అంగ‘రంగ’ వైభవమే..

30 Apr, 2017 00:16 IST|Sakshi
రాజమహేంద్రవరం కల్చరల్‌ : 
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర చలనచిత్ర, టి.వి.నాటకరంగ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో కందుకూరి రంగస్థల పురస్కారాలకు శ్రీవేంకటేశ్వర ఆనం కళాకేంద్రం ముస్తాబైంది. ఈ పురస్కారాలతో పాటు 20వ నంది నాటక బహుమతుల ప్రదానోత్సవం కూడా ఇదే వేదికపై జరగనుంది.
నేపథ్యం ఇదీ..
నవయుగ వైతాళికుడు, యుగపురుషుడు కందుకూరి వీరేశలింగం జయంతి రంగస్థల దినోత్సవంగా ప్రకటించాలని మాజీ శాసన సభ్యుడు రౌతు సూర్యప్రకాశరావు దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డిని కోరారు. ఆయన సానుకూలంగా స్పందించి ఈ మేరకు ఉత్తర్వులు విడుదల చేశారు. వైఎస్‌ అకాలమరణంతో కొంత స్తబ్ధత ఏర్పడింది.
అవార్డుల వివరాలివీ..
ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరి నెలల్లో విజయనగరం, గుంటూరు, కర్నూలు పట్టణాల్లో జరిగిన నందీ నాటకోత్సవాల్లో విజేతలకు ముఖ్య అతిథుల చేతులమీదుగా నంది నాటక బహుమతులను అందిస్తారు. ప్రతి జిల్లానుంచి ఎంపిక చేసిన ఐదుగురు కళాకారులకు కందుకూరి విశిష్ట పురస్కారాలను, రాష్ట్రవ్యాప్తంగా ఎంపిక చేసిన ముగ్గురికి కందుకూరి ప్రతిష్టాత్మక పురస్కారాలను అందజేస్తారు. కందుకూరి విశిష్ట పురస్కారాలకు ఎంపికైన వారికి రూ.10,000/ నగదు, ప్రశంసాపత్రాలను అందజేస్తారు. కందుకూరి ప్రతిష్టాత్మక పురస్కారాలకు ఎంపికైన వారికి ఒకొక్కరికి రూ.లక్ష నగదు పురస్కారం, ప్రశంసాపత్రాలు అందజేస్తారు. ప్రముఖ రంగస్థలనటుడు గుమ్మడి గోపాలకృష్ణకు నందమూరి తారక రామారావు పురస్కారం–2016ను అందజేస్తారు. ఈ పురస్కారం కింద అవార్డు గ్రహీతకు రూ.1.50 లక్షల నగదు, ప్రత్యేక జ్ఞాపిక, ప్రశంసాపత్రాలతో సత్కరిస్తారు.
 
మరిన్ని వార్తలు