నల్సార్ లో నేటినుంచి జాతీయ సదస్సు

19 Mar, 2016 03:33 IST|Sakshi
నల్సార్ లో నేటినుంచి జాతీయ సదస్సు

హాజరుకానున్న సీఎం కేసీఆర్

 శామీర్‌పేట్:  శామీర్‌పేట్ నల్సార్ లా యూనివర్సిటీలో ఈనెల 19, 20 వ తేదీల్లో రెండు రోజులపాటు ‘పేదల భూసంబంధ న్యాయపరమైన అవసరాలు, సేవలు, అనుభవాలు, ఆశలు’ అనే అంశాలపై జాతీయ సదస్సు నిర్వహించనున్నట్లు యూనివర్సిటీ రిజిష్ట్రార్ ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి శుక్రవారం సాయంత్రం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. నల్సార్‌లో నిర్వహించనున్న ఈ సదస్సును ముఖ్యఅతిథిగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ప్రారంభిస్తారని తెలిపారు. ముఖ్యమంత్రితోపాటు సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులు, ఇతర ప్రముఖులు రానున్నట్లు తెలిపారు.

 పేద ప్రజలకు భూసంబంధమైన అంశాలపై న్యాయ సహాయం సేవలను అందించడంపై నిర్వహించనున్న సదస్సును నల్సార్ లా యూనివర్సిటీ, లాండెస్సా సంస్థ సంయుక్తంగా ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు వివరించారు. 2013 నుంచి రెండు సంస్థలు పేదప్రజలకు భూసంబంధమైన అంశాలపై న్యాయ సహాయం చేసేందుకు సెంటర్లు ఏర్పాటు చేసి, ఉచితంగా న్యాయ సలహాలు సూచనలు అందించే శిక్షణా కార్యక్రమాలు నిర్వహించినట్లు వివరించారు. వరంగల్ జిల్లాలో ప్రారంభమైన తమ సేవలు నర్సంపేట్, జనగామల్లో సెంటర్లు ఏర్పాటు చేసి సేవలు అందిస్తున్నట్లు వివరించారు. ఇప్పటివరకు సుమారు మూడు వేల మందికి శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు. నల్సార్ లా యూనివర్సిటీ ప్రాంగణంలో నూతనంగా ఏర్పాటు చేసిన యూనివర్సిటీ నూతన సభాప్రాంగణాన్ని శనివారం సాయంత్రం 4 గంటలకు రాష్ట్రముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ప్రారంభించనున్నట్లు తెలిపారు. అనంతరం నల్సార్‌లో నిర్వహించనున్న రెండు రోజుల సదస్సులో ఆయన మాట్లాడుతారని చెప్పారు. సీఎంతోపాటు సుప్రీం కోర్డు న్యాయమూర్తులు జస్టిస్ అనిల్ ఆర్.దేవ్, దీపక్ మిశ్రా, ఎన్‌వీ.రమణ, దిలీప్ బి.బోస్లేలతోపాటు పలువురు ప్రముఖులు హాజరు కానున్నట్లు వివరించారు.  

మరిన్ని వార్తలు