వీసీగా నాలుగు లక్ష్యాలను ఎంచుకున్నా

22 Apr, 2017 22:58 IST|Sakshi
వీసీగా నాలుగు లక్ష్యాలను ఎంచుకున్నా
మూడు పూర్తయ్యాయి
అనూర్ వార్షికోత్సవ సభలో వీసీ
రాజరాజనరేంద్రనగర్‌ (రాజానగరం) : ఆదికవి నన్నయ యూనివర్సిటీ ఉపకులపతిగా బాధ్యతలు చేపట్టిన నాడే నాలుగు లక్ష్యాలను ఎంచుకున్నట్టు  ఆచార్య ఎం. ముత్యాలునాయుడు తెలిపారు. వాటిని సాధించడంలో నన్నయ యూనివర్సిటీ సిబ్బంది అంతా ఒకే కుటుంబంలా త్రికరణశుద్ధితో  పనిచేశారంటూ అభినందించారు. యూనివర్సిటీ ఆవిర్భావ దినోత్సవం శనివారం ఘనంగా నిర్వహించారు. ఆ సందర్భంగా వీసీ మాట్లాడుతూ నాలుగు లక్ష్యాలలో మొదటిది తెలుగు రాష్ట్రాలలోనే అతిపెద్ద యూనివర్సిటీగా అనూర్ అందరికీ తెలిసేలా చేయడం, రె‍ండోది యూనివర్సిటీకి నిధులు సమీకరించడం, మూడోది అనూర్ పరిధిలో ఉన్న ఆంధ్రా యూనివర్సిటీ కళాశాలలను బదిలీ చేయడం అని తెలిపారు. ఈ మూడు లక్షా ‍్యలు పూర్తయ్యాయన్నారు. నాల్గో  లక్ష్యంగా ఎంచుకున్న 12 బీ గుర్తింపు కోసం ప్రయత్నించామని, గురు, శుక్రవారాలలో యూజీసీ కమిటీ సభ్యులు కూడా ఇక్కడకు వచ్చి, యూనివర్సిటీ పరిస్థితులను, సాధించిన ప్రగతిని పరిశీలించి సంతృప్తిని వ్యక్తం చేశారన్నారు. శ్రీకృష్ణదేవరాయులు యూనివర్సిటీ అధ్యాపకులు ఆచార్య పీఎల్‌ శ్రీనివాస్‌ మాట్లాడుతూ సమష్టి కృషితో ఏదైనా సాధించవచ్చని నన్నయ యూనివర్సిటీ సిబ్బంది నిరూపించారన్నారు.  2006 ఏప్రిల్‌లో ప్రారంభమైన నన్నయ యూనివర్సిటీ నేటి వరకు ఎదుర్కొన్న వివిధ సమస్యలు, సాధించిన విజయాలను పలువురు వక్తలు ప్రస్తావించారు. మొక్కలు నాటారు..
అనూర్ ఆవిర్భావ దినోత్సవంతోపాటు ప్రపంచ ధరిత్రీ దినోత్సవం కూడా కావడంతో ఉపకులపతి ఆచార్య ముత్యాలునాయుడు యూనివర్సిటీ ఆవరణలో మొక్కలు నాటారు. రిజిస్ట్రార్‌ ఆచార్య ఎ. నరసింహరావు,  డిప్యూటీ కమిషనర్‌ కృష్ణారెడ్డి, డిప్యూటీ రిజిస్ట్రార్‌ ఎస్‌. లింగారెడ్డి, డీన్‌ ఆచార్య ఎస్‌. టేకి, ప్రిన్సిపాల్స్‌ ఆచార్య కేఎస్‌ రమేష్, ఆచార్య పి. సురేష్‌వర్మ, డాక్టర్‌ ఎ.  మట్టారెడ్డి, డాక్టర్‌ వై. శ్రీనివాసరావు, డాక్టర్‌ పి. శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
మరిన్ని వార్తలు