంలోని 11పవిత్ర ఈశ్వరాలయాల విగ్రహరూపాలు ఇక్కడ కొలువై ఉన్నాయి. లలితాంబికా అమ్మవారి గుడి కూడా ఉంది. శతాబ్దాల చరిత్ర కలిగిన ఈ ఆలయం శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణం కారణంగా కృష్ణా బ్యాక్‌వాటర్‌లో మునిగిపోయింది. అప్పటి ప్రభుత్వం నదిలో నీరు తగ్గిన తర్వాత యధాతధంగా ఆలయ రాళ్లను తీసుకొచ్చి ఏటిగట్టున పునఃప్రతిష్టించింది. సోమశిల వద్ద సప్తనదులు సంగమం అవుతాయి. ఇక్కడ స్నానమాచరిస్తే పుణ్యఫలం లభిస్తుందని పురాణంలో పేర్కొన్నారు. సూర్యోదయం, సూర్యాస్తమయం దృశ్యాలు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. కృష్ణానదికి అవతలి వైపున కర్నూలు జిల్లా భూభాగంలో మహాభారత కాలం నాటిదిగా చెప్పుకునే సంగమేశ్వరాలయం ఉంది. ఈ గుడివర్షాకాలంలో నదిలో మునిగిపోతుంది. గుడిలోని శివలింగాన్ని ధర్మరాజు ప్రతిషి్ఠంచారని పురాణం చెబుతోంది. సోమశిల నుంచి నదిని దాటి గుడివద్దకు చేరుకోవచ్చు. ప్రస్తుతం నదిలో నీళ్లు తక్కువగా ఉన్నందున గుడిలో పూజలు జరుగుతున్నాయి. పుష్కరాల నాటికి కృష్ణానది నీటి మట్టం పెరిగితే గుడి నదిలో మునిగిపోతుంది.  
 
సింగోటం 
కొల్లాపూర్‌కు 8 కిలోమీటర్ల దూరంలో సింగోటం ఉంది. ఇక్కడ సురభి రాజవంశీయులు రెండు శతాబ్దాల  క్రితం ప్రతిషి్ఠంచిన లక్ష్మీనరసింహస్వామి ఆలయం ఉంది. ఆలయానికి ఎదురుగా కొండపై రత్నలక్ష్మీ అమ్మవారి ఆలయం ఉంటుంది. రెండు ఆలయాలకు మధ్యలో సురభిరాజులు శ్రీవారి సముద్రం చెరువును నిర్మించారు. వేలాది ఎకరాలకు సాగునీరందించే ఈచెరువును కేఎల్‌ఐ ప్రాజెక్టులో భాగంగా మినీ రిజర్వాయర్‌గా మార్చారు. పర్యాటకులకు సింగోటం గ్రామ వాతావరణం ఆహ్లాదంగా అనిపిస్తుంది. చెరువులో బోటింగ్‌ ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు ఉన్నాయి. 
 
కొల్లాపూర్‌ 
కొల్లాపూర్‌ పట్టణంలో సురభి రాజుల కోట ఆహ్లాదంతో పాటు, విజ్ఞానాన్ని  కల్పిస్తుంది. పట్టణం మధ్యలో 150ఏళ్ల క్రితం ఈ బంగ్లాను నిర్మించారు. మాధవస్వామి దేవాలయం, ఎల్లూరుకు వెళ్లే దారిలో గల పెద్దతోట బంగ్లా, ఎల్లూరు సమీపంలోని కేఎల్‌ఐ ప్రాజñ క్టు, రిజర్వాయర్‌ ప్రాంతాలు కూడా పర్యాటకులను అలరిస్తాయి.
చేరుకోవడం ఇలా... హైదరాబాద్‌ నుంచి కొల్లాపూర్‌కు 200 కిలోమీటర్ల దూరం ఉంటుంది. జడ్చర్ల, నాగర్‌కర్నూల్‌ మీదుగా ఇక్కడికి చేరుకోవచ్చు. పెబ్బేరు నుంచి 58కి.మీ., వనపర్తి నుంచి 50కి.మీ.ల దూరంలో ఉంటుంది. ఆర్టీసీ బస్సులు, ప్రైవేటు వాహనాల్లో ఇక్కడికి చేరుకోవచ్చు.
 
సోమశిల టు శ్రీశైలం లాంచీ..
 సోమశిల నుంచి శ్రీశైలం వరకు కృష్ణానదిలో ప్రయాణించేందుకు పర్యాటకశాఖ సోమేశ్వరలాంచీని ఏర్పాటు చేసింది.  సోమశిల నుంచి శ్రీశైలం వరకు పర్యాటకులకు ఒక్కొక్కరికి రాను, పోను టికెట్‌ చార్జి రూ.800లుగా నిర్ణయించినట్లు పర్యాటక శాఖ జిల్లా మేనేజర్‌ సైదులు తెలిపారు. శ్రీశైలం వరకు లాంచీలో వెళ్లి తిరుగు ప్రయాణంలో వాహనాల్లో వెళ్లేవారికి లేదా శ్రీశైలం నుంచి ఇక్కడికి వచ్చేవారికి ఒక్కొక్కరికి రూ.500గా టికెట్‌ ధర నిర్ణయించారు. వీరు ఒక రోజు భోజన సౌకర్యానికి అదనంగా రూ.100 చెల్లించాల్సి ఉంటుంది.
హైదరాబాద్‌ పర్యాటకులకు..
హైదరాబాద్‌ నుంచి వచ్చే పర్యాటకులకు రెండు రోజులు ప్యాకేజీ ధర రూ.2,900 గా నిర్ణయించారు. వీరిని తెల్లవారుజామునే హైదరాబాద్‌ నుంచి టూరిజం బస్సులో తీసుకొచ్చి సోమశిలలో లాంచీ ఎక్కిస్తారు. అక్కడ బ్రేక్‌ ఫాస్ట్‌ చేశాక నదీ ప్రయాణం ప్రారంభమవుతుంది. శ్రీశైలం వరకు నదీ ప్రయాణం 6గంటలు పడుతుంది. మధ్యలో అక్కమహాదేవి గుహలు చూపిస్తారు. శ్రీశైలంలో పర్యాటకులకు భోజనం, రూమ్‌ వసతులు కల్పిస్తారు. మరుసటిరోజు తెల్లవారుజామున శ్రీశైల మల్లిఖార్జునస్వామి దర్శనం చేయిస్తారు. అనంతరం బ్రేక్‌ఫాస్ట్‌ చేయించాక పాలధార, పంచధార, సాక్షిగణపతి, డ్యాం సైట్‌ చూపిస్తారు. అక్కడి నుంచి బస్సులో తిరుగు ప్రయాణం ప్రారంభమవుతుంది. మధ్యలో మల్లెలతీర్థం, అమ్రాబాద్‌ వ్యూపాయింట్, ఉమామహేశ్వరం, అక్కడి నుంచి నేరుగా బస్సులో హైదరాబాద్‌కు తీసుకెళ్తారు. ఇదే ప్యాకేజీలో మొదట హైదరాబాద్‌ నుంచి నేరుగా శ్రీశైలం చేరుకునే సౌకర్యం ఉంది. ఉదయం హైదరాబాద్‌ నుంచి బయల్దేరి ఉమామహేశ్వరంలో దైవదర్శనం చేసుకుని, అమ్రాబాద్‌ వ్యూ పాయింట్‌ తిలకించి, శ్రీశైలం డ్యాం సైట్, పాలధార, పంచధార, సాక్షిగణపతి చూస్తూ శ్రీశైలం చేరుకుంటారు. అక్కడ పర్యాటకులకు వసతులు కల్పిస్తారు. మరుసటి రోజు ఉదయం శ్రీశైలం మల్లిఖార్జునస్వామిని దర్శించుకున్నాక బ్రేక్‌ ఫాస్ట్‌ ఏర్పాటు చేస్తారు. ఉదయం 9:30 గంటలకు పాతాళగంగ వద్ద నుంచి సోమశిలకు బోటు ప్రయాణం ప్రారంభమవుతుంది. సాయంకాలం 4 గంటల వరకూ సోమశిలకు చేరుకుంటారు. అక్కడ ద్వాదశ జ్యోతిర్లింగాల దర్శనం అనంతరం నేరుగా బస్సులో హైదరాబాద్‌కు తీసుకువెళ్తారు. బోటు ప్రయాణం చేయాలనుకునే వారు  WWW.TELANGANA TOURISAM.GOV.INద్వారా ఆన్‌లైన్‌ టికెట్లను బుక్‌ చేసుకోవచ్చు. పూర్తి వివరాలకు సెల్‌ నంబర్‌. 9010007152ను సంప్రదించవచ్చు. 
 
 
మరిన్ని వార్తలు